రేపటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
ABN, First Publish Date - 2023-02-25T00:17:56+05:30
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్లు ఆర్‌ఐవో జి.సునీత వెల్లడించారు.
గుంటూరు(విద్య), ఫిబ్రవరి 24: ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్లు ఆర్‌ఐవో జి.సునీత వెల్లడించారు. శుక్రవారం ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా పరిధిలో 135 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో 97, పల్నాడు జిల్లాలో 70, బాపట్ల జిల్లాలో 25 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 35,881 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చి ఏడవ తేదీ వరకు రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఒక కేంద్రంలో 400పైగా విద్యార్థులు ఉంటే రెండు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రయోగ పరీక్షలకు బైపీసీ విభాగంలో 7117 మంది, ఎంపీసీ విభాగం నుంచి 28,772 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 35,881 మంది హాజరుకానున్నారు. పరీక్షలు జరిగే సమయంలో డీవీఈవో, ఆర్‌ఐవో, డీఈసీ సభ్యుల ఆధ్వర్యంలో కమిటీలు ప్రయోగ పరీక్షా కేంద్రాల్ని తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.
అక్రమాలకు తావులేకుండా ప్రయోగ పరీక్షలు
ఫ ఇంటర్‌బోర్డు ఆర్జేడీ వీవీ సుబ్బారావు
ఇంటర్ బోర్డు సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆర్జేడీ వీవీ సుబ్బారావు సూచించారు. ఈనెల 26 నుంచి జరిగే ప్రయోగ పరీక్షలపై శుక్రవారం ఏసీ కళాశాలలో ఛీప్ సూపరింటెండెంట్స్, డిపార్టుమెంట్ ఆఫీసర్స్, ఎగ్జామినర్స్‌తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిలో అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐవో జి.సునీత, డీవీఈవో ఎం.నీలావతిదేవి, డీఈసీ సభ్యులు బాలమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-25T00:17:58+05:30 IST