ఒక్కడినీ పట్టుకోలేదే
ABN, First Publish Date - 2023-06-17T01:38:23+05:30
పిఠాపురంలో హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్కడినీ పట్టుకోలేదని, పిచ్చివాడు చేసిన సంఘటనగా చిత్రీకరించారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీపాదశ్రీవల్లభుడు జన్మస్థలం, శక్తిపీఠం, కుక్కుటేశ్వరస్వామి, దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పాదగయ క్షేత్రం కొలువై ఉన్న పిఠాపురం రాగానే తనకు ఇక్కడ జరిగిన విగ్రహాల ధ్వంసం సంఘటన గుర్తుకు వచ్చిందని తెలిపారు.
హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేసినా చర్యలు ఉండవా
ఆధునికీకరణను రివర్స్ చేసి ఏలేరు రైతులను నిండా ముంచారు
తవ్వేకొద్ది వైసీపీ దోపిడీ బయటకు వస్తోంది
మట్టిని అడ్డగోలుగా తరలించేస్తున్నారు
కాకినాడ ఎమ్మెల్యే అవినీతి చిట్టా అమిత్‌షా దగ్గర ఉంది
పిఠాపురాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతా
ఇక్కడ ఆఫీసు ఏర్పాటు చేస్తా
కులం, మతం చూడవద్దు.. సమర్థుడిని ఎన్నుకోండి
పిఠాపురం బహిరంగసభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్
పిఠాపురం, జూన్ 16: పిఠాపురంలో హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఒక్కడినీ పట్టుకోలేదని, పిచ్చివాడు చేసిన సంఘటనగా చిత్రీకరించారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీపాదశ్రీవల్లభుడు జన్మస్థలం, శక్తిపీఠం, కుక్కుటేశ్వరస్వామి, దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పాదగయ క్షేత్రం కొలువై ఉన్న పిఠాపురం రాగానే తనకు ఇక్కడ జరిగిన విగ్రహాల ధ్వంసం సంఘటన గుర్తుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని ఆలయాలపై దాడులు జరిగినా, విగ్రహాలు ధ్వంసం చేసినా ఒక్కరినీ పట్టుకోకుండా పిచ్చివాళ్లు చేసిన సంఘటనలుగా చెప్పారన్నారు. దీని వెనుక కుట్ర ఉందని, హిందువులకు ఇతర మతస్తులపై ఆగ్రహం తెప్పించి కలహాలు సృష్టించాలని చూశారని ఆరోపించారు. తాను చేపట్టిన యాగంలో ధర్మపరిరక్షణ గురించి ఇక్కడ చెప్పడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. శ్రీపాదశ్రీవల్లభ ఆల యానికి సంబంధించి ట్రస్టుకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం ఉందని, అయినప్పటికీ మహారాష్ట్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వచ్చిన ఆదాయం ఎటుపోతుందో తెలియడం లేదని చెప్పారు. దేవదాయ శాఖ తన ఆధీనంలోకి ఆలయాన్ని తీసుకున్నా ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిఠాపురాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా, నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని, ఆధ్యాత్మిక రాజధానిగా కూడా చేస్తానని ప్రకటించారు. హిందూ దేవాలయాల అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసిందని విమర్శించారు.
ఏలేరు ఆధునికీకరణను రివర్స్ చేశారు
పిఠాపురం నియోజకవర్గంలో 27 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఏలేరు ఆధునికీకరణ పనులపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్ విమర్శించారు. 24 టీఎంసీలు నిల్వ ఉండే రిజర్వాయర్ నిర్మించిన తర్వాత వరదనీరు పోయే కాలువలు ఏర్పాటుచేయలేదని తెలిపారు. దీంతో ఎక్కడిక్కడ వరద నీరు చేరి తాగునీరు కలుషితం కావడంతోపాటు గొల్లప్రోలు పట్టణంతో సహా పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. వరద, మురుగు నీటిలోనే విద్యార్థులు వర్షాకాలం సమయంలో నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తున్నదని తెలిపారు. ఏలేరు, సుద్దగడ్డ వరదల కారణంగా ఇప్పటివరకూ వెయ్యి కోట్లకుపైగా నష్టం జరిగిందని తెలిపారు. మరోవైపు సాగునీరు అందక మూడు పంటలు పండేచోట ఒక పంట మాత్రమే పండుతున్నదన్నారు. ఏలేరు ఆధునీకరణకు రూ.300-400 కోట్లు ఇస్తానని చెప్పి సీఎం జగన్ అప్పటివరకూ జరుగుతున్న పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమి మాట్లాడడం లేదని, ఆధునికీకరణ కోసం ఏమీ చేయలేదని తెలిపారు. ఆయన ఏమి చేస్తున్నారో తెలియదని వ్యాఖ్యానించారు.
