ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 Capitals Fraud:‘మూడు’... మోసం!

ABN, First Publish Date - 2023-02-15T03:25:38+05:30

‘మూడు రాజధానులు’ అనే మాట ఒట్టి ముచ్చటే! కర్నూలు న్యాయ రాజధాని కాదు! అమరావతి శాసన రాజధానిగా ఉండదు. అసలు ‘మూడు రాజధానులు’ అనేదే తప్పుగా వెళ్లిన సందేశం! సమాచార లోపం! ఈ మాట చెప్పింది ఎవరో కాదు! స్వయానా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3 రాజధానులు ‘మిస్‌ కమ్యూనికేషన్‌’

కొత్త మాట చెప్పిన మంత్రి బుగ్గన

విశాఖ నుంచే పరిపాలన సాగుతుంది

కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపుల్‌ సీట్‌

గుంటూరులో ఒక విడత అసెంబ్లీ భేటీ

అంతమాత్రాన అవి ‘రాజధానులు’ కావు

బెంగళూరులో ఆర్థిక మంత్రి కొత్త పాట

విశాఖలో ఐటీ సెక్టార్‌ను ఉద్ధరిస్తారట!

రుషికొండ పార్క్‌లో సగం భవనాలు ఖాళీ

గతంలో ఇచ్చిన రాయితీలకు స్వస్తి

మూడు ప్రాంతాలకూ మోసమే!

అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘మూడు రాజధానులు’ అనే మాట ఒట్టి ముచ్చటే! కర్నూలు న్యాయ రాజధాని కాదు! అమరావతి శాసన రాజధానిగా ఉండదు. అసలు ‘మూడు రాజధానులు’ అనేదే తప్పుగా వెళ్లిన సందేశం! సమాచార లోపం! ఈ మాట చెప్పింది ఎవరో కాదు! స్వయానా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి! మంగళవారం బెంగళూరులో జరిగిన... ‘బెంగళూరు ఇండస్ట్రీ మీట్‌’లో బుగ్గనతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై... ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘‘మీరు మూడు రాజధానులు అంటున్నారు. మాకు తిరుపతి చాలా దగ్గర. విశాఖపట్నం చాలా దూరం. తిరుపతిని గ్రోత్‌ ఏరియాగా ఎందుకు అభివృద్ధి చేయకూడదు? అలాగే... విజయవాడ కూడా ఉంది కదా!?’’ అని ఒక ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి బుగ్గన చిత్రమైన సమాధానమిచ్చారు.

తిరుపతిలో ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి చెప్పకుండా... మళ్లీ ‘విశాఖ’కే వెళ్లిపోయారు. అంతేకాదు... అసలు మూడు రాజధానులనేవే లేవని తేల్చి చెప్పారు. ‘‘మూడు రాజధానులనేది ఒక మిస్‌ కమ్యూనికేషన్‌! పరిపాలన విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల దృష్ట్యా చూస్తే... రాజధానిగా అదే ఉత్తమం. తదుపరి అభివృద్ధికీ అవకాశం ఉంటుంది. ఓడ రేవు ఉంది. కాస్మొపాలిటన్‌ కల్చర్‌, వాతావరణం... అన్ని రకాలుగా విశాఖ అనుకూలం! ఇక... కర్నూలు రెండో రాజధాని కాదు. అక్కడ హైకోర్టు ఉంటుందంతే. కర్ణాటకకు ధార్వాడ, గుల్బర్గాలో హైకోర్టు ధర్మాసనాలున్నాయి. అలాగే... కర్నూలులో హైకోర్టు పిన్సిపల్‌ బెంచ్‌ ఉండాలని భావించాం. హైకోర్టు ఒకచోట, రాజధాని మరో చోట ఉండాలని 1937నాటి శ్రీబాగ్‌ ఒప్పందం చెబుతోంది. ఇక... కర్ణాటకలోని బెళగాంలో ఒక విడత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే... ఒక సెషన్‌ గుంటూరులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం’’ అని బుగ్గన వివరించారు. తిరుపతి ఆధ్యాత్మికంగా ప్రపంచానికే రాజధాని అని అభివర్ణించారు. వెరసి... సుమారు మూడేళ్లుగా ‘మూడు రాజధాను’ల పేరుతో జనం చెవిలో పూలు పెట్టినట్లు ఒప్పుకొన్నట్లయింది. బుగ్గన తన సమాధానంలో ‘అమరావతి’ పేరే ప్రస్తావించలేదు. న్యాయ రాజధాని, శాసన రాజధాని గురించీ చెప్పలేదు. ‘కర్నూలులో హైకోర్టు ఉంటుంది కానీ, అది న్యాయ రాజధాని కాదు! గుంటూరులో ఒక విడత శాసనసభ సమావేశాలు జరుగుతాయి. అయినంత మాత్రాన దానిని శాసన రాజధానిగా పిలవకూడదు’ అని చెప్పకనే చెప్పారు.

