ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి పోరు.. 1200 రోజులు

ABN, First Publish Date - 2023-03-31T00:40:26+05:30

రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడిన రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు సాగిస్తున్న మహోద్యమం శుక్రవారంనాటికి 1200 రోజులకు చేరుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మహోజ్వల భవిష్యత్తు కోసం.. మట్టి మనుషులు చేసిన మహా పోరాటమది.. మామూలు మనుషులు నిర్మించిన మహోద్యమమది.. నమ్మిన నాయకుడి నయవంచనపై సాగించిన అలుపెరుగని సమరమది. రాష్ట్రం కోసం, రాజధాని కోసమని ప్రాణానికి ప్రాణమైన పంటపొలాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అన్నదాతలు వంచనపై ఎగరేసిన తిరుగుబాటు బావుట అది. పాలకుల దుర్మార్గాలు, పాలకపార్టీ నేతల దౌర్జన్యాలు, ప్రభుత్వాధికారుల వేధింపులు, పోలీసుల అణచివేతలు, లాఠీల కాఠిన్యాలు, గుండెలను పిండిచేసే మాటల తూటాలు, అవమానాలు, చీత్కారాలు.. ఇలా ఎన్ని వచ్చినా, ఏమి చేసినా సడలని సహనం వారి ఆభ‘రణం’. త్యాగాలు, ఆత్మ బలిదానాలతో వెయ్యురోజులు సాగిన ఉద్యమ ప్రస్థానం మరో మైలురాయిని చేరుతోంది. శుక్రవారంనాటికి 1200వ రోజుకు చేరుకుంటుంది.

గుంటూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడిన రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు సాగిస్తున్న మహోద్యమం శుక్రవారంనాటికి 1200 రోజులకు చేరుకుంటోంది. నమ్మిన నాయకుడు నయవంచన చేయడంతో విధిలేని పరిస్థితిలో మొదలైన అన్నదాతల ఉద్యమం వారి పోరాటం, త్యాగాలు, ఆత్మబలిదానాలతో రాష్ట్ర ప్రజలందరి ఉద్యమంగా మారింది. రాజధాని రైతులు, మహిళలు, రైతుకూలీలు, దళిత బహుజనులు, మైనారిటీలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పోలీసుల నిర్బంధాలు, కవాతులు, లాఠీల కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమోడుతున్న గాయాలు.. ఏవీ వారి పోరాట పటిమను ఏనాడూ దెబ్బతీయలేకపోయాయి. దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘకాలం పాటు క్రియాశీలకంగా సాగిన ఉద్యమం మరొకటి లేదంటే అతిశయోక్తి కాకపోవచ్చు.

పోరాటానికి నాంది ఇలా..

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూసమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. 5 ఎకరాలలోపు వారు 8,500 మంది ఉన్నారు. ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది. రాజధాని నిర్మాణంపై ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న వారికి 2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన మూడు రాజధానుల ఆలోచన రాజధాని వాసులను కుదిపేసింది. ఆ మర్నాడే అంటే 2019 డిసెంబరు 18న రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం క్రమంగా రాజధాని గ్రామాలకు విస్తరించింది.

ఉద్యమ గమనంలో అపూర్వ ఘట్టాలు ఎన్నో..

మూడు రాజధానుల ప్రకటన వచ్చిన మరుసటి రోజు, డిసెంబరు 18న రాజధాని ఉద్యమం మొదలయింది. 2020 జనవరి 10న దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకునేందుకు వెళుతున్న మహిళలపై పోలీసులు దాడిచేశారు. అప్పటి గుంటూరు ఎస్పీ విజయరావు లాఠీలతో మహిళలపై విరుచుకుపడ్డాడు. దీనిపై హైకోర్టు జనవరి 13న సూమోటోగా కేసు నమోదు చేసింది. 2020 జనవరి 20న అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ ముట్టడిని భగ్నం చేయడానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేయని ప్రయత్నం లేదు.

ఫ జూలై 4న 200 రోజు సందర్బంగా 200 నగరాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఉద్యమానికి మదకదతు తెలిపారు. అక్టోబరు 12న 300 రోజు సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా తుళ్లూరులో రాజధాని గ్రామాల రైతులు ‘ఆత్మబలిదాన యాత్ర’ పేర భారీ ప్రదర్శన నిర్వహించారు. 2021 జనవరి 20న 400 రోజు సందర్భంగా రైతులు చేపట్టిన ‘రాజధాని సంకల్ప ర్యాలీ’ విజయవంతమయింది. 2021 ఏప్రిల్‌ 31న 500 రోజు సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, ఐకాస నేతలు ప్రధాని మోదీకి లేఖలు రాశారు. 2021 ఆగస్టు 8న 600 రోజు సందర్భంగా అమరావతి నుంచి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకూ ర్యాలీకి పిలుపునిచ్చారు.

మహోజ్వల ఘట్టం ‘న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర’

2021 నవంబర్‌ 1 చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకూ రాజధానిపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలన్నింటినీ ఈ పాదయాత్ర తిప్పికొట్టింది. అమరావతి ప్రజలందరి రాజధాని అని ప్రపంచానికి చాటింది. నవంబర్‌ 1న హైకోర్టు వద్ద మొదలై డిసెంబరు 17న తిరుమల తిరుపతి దేవస్థానం చేరే వరకూ 57 రోజుల పాటూ సాగిన ఈ సుదీర్ఘ పాదయాత్రలో రైతులు పాదయాత్ర చేపట్టారు. నవంబరు 16న అమరావతి ఉద్యమం 700వ రోజుకు చేరుకుంది. అదే రోజు మహాపాదయాత్ర ప్రకాశం జిల్లా కందుకూరుకు చేరుకుంది. ఈ పాదయాత్రకు అక్కడ విశేష స్పందన లభించింది. 2022 ఫిబ్రవరి 24న 800 రోజు సందర్భంగా యువకులు పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలు నిర్వహించారు.

చరిత్రాత్మక తీర్పుతో రైతులకు తిరుగులేని విజయం

మార్చి 4వ తేదీన హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మూడు రాజధానుల చట్టాన్ని కొట్టివేస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లోగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. అయితే ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే సాహసం ప్రభుత్వం ఇప్పటి వరకూ చేయకపోవడం విశేషం.

ఫ జూన్‌ 4న 900 రోజు సందర్భంగా రైతులు న్యాయదేవతకు క్షీరాభిషేకం చేశారు. విజయవాడలో ‘హైకోర్టు తీర్పు- సర్కారు తీరు’ పేరిట సదస్సు నిర్వహించారు. సెప్టెంబరు 12కి అమరావతి ఉద్యమం మొదలై వెయ్యి రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా అమరావతి టూ అరసవల్లి పేరిట 630 కిలో మీటర్ల మేర మహాపాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు.

1200వ రోజుకు మహోద్యమం

రాజధాని ఉద్యమం మార్చి 31 నాటికి 1200 రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా భారీ కార్యక్రమం ఏర్పాటు దిశగా రాజధాని రైతులు, గ్రామాల ప్రజలు అడుగులు వేస్తున్నారు. రాజధాని ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తూ మందడం దీక్ష శిబిరంలో ‘దగాపడ్డ రైతులు- దోపిడీకి గురవుతున్న ఆంధ్ర ప్రజలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దళిత జేఏసీ, మైనార్టీ జేఏసీ, రాజధాని ఐక్య కార్యచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి యుక్తంగా చేపట్టే కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Updated Date - 2023-03-31T00:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising