ROJA: నిరుపేద రోజా!
ABN, First Publish Date - 2023-04-10T02:33:55+05:30
ఓ సినిమాలోని ‘అనగనగా ఓ పేద కుటుంబం (రిచ్‌మ్యాన్)’ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా.. చిలుకలూరిపేట సభలో సీఎం జగన్ తనకు అంగబలం, అర్థబలం, మీడియా లేవని తన పేదరికాన్ని చాటుకున్న సంగతి గుర్తుంది కదా!

‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రచారం కోసం.. పేదరాలిగా ప్రకటించుకున్న మంత్రి
తల్లికి వైద్యం చేసినట్టు వెల్లడి.. డాక్టర్ వచ్చారంటూ కేరికేచర్ పోస్టు
2019కే రోజాకు 7 కార్లు, 9 కోట్ల ఆస్తి.. అయినా జగన్‌లా పేద పలుకులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఓ సినిమాలోని ‘అనగనగా ఓ పేద కుటుంబం (రిచ్‌మ్యాన్)’ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా.. చిలుకలూరిపేట సభలో సీఎం జగన్ తనకు అంగబలం, అర్థబలం, మీడియా లేవని తన పేదరికాన్ని చాటుకున్న సంగతి గుర్తుంది కదా! ఆయన ఏం చెబితే దాన్ని అక్షరం పొల్లు పోకుండా ఆచరించే మంత్రులున్నారు. సేమ్ టూ సేమ్ అన్నమాట. అనగనగా ఓ పేద మహిళా మంత్రి (రిచ్ ఉమన్) సంగతి ఇది. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ 9 కోట్ల రూపాయలు. ఆమె పేరిట 7 ఖరీదైన కార్లు, ఒక బైకు, ఆమె భర్త పేరిట మరో కారు ఉన్నాయి. అయినా ఆమె పేదరాలట! మంత్రి పేదరికాన్ని చూసి జగన్ నియమించిన ఫ్యామిలీ డాక్టర్ ఆమె ఇంటికి వెళ్లి.. మంత్రి అమ్మ గారికి వైద్యం చేశారట. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం తమ లాంటి ‘పేదల’కు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆ మంత్రి కితాబిస్తూ జగన్‌కు సెల్యూట్ చేశారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరంటే.. పర్యాటక శాఖ మంత్రి రోజా. రోజానే స్వయంగా తాను పేదరాలినని ట్విటర్ వేదికగా ప్రకటించుకున్నారు. తమ ఇంటికి ఓ ఫ్యామిలీ డాక్టర్, నర్సు వచ్చి అమ్మకు వైద్యం చేసినట్టు.. ఇంట్లో గోడకు జగన్ కలర్‌ఫుల్ ఫొటో ఉన్నట్టు ఓ అద్భుతమైన కేరికేచర్‌ను ట్విటర్‌లో ఈ నెల 6వ తేదీన ఉదయం 10.25 గంటలకు పోస్టు చేశారు. దీనికి ‘ఫ్యామిలీ డాక్టర్ ఇన్ ఏపీ’ అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. నిజానికి జగన్ ఆ కార్యక్రమాన్ని అదే రోజు ఉదయం 11 గంటల తర్వాత చిలుకలూరిపేటలో ప్రారంభించారు. కానీ అంత కంటే అర్ధగంట ముందే తమ ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి వైద్యం చేశారంటూ మంత్రి ట్వీట్ చేయడం విశేషం.
ముఖ్యమంత్రిలానే మంత్రీ...
చిలుకలూరిపేట సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తనకు అంగబలం, అర్థబలం, మీడియా లేదన్నారు. అయితే 2019 నాటికే ఎన్నికల అఫిడవిట్‌లో 370 కోట్ల ఆస్తులు చూపిన జగన్.. దేశంలోనే అత్యంత సంపన్న సీఎం అని ది ప్రింట్, ఇండియా టుడే ప్రకటించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సలహాదారులు ఉన్నా రు. ఇక ఆయన కుటుంబానికి సొంత పత్రిక, చానల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయినా జగన్ తనకు అంగబలం, అర్థబలం, మీడియా లేవని చెప్పుకొన్నారు. ఇక 2019లోనే రూ.9 కోట్లు ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో రోజా పేర్కొన్నారు. నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా మంత్రి పదవి చేపట్టకముందు అనేక కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా, జడ్జిగా వ్యవహరించారు. అంతకుముందు చాలా దక్షిణాది సినిమాల్లో రాణించారు. ఇక మంత్రి గా నెలకు లక్షన్నరపైన జీతం, ఇతర అలవెన్సులు ఉంటాయి. అయినా రోజా ఆధునిక పేదరాలేనట.
నెట్టింట్లో చర్చ:
రెండేళ్ల క్రితం రోజా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అప్పుడు కూడా జగన్ సీఎంగా ఉన్నారు. అయినా ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యులపై రోజాకు నమ్మకం లేక చెన్నైకు వెళ్లారా? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రి రోజా ఇంటికి నిజంగా ఫ్యామిలీ డాక్టరే వచ్చి వైద్యం చేస్తే ఆ ఫొటోను ఎందుకు అప్‌లోడ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై గత నాలుగు రోజులుగా ట్విటర్ వేదికగా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి భజన చేయడానికే అలా ట్వీట్ చేశారా అన్న విమర్శలూ వచ్చాయి.
Updated Date - 2023-04-10T02:33:55+05:30 IST