Chandrababu: ‘సూపర్ సిక్స్’తో కుటుంబానికి 6 లక్షలు
ABN, First Publish Date - 2023-06-20T02:57:32+05:30
ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లు మనవే కావాలి. మంచి అభ్యర్థులను పెట్టుకుని గట్టిగా పనిచేస్తే సీట్లన్నీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో
175 సీట్లూ మనవే కావాలి
మంచి అభ్యర్థులతో గట్టిగా పనిచేయాలి
పులివెందులలో కూడా గెలిచి చూపిద్దాం
ఊరికో సైకో తయారీయే జగన్ ప్రగతి
విశాఖలో బతకలేనని వైసీపీ ఎంపీ అన్నారు
వచ్చే 150 రోజులూ ప్రజల్లోనే ఉండండి
టీడీపీ సర్వసభ్య భేటీలో చంద్రబాబు పిలుపు
125 అసెంబ్లీ సీట్లలో బస్సు యాత్రలు
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ‘ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లు మనవే కావాలి. మంచి అభ్యర్థులను పెట్టుకుని గట్టిగా పనిచేస్తే సీట్లన్నీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానిని అందుకునే స్థాయిలో మనం పనిచేయాలని.. పులివెందులలో కూడా ఈసారి మన జెండానే ఎగరాలని.. గెలిచి చూపిద్దామని పార్టీ నేతలకు పిలుపిచ్చారు. సోమవారం ఇక్కడి తమ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సర్వ సభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఇటీవల టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో సరాసరిన ప్రతి కుటుంబానికీ రూ.6 లక్షల వరకూ అదనపు ఆదాయం సమకూరుతుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసు మహిళలు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 వంతున ఇస్తాం. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ తలకు రూ.15 వేలు ఇస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. జిల్లా వరకూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సమకూరుస్తాం. ఇది మొదటి విడత మేనిఫెస్టో. ప్రజల్లోకి వెళ్లి ఇంకా విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకుని మరింత విపులంగా సమగ్ర మేనిఫెస్టోను దసరా నాటికి విడుదల చేస్తాం. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పైసా డబ్బులు ఖర్చు చేయలేదు.
అయినా మొత్తం మూడు సీట్లలో ఘన విజయం సాధించాం. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప.. సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా మనకే ఆధిక్యం వచ్చింది. తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో బీసీ వర్గాల ఆడబిడ్డ అనూరాధను నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్సీని చేశాం. ఆకాశంలో విహరిస్తున్న ముఖ్యమంత్రి ఈ ఫలితాల దెబ్బకు నేలకు దిగి వచ్చాడు’ అని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపంలో బ్రహ్మాండ మైన ఆయుధాలు అందించామని.. కురుక్షేత్ర సమరంలో విజయం సాధించేవరకూ విశ్రమించవద్దని టీడీపీ శ్రేణులను కోరారు. ‘ఈ విజయం మీ కోసం, నా కోసం కాదు. రాష్ట్రం కోసం. ప్రజల జీవితాలను అధోగతి పాల్జేసి రాష్ట్రాన్ని పతనం చేసిన దిక్కుమాలిన పాలనకు పాతర వేసి.. మళ్లీ మంచి భవిష్యతను అందివ్వడానికి మనం గెలుపు సాధించాలి. వచ్చే 150 రోజులూ ప్రజల్లోనే ఉండాలి’ అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. వాటాలు రాబట్టుకోవడానికి ఇసుక, మద్యం విక్రయాల్లో కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఏ రోజు వాటాలు ఆ రోజు పంచుకుంటున్నారు. ఈ డబ్బు చాలలేదని మైనింగ్ సెస్ వసూలుకు జిల్లాకో ఏజెన్సీని కొత్తగా తెచ్చారు. వాటాల వసూలే వీరి పని. చివరకు తిరుమల ఆలయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు అని అన్నారు.
ఈయనా ఉద్ధరించేది! టీడీపీ ఐదేళ్ల పాలనలో కరెంటు చార్జీలు పైసా కూడా పెంచలేదు. ఇప్పుడు ఈ అవినీతి పాలన వల్ల నాలుగేళ్లలో ఏడుసార్లు పెరిగాయి. రెండు రూపాయలకు వస్తున్న సౌర విద్యుత వద్దని రూ.10 పెట్టి బయట కరెంటు కొంటున్నారు. ఆ ఖర్చంతా జనం నెత్తిన వేసి కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. సరాసరిన ప్రతి కుటుంబం నెత్తిన ఈ నాలుగేళ్లలో రూ.4 లక్షల మేర భారం మోపారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. నేను చేసే పనిలో కనీసం 20 శాతమైనా ఆయన చేయగలడా? రోజుకో సమావేశం పెడితే గొప్ప. సాయంత్రమైతే పబ్జీ ఆడుకోవడం ఆయనకు తెలిసిన గొప్ప పని.
- చంద్రబాబు
Updated Date - 2023-06-20T05:43:33+05:30 IST