‘మార్గదర్శి’పై సర్కారుకు చుక్కెదురు!
ABN, First Publish Date - 2023-08-12T03:01:04+05:30
మార్గదర్శి వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.
రిజిస్ట్రార్ ఇచ్చిన పబ్లిక్ నోటీసు సస్పెన్షన్
ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్‌కు ఆదేశం
హైకోర్టులో విచారణ 4 వారాలకు వాయిదా
అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆ సంస్థకు సంబంధించిన చిట్‌గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసు ఆధారంగా ఎటువంటి తదుపరి చర్యలను తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఆ నోటీసులను నిలుపుదల చేసింది. ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉన్న చిట్‌గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ ఈ ఏడాది జూలై 30న చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసులతో పాటు వాటి ఆధారంగా చిట్ గ్రూపులను మూసివేయడాన్ని సవాల్ చేస్తూ మార్గదర్శి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాల పై ఇటీవల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్ల పై తీర్పును రిజర్వ్ చేసింది.
ఉత్తర్వుల్లో ఏముందంటే.....
‘‘ప్రభుత్వ ప్రోద్బలంతో ఇచ్చిన చిన్న ఫిర్యాదులు తప్ప చిట్ గ్రూపుల మూసివేత పై చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తరువాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు. మఽధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ చిట్ గ్రూపుల మూసివేత విషయంలో అభిప్రాయాలు కోరుతూ రిజిస్ట్రార్ పబ్లిక్ నోటీసులు జారీ చేయడమంటే చట్టనిబంధనలు అడ్డుపెట్టుకొని( లీగల్ మ్యాలెస్) ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహారిస్తుందన్న సీనియర్ న్యాయవాది వాదనలో బలం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో మార్గదర్శి వ్యాజ్యాలకు విచారణార్హత ఉందని అభిప్రాయపడుతున్నాం. 2008లో ఇచ్చిన ముసాయిదా ప్రొసీడింగ్స్ మేరకు చిట్ గ్రూపుల మూసివేతకు డిప్యూటీ రిజిస్ట్రార్‌కు సైతం చర్యలు ప్రారంభించే అధికారం ఉందన్న అడ్వకేట్ జనరల్ వాదనలో కొంత బలం ఉందని భావించినప్పటికీ ఆ విషయాన్ని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత పరిశీలించాల్సి ఉంది. చిట్ గ్రూపులను మూసివేయడాన్ని సవాల్ చేస్తూ చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలు, ప్రస్తుతం మార్గదర్శి సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ఈ నేపధ్యంలో పిటిషన్లను జతచేసి విచారించడం అవశ్యమని అభిప్రాయపడుతున్నాం. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే పిటిషనర్లకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ పిటిషనర్ల వైపే ఉందని అభిప్రాయపడుతున్నాం. చిట్ గ్రూపుల మూసివేతను సవాల్ చేస్తూ చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలలో నోటీసును సస్పెండ్ చేస్తూ ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాం. ప్రస్తుత పబ్లిక్ నోటీసు ఆధారంగా రిజిస్ట్రార్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తే వివిధ బ్రాంచ్‌లకు చెందిన అనేక గ్రూపుల పై ప్రభావం పడుతుంది. మార్గదర్శి వాదించినట్లు.. ఆ సంస్థ పై గ్రూపుల మూసివేత పర్యావసానం ఉంటుంది. ఈ నేపధ్యంలో రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసును సస్పెండ్ చేస్తున్నాం’’ అని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.
Updated Date - 2023-08-12T03:01:04+05:30 IST