ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యంత్రం.. ఎంతెంత.. దూరం

ABN, First Publish Date - 2023-02-21T00:09:06+05:30

రైతుభరోసా కేంద్రాల్లో రాయితీ యంత్రాలపై తాజాగా ప్రభుత్వం హడావిడి చేస్తోంది. రెండున్నరేళ్లుగా పూర్తిస్థాయిలో అన్నదాతలకు యంత్రాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. తాజాగా మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎంపిక చేసిన గ్రూపులలో సైతం రాజకీయ పలుకుబడి పనిచేసి అక్కడ కూడా పారదర్శకతకు పాతరేశారనే విమర్శలున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయితీ యంత్రాలపై ప్రభుత్వం దోబూచులాడుతోంది. ఖరీఫ్‌, రబీలు గడిచిపోయినా రైతు భరోసా కేంద్రాల్లో అద్దె యంత్రాలు కానరావడం లేదు. గత ప్రభుత్వంలో వ్యక్తిగతంగా సజావుగా రాయితీ యంత్రాల పంపిణీ జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని అస్తవ్యస్తం చేసిందని అన్నదాతలు వాపోతున్నారు. పలువాయిదాల అనంతరం గతేడాది మార్చి నెలలో ఒకసారి, మళ్లీ తాజాగా రెండోసారి కొన్ని ఆర్‌బీకేలలో యంత్రాలను ఉంచారు. మోసపు మాటలు కట్టిపెట్టి అన్ని ఆర్‌బీకేలలో ట్రాక్టరుతో సహా అన్నియంత్రాలు అందుబాటులో ఉంచాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా, ప్రకృతి విపత్తులు, పెరిగిన పెట్టుబడులతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి ప్రభుత్వం బాసటగా నిలవాల్సింది పోయి పథకాల విషయంలో తాత్సారం చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

గుంటూరు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రైతుభరోసా కేంద్రాల్లో రాయితీ యంత్రాలపై తాజాగా ప్రభుత్వం హడావిడి చేస్తోంది. రెండున్నరేళ్లుగా పూర్తిస్థాయిలో అన్నదాతలకు యంత్రాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. తాజాగా మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎంపిక చేసిన గ్రూపులలో సైతం రాజకీయ పలుకుబడి పనిచేసి అక్కడ కూడా పారదర్శకతకు పాతరేశారనే విమర్శలున్నాయి. బాపట్ల జిల్లాలో 410 రైతు భరోసా కేంద్రాలుండగా ఇప్పటి వరకు 226 ఆర్‌బీకేలలోనే ప్రభుత్వం రాయితీ యంత్రాలను అందుబాటులో ఉంచింది. ఇందులో కూడా దాదాపు 100 కేంద్రాలలో ట్రాక్టరు అందుబాటులో లేదు. మిగిలిన కేంద్రాలలో యంత్రాలను ఉంచడానికి ప్రభుత్వం తాజాగా మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో 249 రైతుభరోసా కేంద్రాలుండగా అన్నీ కలిపి 130 కూడా సీహెచ్‌సీ(కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌)లను కూడా ఏర్పాటుచేయకపోవడం అన్నదాతలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పల్నాడు జిల్లాలో మొత్తం 421 ఆర్‌బీకేలుండగా ఇక్కడ కూడా రాయితీ యంత్రాలు అందుబాటులో ఉంచిన ఆర్‌బీకేలు 60 శాతం దాటలేదని సమాచారం. ఉంచిన కేంద్రాల్లో మూడింట రెండొంతులలో ట్రాక్టరు అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలకు ఉపయోగం లేకుండాపోయింది.

రాయితీ నిబంధనలు ఇలా...

