AP Transport Department New 'Collection' Zones: కొత్తగా ‘కలెక్షన్’ జోన్లు!
ABN, First Publish Date - 2023-03-20T01:29:05+05:30
రాష్ట్ర రవాణా శాఖలో కొత్తగా నాలుగు జోన్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే!. ఇందుకోసం అవసరమైన కసరత్తు మొత్తం పూర్తయింది. అయితే..
రవాణాశాఖలో నాలుగు జోన్ల లక్ష్యం అవినీతే!?
వసూళ్లలో అదనపు పద్దు అంటున్న ఆర్టీఏ సిబ్బంది
ఆర్టీవో, డీటీసీలకే పనిలేదు.. జేటీసీలు ఎందుకో?
కమిషనరేట్లో పని ఉన్నా రాబోమంటున్న జేటీసీలు
పదోన్నతుల కోసం కలెక్షన్లు.. పోలీసు శాఖలో
ఐజీలనే తీసేస్తే ఆర్టీఏకి జేటీసీలు అవసరమా?
సందేహాస్పదంగా సర్కారు తీరు
అవినీతికి పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తేలేదంటున్న జగన్ హెచ్చరికలు.. మాటలకే తప్ప చేతల్లో కాదని తెలుస్తోంది! ప్రభుత్వ ఆదాయ వనరుల్లో ఒకటైన రవాణా శాఖలో సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి కొందరు అధికారులు వేసిన ఎత్తుగడ సఫలీకృతమైంది. రవాణా శాఖలో చక్రం తిప్పే రాయలసీమ ‘సారు’ ఒకరు భారీగా వసూళ్లు చేసి ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వారితో నడిపిన రాయబారం ఫలించింది. జిల్లాల్లో ఆర్టీవో, డీటీసీలకే పూర్తి స్థాయిలో పనిలేకపోగా.. స్వలాభం కోసం ఇప్పుడు అదనం
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర రవాణా శాఖలో కొత్తగా నాలుగు జోన్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే!. ఇందుకోసం అవసరమైన కసరత్తు మొత్తం పూర్తయింది. అయితే.. జిల్లాల్లోనే కొంతమంది రవాణాశాఖాధికారులకు పూర్తిస్థాయి పనిలేనప్పుడు ఇక జోన్లు ఎందుకనే అనుమానాలు రాకమానవు. కానీ.. ‘చెక్ పోస్టులు ఉన్నాయిగా!! రాష్ట్రంలోకి వచ్చిపోయే వాహనాలను సరిహద్దుల్లో ఆపితే అంతకు మించిన కలెక్షన్లు ఇంకెక్కడుంటాయి!?’ ఇదీ సొంత వనరులను పెంచుకునేందుకు ఆ శాఖలో రాటుదేలిన అవినీతి అధికారుల పన్నాగం. ఇందులో భాగంగా.. అవినీతిని సహించబోమన్న ప్రభుత్వ పెద్దను.. రాయలసీమలో చక్రం తిప్పుతున్న ఆ శాఖలోని ఓ సారు ఒప్పించి సాధించినట్లు చెప్పుకొంటున్నారు.
తొలుత బ్రేక్ పడింది గానీ..!
రవాణాశాఖలో అవసరం కోసం కొన్ని పోస్టులు (వంద మంది) కావాలంటూ ఉన్నతాధికారులు గత ఏడాది ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం శాఖలో ఇద్దరు జేటీసీలు మాత్రమే పని చేస్తున్నారని, మరో నలుగురికి పని ఉందంటూ ప్రతిపాదించారు. క్లరికల్ సిబ్బందిని ఏపీఎ్‌సఆర్టీసీ ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలంటూ సలహా ఇచ్చిన ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు కమిషనరేట్లో కీలక స్థానాల్లో(ఐటీ, ప్రాజెక్టులు, ఆదాయ లక్ష్యం, విజిలెన్స్, రోడ్ సేఫ్టీ, అడ్మిన్ ఇతరత్రా..) పనిచేసేందుకు ప్రమోషన్ల ఫైలు కదిపింది. అయితే సొంత ఆదాయం కోసం కొందరు డీటీసీలు వేసిన ఎత్తుగడలు గమనించిన క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. పదోన్నతులతో పాటు రెండు వైపులా ఆదాయ మార్గాలను వేసుకుని జోన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు పథక రచన చేశారని, తమకు మరో అదనపు పద్దు భారం అవుతుందని గుర్తు చేశారు. విస్తుపోయిన ఉన్నతాధికారులు.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(జేటీసీ) నుంచి ఏఎంవీఐ వరకూ పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో నాలుగు జోన్లకు జేటీసీలను నియమించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత శాఖలోని రాయలసీమకు చెందిన సార్ తీసుకున్నారు. ప్రభుత్వంలో పలుకుబడిన కలిగిన అమాత్యుడొకరి ద్వారా చక్రం తిప్పారు. ఆయన్ను ‘శాంతపరచడం’ కోసం సుమారు కోటిన్నర వరకూ వసూళ్లు చేసినట్లు శాఖలో ప్రచారం జరుగుతోంది. ఏదైతేనేం.. ఎట్టకేలకు జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం మార్చి మొదటి వారంలో అంగీకరించింది. ఉత్తరాంధ్ర జిల్లాలు మొదటి జోన్ కిందికి... ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు జోన్ 2లో... గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు జోన్ 3గా.. రాయలసీమ జిల్లాలు నాలుగో జోన్‌లో ఉన్నాయి. వాటికి ప్రత్యేకంగా బాస్‌లు అవసరం లేక పోయినా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో జేటీసీలను నియమించాలంటూ చేసిన రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఫలించాయి.
పోలీసు శాఖ జోన్లు తీసేసినా...
ఏకంగా 70వేల మంది పోలీసులు పనిచేస్తున్న పోలీసుశాఖలో ఐజీలనే గత ప్రభుత్వం పక్కనబెట్టింది. రాయలసీమ, గుంటూరు, కోస్తా ప్రాంతాలకు ముగ్గురు ఐజీలు ఉండేవారు. జిల్లా ఎస్పీ పరిధిలో ఉండే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఏఎ్‌సఐ వరకూ.. ఎస్‌ఐల వ్యవహారం ఎస్పీ, సీఐల పోస్టింగ్‌లు, పనిష్మెంట్లు డీఐజీ చూసుకుంటారని డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక మేరకు ఈ చర్యలు తీసుకుంది. అయితే పట్టుమని వెయ్యి మంది సిబ్బంది లేని రవాణా శాఖలో ఇప్పుడు నాలుగు జోన్లు, వాటికి ప్రత్యేక కార్యాలయాలు అవసరమా.? అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. రాయల సీమలో ఇద్దరు, కోస్తాలో ఇద్దరు డీటీసీలకు జేటీసీలుగా పదోన్నతులు లభిస్తే ఆ నలుగురి స్థానంతోపాటు అదనంగా మరో ఇద్దరు ఆర్టీవోలకు డీటీసీగా పదోన్నతి లభిస్తుంది. జిల్లాల పెంపు నేపథ్యంలో ఆర్టీవో పోస్టులు కూడా పెరిగినందున 13మంది సీనియర్ ఎంవీఐలకు ఆర్టీవోలుగా ప్రమోషన్ రాబోతోంది. ఏఎంవీఐలకు హోదా పెరుగుతుంది. ఏఎంవీఐలు సైతం ఎంవీఐలుగా ఒక మెట్టు పైకొస్తారు. ఇదంతా వివరించి ఒక సార్ కోటిన్నర వరకూ కలెక్షన్లు చేశారనే నివేదిక ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. అయితే ఒక పెద్ద రెడ్డి గారి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో చర్యలు తీసుకోవడం కాదు కదా.. కనీసం బ్రేకు కూడా వేయలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా ఆ కలెక్షన్ సార్‌పై భక్తిని బాలాజీ పాదాల చెంత సన్మానించి చాటుకోవడానికి కొందరు సిబ్బంది రెడీ అయినట్లు తెలుస్తోంది.
కోట్లలో ఆదాయం.. అందుకే..!
రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులు.. రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి నోట్లకట్టలు కురిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, మన్యం జిల్లాలోని చింతూరు నుంచి వచ్చే ఆదాయం రోజుకు లక్ష పైనే ఉంటుందని చెబుతున్నారు. ఏ వాహనం ఆపినా వంద, రెండొందలు, ఐదు వందలు ఇవ్వాల్సిందే. కాకినాడ జిల్లా తేతగుంట, ఏలూరు జిల్లాలో జంగారెడ్డి గూడెం, కృష్ణా జిల్లాలోని తిరువూరు, గరికపాడు చెక్ పోస్టులు ధన రాశులేనని అంటున్నారు. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచర్ల చెక్ పోస్టుల నుంచి వచ్చే ఆదాయం చూసిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ‘వసూళ్లు మాకొదిలేయండి.. మీకెంత కావాలో చెప్పండి.. నెలా, నెలా ఇచ్చేస్తాం’ అని ఆఫర్ ఇవ్వడంతో అధికారులే అవాక్కయ్యారు. తిరుపతి జిల్లా తడ, రేణిగుంట చెక్‌పోస్టుల్లో పోస్టింగ్ అంటే ఏడాదిలో అక్కడ పనిచేసిన అధికారి కోటీశ్వరుడవడం ఖాయమంటున్నారు. చిత్తూరు జిల్లాల నరహరిపేట, పలమనేరుల్లోనూ ఆదాయం కోట్లల్లోనే ఉంటుంది. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టులో ఐదుగురు అధికారులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.లక్ష ఆదాయం ఉంటుందని, అనంతపురం జిల్లా పెనుకొండ సైతం మంచి చెక్ పోస్టేనని అంటున్నారు.
Updated Date - 2023-03-20T02:16:52+05:30 IST