Minister Botsa Satyanarayana: రూ.లక్షల కోట్లు తెచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?
ABN, First Publish Date - 2023-04-02T01:20:30+05:30
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బాధ్యత తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఉద్యమంలో రైతులు ఒకటి, రెండు శాతమే
వచ్చే ఎన్నికలకు 3 రాజధానులే అజెండా
ఎమ్మెల్సీ ఓటమికి బాధ్యత తీసుకుంటాం
నలుగురు అటేశారు... నలుగురు ఇటేశారు
ఒక ఎమ్మెల్సీ ఉంటే ఏంటి? ఊడితే ఏంటి?
ముందస్తుకు వెళ్లట్లేదు: మంత్రి బొత్స
కోర్టు స్టేలపై వివాదాస్పద వ్యాఖ్యలు
అమరావతి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బాధ్యత తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల్లో తానూ తిరిగానని, మిస్‌ఫైర్ అయినందున సమీక్షించుకుంటామని తెలిపారు. ఒక నాయకుడిగా తప్పు జరిగినప్పుడు ‘నాకు సంబంధం లేదు’ అనే అలవాటు తన జీవితంలో లేదన్నారు. శనివారం విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమికి బాధ్యత తీసుకుంటామన్న ఆయన ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ గురించి తీసిపారేసినట్లు మాట్లాడారు. ‘నలుగురు అటేశా రు. నలుగురు ఇటేశారు. ఒక ఎమ్మెల్సీ ఉంటే ఏంటి? ఊడితే ఉంటి?’ అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కేబినెట్‌లో మార్పులకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. కేబినెట్ మార్పు పూర్తిగా సీఎం ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, దానిపై మాట్లాడటం ధర్మం కాదన్నారు. వచ్చే ఎన్నికలకు మూడు రాజధానులే తమ అజెండా అని మంత్రి పేర్కొన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయమైతే రేపే విశాఖపట్నం వెళ్లాలని ఉందని, కానీ కొన్ని దుష్టశక్తులు కోర్టుల్లో ని చిన్నచిన్న వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
అమరావతి ఉద్యమంలో ఒకటి రెండు శాతం తప్ప రైతులు లేర ని, అది దోపిడీ కార్యక్రమమని బొత్స విమర్శించారు. కేవలం చంద్రబాబు కో సం ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్షల కోట్ల జాతీయ సంపద తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయమంటారా? అని ఆయన ప్రశ్నించారు. అయితే అమరావతిలో రాజధానేతరులకు స్థలాలు ఇవ్వడంపై విలేకరులు ప్రశ్నించగా... ‘బయటివారంటే వారెవరు? తెలంగాణ నుంచి వచ్చారా? పాకిస్థాన్ నుంచి వచ్చారా?’ అని ప్రశ్నించారు. గోతులు అన్న ప్రాంతంలో స్థలా లు ఎలా ఇస్తారన్న ప్రశ్నకు మంత్రి తడబడ్డారు. తన ఉద్దేశం బాగున్న ప్రాంతంలో ఇవ్వాలని అంటూ సమర్థించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అమరావతిలో వైసీపీ శ్రేణులు చేసిన దాడి అంశంపైనా గందరగోళంగా మాట్లాడారు. ‘‘మొదట మా పార్టీ ఎందుకు దాడి చేస్తుంది? మాకేం అవసరం?’’ అని మాట్లాడిన ఆయన... తర్వాత తమలాంటి నాయకులు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు అక్కడి సున్నిత అంశాలు తెలుసుకోవాలని, అప్పుడు ఇలాంటి గొడవలు ఉండవన్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, ముందస్తు ఎన్నికలు రావని స్పష్టం చేశారు. చంద్రబాబు మాత్రమే ముందస్తు కోరుకుంటున్నాడని, అవి జరిగితే ఇప్పుడున్న ఆశ కూడా మిగలదని బొత్స పేర్కొన్నారు.
కోర్టులపై వార్తలు రాయండి
న్యాయస్థానాలపై మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టులు ఇచ్చే స్టేలతో పేద పిల్లలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. పైగా దీనిపై ఒకేరోజు వార్తలు రాసి బ్లాస్ట్ చేయాలంటూ మీడియాకూ సూ చన చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సరిగా లేదని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి స్పందిస్తూ.. ‘‘దీనిపై కోర్టులో స్టే ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా కలసి ఒకేరోజు బ్లాస్ట్ చేయండి. కోర్టులు స్టేలు ఇస్తున్నాయి. దీనివల్ల పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా అన్యాయం. మేం న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. కానీ ఇది మా ఆవేద న అని రాసేయండి. ఒక తెలుగే కాదు. ఇంగ్లి్‌షలోనూ రాయండి. మమ్మల్ని ఏం చేయమంటారు? వ్యవస్థలో అందరికీ పరిధులున్నాయి. అవి దాటి ఏమీ చేయలేం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-02T01:20:30+05:30 IST