Jagan Govt Liquor Sales: తాగండి..తాగి ఊగండి!
ABN, First Publish Date - 2023-06-30T02:02:44+05:30
మేం అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం’... ఎన్నికల ముందు ఊరూ వాడా జగన్ ఇచ్చిన హామీ ఇది. జరిగింది ఏమిటంటే...
లక్ష కోట్ల మందు అమ్మకం.. జగన్ సర్కారు రికార్డు
‘మేం అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం’... ఎన్నికల ముందు ఊరూ వాడా జగన్ ఇచ్చిన హామీ ఇది. జరిగింది ఏమిటంటే... అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల మద్యం విక్రయించి జగన్ సర్కారు సరికొత్త రికార్డు సృష్టించింది. 2019-20 నుంచి బుధవారం నాటికి విక్రయించిన మద్యం విలువ రూ.1,01,599 కోట్లు. ఉమ్మడి రాష్ట్రం సహా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత భారీగా మందు అమ్మిన తొలి ప్రభుత్వం ఇదే.
నాలుగేళ్లామూడు నెలల్లో రూ.1,01,599 కోట్లు
ఉమ్మడి రాష్ట్రం, ఏపీ చరిత్రలో ఇదే అత్యధికం
అమ్మకాల ద్వారా రూ.86,722 కోట్ల ఆదాయం
సంక్షేమ పథకాలకు మూడో వంతు నిధులివే
సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ గాలికి
‘షాక్’ కొట్టే రేట్లతో పేదల జేబులు గుల్ల
(అమరావతి-ఆంధ్రజ్యోతి): తాగండి.. తాగి ఊగండి అన్నట్టుగా జగన్ సర్కారు జోరుగా మద్యం విక్రయాలు సాగిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో రోజుకు సగటున రూ.50 కోట్ల మద్యం అమ్మగా.. ఈ ప్రభుత్వంలో రోజుకు సగటు అమ్మకాలు రూ.80 కోట్లకు చేరాయి. నెలకు దాదాపు రూ.2300 కోట్ల మద్యం విక్రయిస్తోంది. ఈ ఏడాది మే నెలలో అయితే మద్యం అమ్మకాలు ఏకంగా రూ.2667 కోట్లకు చేరాయి. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం 2019-20 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు మొత్తం రూ.91,893కోట్ల విలువైన మద్యం అమ్మారు. ఆ తర్వాత మార్చిలో రూ.2,355 కోట్లు, ఏప్రిల్‌లో రూ.2,359 కోట్లు, మేలో రూ.2,667 కోట్లు, జూన్‌లో (28వ తేదీ వరకు) రూ.2325 కోట్ల మద్యం విక్రయించారు. మొత్తం కలిపి నాలుగేళ్ల మూడు నెలల్లో రాష్ట్రంలో 1,01,599కోట్ల విలువైన మద్యం అమ్మారు. రోజువారీ అమ్మకాల్లో సుమారు రూ.60కోట్ల మద్యం షాపుల్లో, మరో రూ.20కోట్ల విలువైన మద్యం బార్లలో విక్రయిస్తున్నారు. కాగా టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు రూ.75,284 కోట్ల మద్యాన్ని విక్రయించింది. ‘బటన్లు’ నొక్కుతున్నాం... నేరుగా ఖాతాల్లోకి నగదు వేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... అందులో దాదాపు మూడో వంతు నిధులు మద్యం అమ్మకాల ద్వారా సేకరిస్తోంది. గత నాలుగేళ్లలో ఇప్పటి వరకూ సుమారు 3లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశామని జగన్ చెబుతున్నారు. 2019-20 నుంచి ఇప్పటి వరకూ మద్యం అమ్మకాల ద్వారా సర్కారుకు రూ.86,722 కోట్ల ఆదాయం వచ్చింది. దీన్నిబట్టి.. సంక్షేమ పథకాలకు చేస్తున్న ఖర్చులో దాదాపు మూడో వంతు మద్యం అమ్మకాల నుంచే వచ్చిందన్నమాట.
‘షాక్’ కొట్టేలా రేట్లు
గత ప్రభుత్వం, జగన్ సర్కారులో పరిస్థితులను చూస్తే రోజువారీ కూలిపై ఆధారపడి జీవించేవారి సంపాదనలో పెద్దగా మార్పు లేదు. అప్పట్లో రోజుకు సగటున రూ.400 సంపాదించేవారు. ఇప్పుడు కూడా దాదాపు అంతే వస్తోంది. నిర్మాణ రంగం కుదేలవడంతో చాలా రంగాల్లో పనిచేసే కూలీలను దెబ్బతీసింది. తాపీ పనివాళ్లతో పాటు రవాణా కూలీలు, సెంట్రింగ్ కార్మికులు, ఎలక్ర్టీషియన్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, మార్బుల్స్ పరిచేవారు... ఇలా చాలామంది ఉపాధిపై ప్రభావం పడింది. పేదల ఆదాయం పెరగకపోగా.. మరోవైపు మద్యం రేట్లు భారీగా పెరిగాయి. గత ప్రభుత్వంలో ఒక క్వార్టర్ మందు మీడియం రకం రూ.90 నుంచి రూ.110కి వచ్చేది. జగన్ సర్కారు ‘షాక్’ కొట్టేలా రేట్లు పెంచడంతో క్వార్టర్ మద్యం ధర రూ.200కు చేరింది. మందుకు అలవాటుపడిన కూలీలు గతంలో తమ సంపాదనలో పావు వంతు ఖర్చు చేస్తే, ఇప్పుడు 50 శాతం వరకూ ఖర్చవుతోంది. రోజంతా కష్టపడి సంపాదించిందంతా మందుకే తగలబెడుతున్నారని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ముందు ఏం చెప్పారు..
‘‘మేం అధికారంలోకి వస్తే దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం. స్టార్ హోటళ్లలో మినహా ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తాం. అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని సమూలంగా లేకుండా చేస్తాం’’ అంటూ ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా మద్యపాన నిషేధం హామీని ప్రస్తావించకుండా సభను ముగించిన దాఖలాలు లేవు. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. జగన్ మాటలు నమ్మి మహిళలు పెద్దఎత్తున ఆయన పార్టీకి ఓట్లేశారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
అధికారంలోకి వచ్చాక...
అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం హామీకి తూట్లు పొడిచింది. మద్యం అమ్మకాలను తన నియంత్రణలోకి తీసుకుంది. స్వయంగా ప్రభుత్వమే అమ్ముతోంది. నిషేధం హామీ సంగతి అటుంచి... భారీగా రేట్లు పెంచి పేదలను పీల్చి పిప్పి చేస్తోంది. దశలవారీగా నిషేధం పేరుతో జగన్ సర్కారు తొలుత మద్యం షాపుల సంఖ్యను తగ్గించింది. ఆ వెంటనే ధరలను రెట్టింపు చేసింది. ఫలితంగా అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో సర్కారుకు ఆదాయమూ తగ్గింది. ఖజానాకు రాబడి తగ్గడంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గిస్తూ, మళ్లీ ఆదాయం పెంచుకుంది. నిజంగా అమ్మకాలు తగ్గించాలనుకుంటే పెంచిన ధరలను తగ్గించకూడదు. ఆదాయం చూసుకోకుండా అవే ధరలను కొనసాగిస్తూ.. దశలవారీగా షాపుల సంఖ్యను తగ్గించాలి. దీనివల్ల రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యేది. కానీ సర్కారు మద్యం అమ్మకాలు పెంచి, తద్వారా రాబడి పెంచుకునేందుకు ధరలను తగ్గించింది. ధరలు మరీ తక్కువగా కాకుండా వినియోగదారులు కొనగలిగే స్థాయిలో అందుబాటులో ఉంచింది. మద్యానికి అలవాటుపడిన వారు భారమైనా కొంటున్నారు. మద్యం షాపుల సంఖ్యను కూడా ఆ తర్వాత సర్కారు తగ్గించలేదు.
సర్కారు లక్ష్యం ఏమిటి?
అసలు వైసీపీ సర్కారు లక్ష్యం ఏమిటి? సంపూర్ణ మద్యపాన నిషేధమా? లేక ధరలు పెంచి ఆదాయం పిండుకోవడమా? అంటే.. రాబడే ముఖ్యమనే వాదన వినిపిస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే... అసలు మందే అందుబాటులో ఉండరాదు. మద్యం విక్రయాలు సాగిస్తూ ధరలు పెంచడం వల్ల పేదల జేబులు ఖాళీ కావడం తప్ప ఒనగూరేదేమీ లేదు. తొలుత ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ అని మేనిఫెస్టోలో పెట్టిన వైసీపీ... తర్వాత గుట్టు చప్పుడు కాకుండా దానిని ‘మద్యపాన నియంత్రణ’గా మార్చేసింది. అంటే... నిషేధం ఉండదని పరోక్షంగా చెప్పేసింది.
Updated Date - 2023-06-30T04:11:43+05:30 IST