ఇంత మోసమా...

అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించిన జగన్‌ సర్కారు ‘మూడు’ ముక్కలాట మొదలుపెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌... పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని అంటూ మూడు రాజధానుల ముచ్చట గురించి అసెంబ్లీలో వివరించారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులోనూ పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని అని ప్రస్తావించారు. వైసీపీ నేతలు, మంత్రులు మూడు రాజధానుల పేరిట ఊదరగొడుతూనే ఉన్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఉండటంతో... ‘పరిపాలన వికేంద్రీకరణ’ బిల్లును వెనక్కి తీసుకున్నారు. రాజధాని రైతులతో కుదిరిన చట్టబద్ధ ఒప్పందాలు, రాష్ట్ర విభజన చట్టం, ఇతర నిబంధనల దృష్ట్యా అమరావతే రాష్ట్ర రాజధాని అని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. రాజధాని అభివృద్ధికోసం హైకోర్టు విధించిన గడువులపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. వెరసి... ఏ రకంగా చూసినా ఇప్పుడు రాష్ట్రానికి అమరావతే రాజధాని. రాష్ట్రస్థాయి కార్యాలయాలేవీ ఇక్కడి నుంచి తరలించేందుకు వీల్లేదు. పైగా... అమరావతే రాజధాని అని చెప్పిన తర్వాత కూడా పాదయాత్రలు, ర్యాలీలు ఏమిటని హైకోర్టు ఒక సందర్భంలో మండిపడింది. అయినా సరే... మంత్రులు, నేతలు ‘త్వరలో విశాఖకు. ఏప్రిల్‌లో విశాఖకు. కొన్ని నెలల్లో విశాఖకు’ అని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన ‘పాలన విశాఖ నుంచే జరుగుతుంది. అదే రాజధాని అని బెంగళూరు వేదికగా చెప్పేశారు. ఆయన పక్కనే ఉన్న మంత్రి అమర్నాథ్‌ సైతం ‘కొన్ని నెలల్లో విశాఖ రాజధాని అవుతుంది’ అని తెలిపారు.

వ్యూహాత్మకంగానేనా?

బెంగళూరులో మంత్రి బుగ్గన వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారా... అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఏమాత్రం తమకు అనుకూలమైన నిర్ణయం వెలువడినా... హుటాహుటిన విశాఖ తరలి వెళ్లేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారు. మళ్లీ ‘మూడు రాజధానుల’ బిల్లు పెట్టకుండా... రాజధాని ‘మార్పు’ అనే పదం ప్రయోగించకుండా... ‘కార్యాలయ తరలింపు’ అంటూ అమరావతిలో ఉన్న ఆఫీసులను విశాఖకు తరలించే అవకాశముందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పేరుకు అన్ని ప్రాంతాల అభివృద్ధి... అంటున్నప్పటికీ అమరావతి నుంచి రాజధానిని తరలించడమే ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. ఎందుకంటే... తాజాగా బుగ్గన చెప్పినట్లుగా కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్‌ సీట్‌ (అంటే హైకోర్టు) పెట్టడం అంత ఈజీ కాదు! ఒకసారి రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారా ఏర్పాటైన హైకోర్టును తరలించాలంటే... చాలా ప్రక్రియ ఉంది. హైకోర్టులోని మెజారిటీ న్యాయమూర్తులు అంగీకరించి, సుప్రీంకోర్టు అంగీకరిస్తేనే ఇది జరుగుతుంది. మరోవైపు... ఇప్పటిదాకా అమరావతిలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని, ఇది కూడా రాజధానే అని చెబుతూ వచ్చారు. కానీ... ఇది కూడా ఒట్టిదే అని బుగ్గన తేల్చేశారు. బెళగాంలో కర్ణాటక అసెంబ్లీ ఒక సెషన్‌ జరిగినట్లే, గుంటూరులో ఏపీ అసెంబ్లీ ఒక విడత సమావేశమవుతుందని చెప్పారు.

అన్నీ ధ్వంసం చేసి ‘ఐటీ జపం’

పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ నగరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి... అని పారిశ్రామిక ప్రతినిధులు ప్రశ్నించారు. ‘ఐటీ’ అని బుగ్గన సూటిగా సమాధానమిచ్చారు. ‘ఐటీకి విశాఖలో సరైన వాతావరణం ఉంది’ అని తెలిపారు. మంత్రి అమర్నాథ్‌ కల్పించుకుని ‘ఐటీ ఈజ్‌ ది ఓన్లీ సెక్టార్‌’ అని గొప్పగా చెప్పారు. నిజానికి... వైసీపీ సర్కారు రాగానే విశాఖలో ఐటీని అటకెక్కించింది. రుషికొండ ఐటీ పార్కులోని భవనాల్లో సగం ఖాళీగా ఉన్నాయి. ఏపీఐఐసీ కట్టిన ఎనిమిది అంతస్తుల టవర్‌-1లో నాలుగు అంతస్తుల్లో కాండ్యుయెంట్‌ కంపెనీ నడుస్తోంది. దీనిని కూడా ఖాళీ చేయించాలని అనుకున్నా... తర్వాత ఆగిపోయారు. ఇక... టవర్‌-2 నిర్మాణం ఎప్పుడో పూర్తయినా మొత్తం భవనం ఖాళీగా ఉంది. పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందిన రుషికొండ సమీపంలో ఉన్న ఐటీ పార్కుకు ఒక్క బస్సు కూడా లేదు. ఏసీ బస్సులు వేయాలని నాలుగు నెలల కిందట మంత్రి చెప్పినా ఇప్పటికీ దిక్కులేదు. చీకటి పడితే స్ట్రీట్‌ లైట్లు కూడా వెలగవు. టీడీపీ హయాంలో ఇచ్చిన అన్ని రకాల రాయితీలను వైసీపీ సర్కారు ఎత్తేసింది. ఇదీ విశాఖలో ‘ఐటీ’ పరిస్థితి. విశాఖను ఐటీ కాన్సెప్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని రెండేళ్ల కిందట గొప్పగా చెప్పారు. ఇప్పటికీ... కాన్సెప్టూ లేదు. సిటీ లేదు. రుషికొండ ఐటీ పార్కుకే దిక్కులేకపోగా... విశాఖకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురంలో ‘ఐటీ పార్కు’ పెడతామని ఇటీవల అధికారులు చెప్పడం విశేషం!

అంటే... గోంగూరా?

ఆంధ్రప్రదేశ్‌లో జూట్‌ (జనపనార), సైజల్‌ (కలబంద తరహా మొక్క నుంచి తీసే నార) పరిశ్రమల గురించి ఒక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక రాష్ట్ర అధికారులు తికమక పడ్డారు. ‘ఈ రంగంలో మా రాష్ట్రంలో మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా?’ అని అడిగారు. పెట్టుబడులు వచ్చేలా సహకరించగలనని ఆయన బదులిచ్చారు. జూట్‌ అంటే... జనపనార!: ‘సైజల్‌’ అంటే ఏమిటో తెలియక ‘గోంగూరా?’ అని రాష్ట్ర అధికారి అడిగారు. అది కలబంద తరహాలో ఉండే మొక్క అని ఆ ప్రతినిధి వివరించాల్సి వచ్చింది.

Updated Date - 2023-02-15T10:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising