Cricket and Casino Racing: బెట్టింగ్.. బికార్లు
ABN, First Publish Date - 2023-05-10T02:48:19+05:30
బెట్టింగ్ దందా విశ్వరూపం దాలుస్తోంది. గోవా, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలుగా బుకీల కార్యకలాపాలు సాగుతున్నాయి.
జోరుగా క్రికెట్, క్యాసినో పందేలు
కష్టపడకుండానే క్షణాల్లో కోటీశ్వరులు కావాలన్న ఆశ కొంప ముంచుతోంది. నిమిషాల్లోనే జీవితాలు తారుమారవుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడి ఎంతోమంది ఆర్థికంగా చితికిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు అప్పుల భారంతో ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఒకవైపు ఐపీఎల్ బెట్టింగ్‌లు, మరోవైపు క్యాసినో బెట్టింగ్‌లు కాస్తూ బుకీలకు అడ్డంగా బుక్కయిపోతున్నారు. బాధితుల్లో సాదాసీదా వ్యక్తుల నుంచి మహిళలు, వైద్యులు, ఇతర ప్రముఖులు ఉన్నారు.
ఉమ్మడి గుంటూరులోనే రోజుకు 100 కోట్లు
గోవా, బెంగళూరు, హైదరాబాద్
కేంద్రాలుగా బుకీల కార్యకలాపాలు
మొత్తం ఆన్‌లైన్‌లోనే వ్యవహారం
నిమిషాల్లోనే జాతకాలు తారుమారు
కోట్లు పోగొట్టుకున్న ప్రముఖులు
బాధితుల్లో మహిళలు, వైద్యులు
క్యాసినో కోసం నేరుగా విదేశాలకూ
చీకోటి ప్రవీణ్‌తో బుకీలకు సంబంధాలు
(గుంటూరు-ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ దందా విశ్వరూపం దాలుస్తోంది. గోవా, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలుగా బుకీల కార్యకలాపాలు సాగుతున్నాయి. తాజాగా థాయిలాండ్‌లో పట్టుబడిన క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌తోనూ జిల్లాకు చెందిన బుకీలకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వందల కోట్లు హాంఫట్ అయ్యాయంటే ఏ స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు, పెదకూరపాడు, నరసరావుపేట తదితర ప్రాంతాలకు చెందిన కొందరు బుకీలు ప్రస్తుతం జిల్లాలో క్రికెట్, క్యాసినో బెట్టింగ్‌లను శాసిస్తున్నారు. గతంలో గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించారు. అప్పట్లో పోలీసులు దాడులు చేయడంతో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆన్‌లైన్ యాప్‌లు రావడంతో బుకీలు రూటు మార్చారు. ప్రస్తుతం పొరుగు రాష్ర్టాల్లో ఉంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో క్రికెట్, క్యాసినో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. బెట్టింగ్‌లు కాసిన వారు మాత్రం బికార్లు అవుతున్నారు. దాదాపు 90 శాతం మంది డబ్బులు పోగొట్టుకుంటుండగా, 10 శాతం మందికి డబ్బులు వస్తున్నాయి. బెట్టింగ్ కార్యకలాపాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ ముఠాలు రూటు మార్చాయి. గతంలో ఎక్కువగా కమ్యూనికేటర్ బాక్సులను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువగానే బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా మూడో కంటికి తెలియకుండా వ్యవహారం నడిపించేస్తున్నారు. నేషనల్ ఎక్స్చేంజ్, డైమండ్ ఎక్స్చేంజ్, లోటస్ ఎక్స్చేంజ్, నేషనల్ డబుల్ సెవెన్, మెట్రో ఎక్స్చేంజ్, లైగార్ నైన్ తదితర యాప్‌ల ద్వారా ఈ తతంగం సాగుతోంది. ఈ యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లతో పాటు క్యాసినో కూడా ఆడుకుంటున్నారు. వాటిద్వారా బెట్టింగ్ కాయాలంటే ముందుగా తమ స్థాయిని బట్టి బుకీ వద్ద నగదు డిపాజిట్ చేయాలి. తర్వాత బుకీ యూజర్ ఐడీ ఇస్తాడు. పాస్‌వర్డ్ కూడా ఇస్తాడు. ఆ తరువాత పాస్‌వర్డ్ మార్చుకొని బెట్టింగ్ ఆడుతున్నారు.
సీక్రెట్ నెట్‌వర్క్...
కిందిస్థాయిలో బెట్టింగ్ కట్టే వారిని బుకీల భాషలో ఫంటర్స్ అంటారు. ఆపైన సబ్ బుకీలు లేదా బోర్డులు ఉంటారు. వారిపైన మెయిన్ బుకీలు లేదా ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటారు. మెయిన్ బుకీలు ఇతర రాష్ట్రాల వారితో సంబంధాలు పెట్టుకుంటారు. వారు విదేశీ బుకీలతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ విధంగా పై నుంచి కింద వరకు బెట్టింగ్ నడుస్తుంది. మెయిన్ బుకీల కింద ఉండే సబ్ బుకీలు బోర్డు (కమ్యూనికేటర్ బాక్సు)ను ఏర్పాటు చేసుకుంటారు. వారి కింద ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని సెల్‌ఫోన్‌లతో వారికి నేరుగా కనెక్షన్ ఇస్తారు. ఆ సభ్యులు ఫోన్ చేయగానే బోర్డు వద్ద ఉన్న వ్యక్తి వివరాలు నమోదు చేసుకుంటారు. ఫంటర్స్ సబ్ బుకీలు, బుకీలతో ఒప్పందాలు కుదుర్చుకొని బెట్టింగ్‌లు కాస్తుంటారు. వారి మధ్య ఉన్న నమ్మకం, లావాదేవీల ఆధారంగా డిపాజిట్ ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంది. కాగా ఇతర దేశాల్లో బెట్టింగ్‌లకు అనుమతి ఉండటంతో బెట్‌ఫెయిర్, బెట్ 365 వంటి కంపెనీలు ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
రోజూ కోట్లలో పందేలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా బుకీలు ఉంటారని .. ఒక్క గుంటూరు నగరంలోనే 150 మందికి వరకు ఉంటారని అంచనా. బెట్టింగ్ వ్యవస్థను శాసించే బుకీలు పది మంది వరకు ఉన్నారు. రూ.కోట్ల కార్యకలాపాలన్నీ వీరి కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పెదకూరపాడు ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు, గుంటూరు ఎస్‌వీఎన్ కాలనీ పార్కు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, విద్యానగర్ ప్రాంతానికి చెందిన నాగరాజు, సాంబశివరావు, హైదరాబాద్‌కు చెందిన శివ, విశాఖకు చెందిన ప్రభు తదితరుల ఆధ్వర్యంలో బెట్టింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గోవా, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వారి కింద జిల్లావ్యాప్తంగా సబ్ బుకీలు, ఏజెంట్లు ఉన్నారు. ఇక పందేలు కాసే ఫంటర్స్ జిల్లాలో 50 వేలమందికి పైనే ఉంటారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.30 లక్షల వరకు కూడా బెట్టింగ్‌లు కాసేవారు ఉన్నారు. జిల్లాలో క్రికెట్ మ్యాచ్‌లపైనే రోజుకు సుమారు వంద కోట్ల వరకు బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కింది స్థాయి నుంచి పై వరకు ఈ మొత్తం అందుతుంది. ఏ రోజుకు ఆరోజు మ్యాచ్ ముగిసిన వెంటనే హవాలా రూపంలో డబ్బు చేతులు మారుతుంది. బెట్టింగ్ రాయుళ్లు ముందుగా రూ.లక్ష అడ్వాన్స్ చెల్లిస్తే రూ.2 లక్షలు ఆడుకునే అవకాశం ఇస్తారు. బకాయి పడితే తరువాత రోజు చెల్లించాలి. లేకుంటే బుకీల అనుచరులు ఇంటి చుట్టూ తిరిగి పీడిస్తారు. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన బెట్టింగ్‌లు ఇప్పుడు పట్టణాలు, పల్లెలకూ పాకాయి. ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీల నుంచి కోటీశ్వరుల వరకు బెట్టింగ్ ఆడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు వీటికి బానిసలవుతున్నారు. బెట్టింగ్‌ల కోసం అప్పులు చేయడంతో పాటు ఇంట్లో వస్తువులను తాకట్టు పెడుతున్నారు. చివరకు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరులో బెట్టింగ్‌ల కోసం చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో బెట్టింగ్‌లలో నష్టపోయి 10 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. బెట్టింగ్‌ను అరికట్టే చర్యలు పోలీసులు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