రాయితీ యంత్రాలు అందుకునే గ్రూపులకు 50శాతం బ్యాంకు రుణం ఇస్తుంది. 10శాతం వాటాను ఆయా గ్రూపులే భరించాలి. మిగిలిన 40 శాతం వాటా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. సబ్సిడీ మొత్తాన్ని కూడా మొదట గ్రూపులే భరిస్తే తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఒక్కో గ్రూపు తీసుకునే యంత్రాల విలువ గరిష్టంగా రూ.15 లక్షలకు మించకూడదనే నిబంధన ఉంది. ప్రస్తుతం యంత్రాలు ఉంచిన ఆర్‌బీకేలలో సగటున నాలుగు నుంచి ఐదు లక్షల విలువ మాత్రమే కలిగి ఉన్నాయి.

ప్రభుత్వం పిల్లిమొగ్గలు..

రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఈ రాయితీ యంత్రాల వ్యవహారాన్ని సాగదీస్తూ పిల్లిమొగ్గలు వేసింది. ముఖ్యంగా ట్రాక్టరును రాయితీ యంత్రాల జాబితానుంచి తొలుత తొలగించింది. ఆ తర్వాత రైతుల డిమాండ్‌కు తలొగ్గి జాబితాలో చేర్చింది. అదేవిధంగా రైతులు తొలుత సబ్సిడీ మొత్తాన్ని భరించాలని ఆరంభంలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొనలేదు. తర్వాత దానిని చేర్చడంతో రైతులు అనాసక్తిని వ్యక్తబరిచారు. ఇప్పటికీ ఆయా గ్రూపులు ముందుకు రాకపోవడానికి ఈ నిబంధనే ప్రతిబంధకంగా మారింది. మళ్లీ తాజాగా స్వల్పమొత్తంలో ఖర్చయ్యే యంత్రాలకు జిల్లాస్థాయిలోనే నిర్ణయం తీసుకుని ఆయా కేంద్రాలలో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ విధంగా మార్గదర్శకాలలో చాలాసార్లు మార్పులు చేసి అటు రైతులను ఇటు యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం గందరగోళానికి గురిచేసింది.

కొన్ని యంత్రాలే రాష్ట్రస్థాయిలో...

ట్రాక్టర్లు, తైవాన్‌ స్ర్పేయర్లు, టార్పాలిన్లు, రోటోవేటర్లకు మాత్రమే రాష్ట్రస్థాయిలో ఖరారైన టెండర్ల ఆధారంగా ఆయా గ్రూపులకు అందజేసి ఆర్‌బీకేలలో ఉంచుతున్నారు. ఇక రైతులకు కావాల్సిన మరికొన్ని యంత్రాలకు జిల్లాస్థాయిలోనే డీలర్లను ఎంపిక చేసి వారి ద్వారా ఆయా గ్రూపులకు అవసరమైన పనిముట్లను అందించాలని ఇటీవలే ప్రభుత్వం వ్యవసాయశాఖకు ఆదేశాలిచ్చింది. దానిలో భాగంగా ఇప్పటికే జిల్లాల వ్యవసాయశాఖాధికారులు డీలర్లతో సమావేశమై ధరలు ఖరారుచేసే పనిలోపడ్డారు. బాపట్ల జిల్లాలో దానికి సంబంధించి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కంపెనీల డీలర్లు సైతం అనాసక్తి..

రాయితీ యంత్రాల పథకం ఇన్నాళ్లు సాగడానికి వాటిని అందించడానికి డీలర్లు అనాసక్తి ప్రదర్శించడం కూడా కారణంగా ఉంది. వారికి పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో వాటిని చెల్లించకుండా మళ్లీ ఎలా ఇవ్వగలమని వారు మొండికేశారు. ప్రభుత్వం పలు దఫాలు వారితో చర్చలు జరపడంతో ఎట్టకేలకు వారు ఆయా సీహెచ్‌సీలకు కొటేషన్లు ఇవ్వడానికి గతేడాది అంగీకరించంతో అరకొరగానైనా ఆర్‌బీకేలలో రాయితీ పనిముట్లు అందుబాటులోకి వచ్చాయి.

సీజన్‌ పూర్తయిన తరువాత హడావుడి....

