వస్త్ర దుకాణంలో చోరీ
ABN, First Publish Date - 2023-02-20T00:46:50+05:30
ద్రాక్షారామలో సత్య శారీమందిర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు యువకులు చోరీకి పాల్పడి రూ 1.44,700 అపహరించారు.
రూ.1.44 లక్షలు అపహరణ
సీసీ కెమెరాకు చిక్కిన దొంగలు
ద్రాక్షారామ, ఫిబ్రవరి 19: ద్రాక్షారామలో సత్య శారీమందిర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు యువకులు చోరీకి పాల్పడి రూ 1.44,700 అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. ద్రాక్షారామ కోటిపల్లి రోడ్డులో ఉన్న వస్త్రదుకాణం సత్యశారీ మందిర్‌లో ఆదివారం తెల్లవారు జామున 3.50 గంటల ప్రాంతంలో ఇరువురు యువకులు షాపు షట్టర్ తాళం వేసేందుకు షట్టర్‌కు ఉన్న భాగం గునపంతో బద్దలుగొట్టారు. లోపలికి ప్రవేశించారు. అనంతరం క్యాష్ కౌంటర్‌ను సెల్‌ఫోన్ టార్చివేసి పరిశీలించారు. చేతులతో తీయడానికి ప్రయత్నించారు. రాకపోవడంతో గునఫంతో కౌంటర్ సొరుగును తెరిచారు. అందులో నగదు అపహరించారు. ఇదంతా షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. కాగా పనిమీద 4.30గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన వస్త్రదుకాణం యజమాని బేతా శివప్రసాద్ అటుగా వెళుతూ షట్టర్ కొంచెం తెరచి ఉండటం గమనించాడు. షాపులో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన వస్త్రదుకాణానికి క్లూస్ టీం బృందం చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఇతర ఆధారాలు పరిశీలించారు. బేతా శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ జ్యోతిబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ వినోద్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తే చోరీకి పాల్పడిన ఇరువురు మైనరు యువకులు మాదిరిగా కనిపిస్తున్నారు. ఒక యువకుడు మూతికి మాస్క్‌కట్టుకోగా మరో యువకుడు ముఖానికి ఏమీ పెట్టుకోలేదు. ఎడమ చేతిపై టాటూ గుర్తు ఉంది.
Updated Date - 2023-02-20T00:46:52+05:30 IST