పంచాయతీలకు దూరంగా ‘ఉపాధి’
ABN, First Publish Date - 2023-12-09T04:13:17+05:30
దేశ వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతుంటే మన రాష్ట్రంలో మాత్రం వైసీపీ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
కేంద్ర మార్గదర్శకాలు బేఖాతరు.. సర్పంచ్‌లతో సంబంధం లేకుండానే పనులువైసీపీ సర్కారు ఉపాధి హామీ పథకాన్ని గ్రామ పంచాయతీలకు దూరం చేసింది. పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ పథకంపై సర్కార్ పెత్తనం చేస్తోంది. సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా, వారితో సంబంధం లేకుండా పనులు చేపడుతోంది. ఇప్పటికే పంచాయతీ భవనాలను సర్పంచ్‌ల నుంచి లాక్కొని సచివాలయాలను ఏర్పాటు చేసుకున్న సర్కార్.. ఉపాధి పనుల్లోనూ సర్పంచ్ ప్రమేయం లేకుండా చేయడంపై వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించి సర్కార్ పెత్తనం
పనుల్లో జవాబుదారీతనం మృగ్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దేశ వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతుంటే మన రాష్ట్రంలో మాత్రం వైసీపీ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పంచాయతీ సర్పంచ్‌ల నేతృత్వంలో జరగాల్సిన పనులను కొంత మంది కాంట్రాక్టు ఉద్యోగులతో చేపడుతోంది. ఏటా పనుల మంజూరుకు మాత్రమే సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీల తీర్మానాలను వాడుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో గానీ, కూలీలకు పనులు కల్పించడంలో గానీ, గ్రామాల్లో చేపట్టే పనుల గురించి గానీ.. సర్పంచ్‌లకు కనీస ప్రమేయం లేకుండా చేయడంతో గమనార్హం. ప్రభుత్వ అధికారులకు ఈ పనులపై అజమాయిషీ ఇస్తూ విడుదల చేసిన జీఓ 139ను బుట్టదాఖలు చేశారు. స్థానికంగా గ్రామ పంచాయతీలకు గాని, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఎవరికీ అధికారాలు ఇవ్వకుండా పనులు చేపట్టడంతో ఈ పనుల్లో జవాబుదారీ తగ్గిపోయిందని పలువురు పేర్కొంటున్నారు.
కాంట్రాక్ట్ సిబ్బంది హవా!
భూగర్భ జల వనరులు పెంచడంతో పాటు వ్యవసాయ అనుబంధ పనులు ఉపాధి పథకంలో చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణతో పాటు రికార్డుల నిర్వహణ కూడా కాంట్రాక్టు సిబ్బందిపై పడటంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉపాధి పథకంలో పనుల అంచనాలను రూపొందించి మంజూరు చేసే వరకు ప్రక్రియ పూర్తి చేయడం, జాబ్‌కార్డులను అప్‌డేట్ చేయడం, ఆయా పనులకు సంబంధించి సైట్ వద్ద సమాచార బోర్డులు ఏర్పాటు చేయడం, రిజిస్టర్లు నిర్వహించడం ప్రభుత్వ అధికారుల ప్రధాన బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు అంశాలపైనే తనిఖీ నిర్వహిస్తుంది. గత ఏడాది కేంద్ర తనిఖీ బృందాలు ఏ గ్రామానికెళ్లినా ఈ విషయాలపైనే ఎక్కువగా ఆరా తీశాయి. అయితే, పనులు సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ.. వారడిగిన రికార్డులు చూపించలేకపోతే పథకం నిర్వహణపై కేంద్ర అధికారులకు అనుమానాలు ఏర్పడతాయని అధికారులు హడావుడి చేయాల్సి వచ్చింది. వాస్తవానికి చట్టం ప్రకారం ఈ పనులు నిర్వహించాల్సిన సిబ్బందికి ఆయా పనులు అప్పజెప్పకపోవడంతో ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉపాధి హామీ పథకంలో ఏయే విధులు ఏయే అధికారులు చేపట్టాలన్న విషయంపై 2014లోనే ప్రభుత్వం 139 జీవోను విడుదల చేసింది. అయితే ఒక్క ఎంపీడీవో తప్ప మిగతా ఏ అధికారీ ఈ పథకంలో జోక్యం చేసుకోవడం లేదు. ఎంపీడీవోతో పాటు మండలపరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఈవో పీఆర్ అండ్ ఆర్డీ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శులకు కూడా జాబ్‌చార్ట్ నిర్దేశిస్తూ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ పథకంలో చెల్లింపులకు సంబంధించి ఎంపీడీవోదే ప్రధాన బాధ్యత అయినప్పటికీ.. మిగిలిన అధికారులు, సిబ్బంది కూడా పనుల నిర్వహణలో జవాబుదారీగా ఉంటారు. అయితే రాష్ట్రంలో ఎంపీడీవో మినహాయించి ఎవరూ ఉపాధి బాధ్యతలు నిర్వహించడం లేదు. దీంతో ఎంపీడీవో కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడి పనులకు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించిన రికార్డుల నిర్వహణలో కూడా ప్రైవేట్ సిబ్బందిపై ఆధారపడాల్సి వచ్చింది. అలాగే, పంచాయతీల్లో ఉపాధి పనుల నిర్వహించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. సకాలంలో వేతనాలు అందేలా చూడటం వీరి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే వీరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆయా పనుల్లో జవాబుదారీతనం లోపించింది. ఇక, ప్రధానంగా ఈ పథకంలో గ్రామాల్లో సర్పంచ్‌లకు ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకునే అధికారం కూడా లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్‌లు సూచించిన పనులేవీ ఉపాధి పథకంలో జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. సిమెంట్‌రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఏవైనా నిధులు మంజూరైనా సర్పంచ్‌ల ఆధ్వర్యంలో కాకుండా ఆ గ్రామ వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ పనులు నిర్వహిస్తున్నారు.
చట్టానికి విరుద్దంగా పనులు...
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు విశేష అధికారాలు కల్పించినట్లు చట్టాలు చెప్తున్నా.. రాష్ట్రంలో గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల ఉనికి మాత్రం కరువైపోతోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నింటినీ దారి మళ్లించి పంచాయతీ ఖాతాలను ఖాళీ చేశాయి. గ్రామాల్లో కనీసం తన ఉనికి చాటుకోవాల్సిన సర్పంచ్‌లు నిధులతో పాటు విధులు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయామని వాపోతున్నారు.
Updated Date - 2023-12-09T04:13:19+05:30 IST