రోజుకు రూ.2 కోట్ల మట్టిని కాకినాడ ఎమ్మెల్యే తరలిస్తున్నారు
పిఠాపురం నియోజకవర్గం 52 గ్రామాల్లోని చెరువుల్లో రోజుకి రూ.2 కోట్లు విలువైన మట్టిని రోజూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అతని అనుచరులు తరలిస్తున్నారని పవన్‌కల్యాణ్ ఆరోపించారు. రోజు 300-400 లారీల మట్టిని అమ్ముకుని కోట్లు గడిస్తున్నారన్నారు. మట్టి తవ్వకాల గురించి ఎవరైనా ప్రశ్నించినా, అడిగినా కాకినాడ ఎమ్మెల్యే దగ్గర ఉండే భీమాస్ రెడ్డి జేబులో పిస్టల్ ఉంచుకుని బయటకు తీసి బెదిరిస్తున్నాడని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసు లు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మీరందరూ కలిస్తే వారు ఎక్కడ ఉంటారని, ఇటువంటి వారందరినీ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇటువంటి వారి కాళ్లు విరగ్గొట్టాలని ఆవేశంగా అన్నారు. వీరి చరిత్ర గురించి పూర్తిగా కాకినాడలో విప్పి మాట్లాడతానని ప్రకటించారు. ద్వారంపూడి అవినీతి, అక్రమాల చిట్టా అంతా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్దని తెలిపారు. గంజా యిలోనే ఈయన పాత్ర ఉందన్నారు. తవ్వేకొద్దీ వైసీపీ నేతల దోపిడీ బయటకు వస్తోందన్నారు.
గోదావరి జిల్లాలకు పునర్వైభవం తీసుకువస్తా
గోదావరి జిల్లాలకు పునర్వైభవం తీసుకువస్తానని పవన్ ప్రకటించారు. గోదావరి ఈ నేలను ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో తాను అదేవిధంగా ఉన్నంతకాలం తాను ఈ నేలపైనే ఉంటా నని తెలిపారు. కాటన్ స్ఫూర్తితో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జనసేన కదిలితే ఎలా ఉంటుందో అందరికీ చూపిస్తున్నామని తెలిపారు. పట్టురైతులు సమస్యల గురించి వెళుతున్నానంటే వారికి రావాల్సిన రూ.7 కోట్ల బకాయిల్లో రూ.3 కోట్లు ఇస్తామని అధికారులు చెప్పారని చెప్పారు. ఉప్పాడ-కాకినాడ రహదారి కోతకు గురికావడంతోపాటు వందల గృహాలు సముద్రంలో కలిసిపోతున్నాయని తెలిపారు. కోత సమస్య పరిష్కారానికి ఇక్కడి ప్రజాప్రతినిధు లు ఏమి చేయడం లేదని విమర్శించారు. రెండు రోజులపాటు గొల్లప్రోలులో ఉండి జనవాణి ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు పురప్రముఖులను కలుసుకుని అందరి అభిప్రా యాలు తెలుసుకున్నానని పవన్ తెలిపారు. చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఇలా అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాకినాడకు తమ ఆడబిడ్డలను పంపాలంటే భయం వేస్తున్నదని ఒక మహిళ తన ముందు ఆవేదన వ్యక్తంచేసిందని చెప్పారు. తునిలో ఒక మంత్రి ఉన్నాడని, అతని వద్ద పనిచేసేవారు ఒక ఆడబిడ్డ ఆస్తులను ఆక్రమించుకున్నారని, న్యాయం కోసం ప్రశ్నిస్తే పిచ్చివారిగా ముద్రవేసి ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఏ ఊరిలో ఎవ్వరు తప్పు చేస్తున్నారో జాబితాలు సిద్ధం చేయాలని, జనసేన అధికారంలోకి రాగానే ప్రజాకోర్టులు నిర్వహించి, వారిని ఉక్కుపాదంతో అణిచివేద్దామన్నారు. సభలో నాగబాబు, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, స్థానిక నాయకులు మాకినీడి శేషుకుమారి, డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ దీపిక, కడారి తమ్మయ్యనాయుడు, మురాలశెట్టి సునీల్‌కుమార్, జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
పవన్ తదుపరి పర్యటన ఇలా..
సర్పవరం జంక్షన్, జూన్ 16: జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో పవన్‌కల్యాణ్ వారాహి యాత్ర శనివారం నుంచి మంగళవారం దాకా జరుగుతుంది. పవన్ పర్యటన వివరాలు ఇవీ.. 17వ తేదీ శనివారం కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు సిటీకి చెందిన ప్రముఖులు, 11 గంటలకు జనవాణి కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తారు. 12 గంటలకు వీర మహిళతో సమావేశం అనంతరం లంచ్ బ్రేక్. సాయంత్రం 5 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబ సభ్యులతో భేటీ ఉంటుంది. 18వ తేదీ ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో సర్పవరం జంక్షన్‌లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. 19వ తేదీ సోమవారం రూరల్ నియోజకవర్గంలో పలు వర్గాలతో మాట్లాడతారు. ఉదయం 10 గంటలకు ప్రముఖులతో భేటీ, 11 గంటలకు వీర మహిళలతో సమావేశం, సాయంత్రం 4 గంటలకు క్షేత్రస్థాయి పర్యటన (అర్బన్ పరిఽధి), సాయంత్రం 5 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులతో పవన్ సమావేశం నిర్వహిస్తారు. 20వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారు. 12 గంటలకు ముస్లిం వర్గాల ప్రతినిధులతో సమావేశం, 4 గంటలకు కాకినాడ నుంచి వారాహి వాహనంపై ముమ్మిడివరం నియోజకవర్గానికి బయలుదేరి వెళతారు. కాగా నాగమల్లితోట ముత్తా క్లబ్‌కు శుక్రవారం రాత్రి పవన్‌కల్యాణ్ చేరుకున్నారు.
Updated Date - 2023-06-17T01:38:23+05:30 IST