క్యాసినో.. చాలా కాస్ట్లీ
కొందరు ఆన్‌లైన్‌లో క్యాసినో బెట్టింగ్‌లు కాస్తుంటే.. మరికొందరు ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆడేవారికి జిల్లాకు చెందిన బుకీలే యూజర్ ఐడీలు ఇస్తున్నారు. ఈ బుకీలకు క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. క్యాసినోలో నేరుగా పాల్గొనేవారిని శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం తదితర దేశాలకు పంపుతున్నారు. వెళ్లే ముందు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి విమాన టికెట్ల నుంచి అక్కడ స్టార్ హోటల్‌లో బస, సౌకర్యాలను ఏజెంట్లు ఏర్పాటు చేస్తారు. విదేశాల్లో డబ్బు గెలుచుకుంటే హవాలా రూపంలో తరలించి స్వదేశంలో అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకోసం డిపాజిట్ చేసిన మొత్తంలో ఏజెంట్లకు 30ు కమీషన్‌గా ఇస్తారు. క్యాసినో కోసం విదేశాలకు వెళ్లేవారు డబ్బు పోగొట్టుకోవడమే గానీ వెనక్కు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు.
బంతి బంతికీ బెట్టింగ్
జూ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. మ్యాచ్-మ్యాచ్‌కు, ఓవర్-ఓవర్‌కు, బంతి-బంతికి బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
జూ భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు భారీగా పందేలు కాస్తారు. భారత్ జట్టుపై 10 వేలు బెట్టింగ్ కాస్తే అదనంగా (గెలిస్తే) రూ.6 వేలు ఇస్తారు. పాకిస్థాన్‌పై 6 వేలు బెట్టింగ్ కాస్తే అదనంగా (గెలిస్తే) రూ.10 వేలు ఇస్తారు. బుకీలకు లక్షకు రూ.2వేల చొప్పున కమీషన్ వస్తుంది.
కోట్లు పొగొట్టుకున్న ప్రముఖులు
ఇటీవల గుంటూరుకు చెందిన ఓ మహిళ రోజుల వ్యవధిలోనే క్యాసినో బెట్టింగ్‌లో రూ.7 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ మొత్తం చెల్లించే విషయంలో వివాదం ఏర్పడింది. ఓ విద్యాసంస్థ అధినేత జోక్యం చేసుకుని రూ.3 కోట్లు చెల్లించేలా సెటిల్ చేసినట్టు తెలిసింది.
గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌లో ఒక్క క్షణంలో కోటిన్నర పోగొట్టుకున్నారు. ఆయన కూడా రూ.30 లక్షల ఇచ్చేలా సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనే క్యాసినోలో కూడా నిమిషాల్లోనే కోటిన్నర పోగొట్టుకున్నారు. డబ్బిచ్చే విషయంలో వివాదం నడుస్తోంది.
గుంటూరులో వైద్యులు మాత్రమే వంద కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.
ఎవరైనా ఫంటర్‌లు బెట్టింగ్‌లో పెద్ద మొత్తంలో గెలిస్తే బుకీలు డబ్బులు ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఇటీవల ఓ వైద్యుడు రూ.70 లక్షలు గెలిస్తే బుకీ రెండు లక్షలు ఆయన చేతిలో పెట్టినట్టు తెలిసింది.
Updated Date - 2023-05-10T02:59:46+05:30 IST