ప్రస్తుతం ఖరీఫ్‌, రబీ సీజన్‌ పూర్తయింది. రబీ చివరి దశలో వుంది. ప్రభుత్వం, అగ్రిశాఖలు ఇప్పుడు ఆధునిక పరికరాల పేరుతో హడావుడి చేస్తున్నాయి. తైవాన్‌ స్ర్పేయర్ల వాడకం పూర్తయింది. మిరపకు మినహా పురుగుమందు ఇప్పుడు దేనికీ వాడరు. అధికారులు ఇప్పుడు దరఖాస్తులు తీసుకొంటే ఆఽధునిక పరికరాలు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయలేదు. సీజన్‌ పూర్తయిన తరువాత దరఖాస్తులు తీసుకోవటంలో ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్బీకేల వద్ద కనిపించని పరికరాలు...

నిబంధనల మేరకు అద్దె పరికరాలు ఆర్‌బీకేల వద్ద ఉంచాలి. రైతులు ఆ పరికరాలను అద్దెకు తీసుకెళ్లాలి. ప్రస్తుతం ఆర్‌బీకేల వద్ద అద్దె పరికరాలు లేవు. అవి గ్రూపులీడరు ఆధ్వర్యంలో ఉంటున్నాయి. బినామీ పేర్లతో గ్రూపులను ఏర్పాటుచేసిన వైసీపీ నాయకులు, పరికరాలు తెచ్చినట్లు బిల్లులు పెట్టి సబ్సిడీ సొమ్ము రాబట్టుకొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పరికరాలను సరఫరా చేసే ఏజెన్సీలకు మామూళ్లు ఇచ్చి ప్రారంభోత్సవం రోజున అన్ని పరికరాలను తెచ్చిపెట్టి తిరిగి వాటిని షాపులకు తరలించినట్లు సమాచారం. ఆధునిక పరికరాల అద్దె కేంద్రాల పనితీరుపై విజిలెన్స్‌, నిఘావర్గాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ వ్యవహారం వెల్లడవుతుంది.

డీసీసీబీలోనే రుణాలు...

అద్దె పరికరాల కేంద్రాలకు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ రుణాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 2021-22లో 702 గ్రూపులకు అద్దెపరికరాల యూనిట్లను మంజూరు చేయగా, 2023-24లో 372 గ్రూపులకు యూనిట్లను మంజూరు చేయటానికి ప్రస్తుతం దరఖాస్తుల సేకరణలో వున్నారు. అద్దెపరికరాల కేంద్రాలు అధికార పార్టీ నేతలకే పరిమితమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి.

రైతులకు అందని ఆధునిక పరికరాలు...

ఏటా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషివికాస యోజన, మెకనైజేషన్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్లు విడుదల చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం మైకనైజేషన్‌ నిధులను ఆర్‌బీకేలకు మళ్లించింది. దీంతో రైతులకు ఆధునిక పరికరాలు అందటంలేదు. గతంలో మట్టిని చదును చేయటం, వరికోత యంత్రాలకు 50శాతం సబ్సిడీ విడుదల చేసేవారు. రైతులు వాడే తైవాన్‌ స్ర్సేయర్‌లను నాలుగేళ్ల నుంచి ఇవ్వటంలేదు. బిందు, తుంపర సేద్యంలో వందశాతం రాయితీపై పైపులు, ఇతర పరికరాలు ఇచ్చేవారు. ప్రస్తుతం అటువంటి పథకాలు పడకేశాయి.

ఆర్‌బీకేలో ఒక గ్రూపునకే..

ఒక రైతుభరోసా కేంద్రానికి ఇక అద్దె పరికరాల కేంద్రం మంజూరు చేస్తున్నారు. ఐదు నుంచి ఏడుగురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడితే ఆ గ్రూపునకు యూనిట్‌ను కేటాయిస్తారు. ఇదంతా కాగితాలకే పరిమతమైంది. వాస్తవంగా ఎమ్మెల్యే సిఫార్స్‌ లేఖ ఉంటేనే అద్దె పరికరాల కేంద్రాన్ని మంజూరు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలు తమ కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

=====================================================================

Updated Date - 2023-02-21T00:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising