ద్వితీయ నేత.. అసమ్మతి కూత
ABN, First Publish Date - 2023-04-17T00:08:20+05:30
పల్నాడు జిల్లాలో అధికార వైసీపీ వర్గ పోరుతో ఉడికిపోతున్నది. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలో అసమ్మతి రాగం ఊపందుకుంది. ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబులపై పార్టీలోని నేతలు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు.
నరసరావుపేట, ఏప్రిల్ 16: పల్నాడు జిల్లాలో అధికార వైసీపీ వర్గ పోరుతో ఉడికిపోతున్నది. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలో అసమ్మతి రాగం ఊపందుకుంది. ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబులపై పార్టీలోని నేతలు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు. అంబటి, రజినీలకు అయా నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా నేతలు సమావేశాలు కూడా నిర్వహించారు. వీరికి పార్టీ మళ్ళీ టిక్కెట్ ఇస్తే సహకరించమని నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. మాచర్ల నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యేపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
గురజాలలో నివురుకప్పిన నిప్పులా..
గురజాల నియోజకవర్గంలో ఎమ్మె ల్యే కాసు మహేష్‌రెడ్డి కూడా అస మ్మతిని ఎదుర్కొంటున్నారు. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నేతలు కొందరు ఎమ్మెల్యే పట్ల వ్యతి రేకతతో ఉన్నట్లు ప్రచారం. నియోజక వర్గంలో ఓ కీలక నేతకు, ఎమ్మెల్యే కాసుకు అసలు పోసగడంలేదు. మరో సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కూడా అప్పడప్పుడు అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. మైనింగ్ విష యంలో ఆమె పోరాటం కూడా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సామా జిక వర్గానికి చెందిన ఓ నేత ఒకరు వచ్చే ఎన్నికల్లో గురజాల టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీలో ముఖ్యనేతలను కలిసి తనకు పార్టీ టిక్కెట్ ఇవాలన్న ప్రతిపాదన ఉంచినట్లు నియోజకవర్గంలో ప్రచా రం జరుగుతోంది. ఎమ్మెల్యే కాసు నర సరావుపేట నియోజవర్గం టిక్కెట్ ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతుం టడంతో పార్టీలోని కొందరు నేతలు టిక్కెట్ రేసులో నిలుస్తున్నారు. అస మ్మతి ఉన్నా బయటపడితే తమకు సంబంధించిన పనులు జరగవన్న భావనతో వారు చాపకింద నీరులా వ్యవహరిస్తున్నారు.
పెదకూరపాడులో తిరుగుబాటు బావటా
పెదకూరపాడు నియోజవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావించిన నేతలను పార్టీ నుంచి ఆయన బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే కంచేటి సాయి, జీడీసీసీబీ మాజీ డైరెక్టర్ వరప్రసాద్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తన మాట వినని పార్టీ నేతలు దండా నాగేంద్ర, దామూలూరి గోపినాథ్‌లపై అక్రమ కేసులు బనాయించి ఎమ్యెల్యే వేధిస్తున్నారని పార్టీలో ప్రచారం జరగుతోంది. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని గోపినాథ్ విడుదల చేసి సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. పార్టీ నేతలనే ఎమ్యెల్యే వేధిస్తున్నారని, తమకు రక్షణ లేకుండా పోయిందని పలువురు నేతలు బహిరంగానే విమర్శిస్తున్నారు.
నరసరావుపేటలో కాసు వర్గం
నరసరావుపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి వర్గం పనిచేస్తున్నది. ఎమ్మెల్యేకు సంబంధించిన సామాజిక వర్గంలోని కొందరు ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. రొంపిచర్ల మండలంలోని వైసీపీకి పెట్టనికోటలా ఉన్న గ్రామాల్లో కూడా వర్గపోరు ఉంది. ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఓ వర్గం కాసు వైపు ఉన్నట్లు సమాచారం. కాసు కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేల మధ్య ఇటీవల ఫ్లెక్సీల విషయంలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. రొంపిచర్ల మండలంలో కాసు ఇటీవల ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. నరసరావుపేట మండలంలోని ఓ గ్రామంలో కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ వర్గం వ్యవహరిస్తోంది. ఇటీవల ఈ గ్రామంలో ఓ కార్యక్రమానికి రాకుండా ఆయన్ను అడ్డుకున్నారని పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. కాసు వర్గంతో గోపిరెడ్డి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పట్టణంలో కూడా ముఖ్య నేతల గృహాలకు వెళ్లి కాసు కృష్ణారెడ్డి కలిసి వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి కూడా కాసు వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాసు మహేష్‌రెడ్డి నరసరావుపేట నుంచి పోటీ చేస్తారని పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది.
చిలకలూరిపేటలో తారాస్థాయికి..
చిలకలూరిపేట నియోజవర్గంలో వర్గ పోరు తారాస్థాయి చేరింది. వచ్చే ఎన్నికల్లో మంత్రి విడదల రజినికి టిక్కెట్ ఇవ్వొద్దని పార్టీ అధిష్ఠానాన్ని అసమ్మతి వర్గం కోరుతున్నది. ఒక వేళ మంత్రి రజినికి మళ్ళీ టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని వారు చెప్తున్నారు. రజినీకి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ఇటీవల గుంటూరులో సమావేశాన్ని కూడా నిర్వహించారు. జిల్లా సమన్వయకర్త బీద మస్తాన్‌రావును కలిసి రజినిపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ముఖ్యనేతలు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు మంత్రి రజినిల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉన్నాయి. వారిని ప్రభుత్వ కార్యక్రమాలకు రజిని ఆఆహ్వానించకపోవడం కూడా వారి మధ్య రాజకీయ చిచ్చుకు దారితీస్తున్నది. తాము ఫోన్ చేసినా మంత్రి స్పందించరని పార్టీలోని ముఖ్య నేతలే గోడు వెళ్లబోసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఓ ప్రధాన సామాజికవర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మొత్తం మీద చిలకలూరిపేటలో వైసీపీలో నేతల మధ్య విబేధాలు ఢీ అంటే ఢీ అన్న రీతిలో ఉన్నాయని సమాచారం. నేతల మధ్య విభేదాలతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ నేత దగ్గరికి పోతే ఏమవుతుందో, ఎవరికి కోపం వస్తుందోనన్న పరిస్థితి నెలకొంది. సీఎం సభ సందర్భంగా కూడా ఎంపీ, మంత్రి మధ్య ఉన్న రచ్చ బహిర్గతమైంది.
వినుకొండలో వ్యతిరేకత..
వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారు. రెండు సామాజిక వర్గాలు ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. వైసీపీలోని ఎమ్మెల్యేకు సంబంధించిన సామాజిక వర్గం మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణను ఇటీవల కలిసింది. ఎమ్మెల్యే, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మఽధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. వినుకొండలో జరిగిన సీఎం సభలో కూడా ఎంపీకి అవమానం జరిగింది. ఎంపీకి కూడా నియోజకవర్గంలో బలమైన వర్గమే ఉంది. మాజీ ఎమ్యెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యేకు మధ్య కూడా పొసగడంలేదు. బొల్లాపై ఉన్న వ్యతిరేకతతో ఆదివారం నియోజకవర్గంలోని బలమైన నేతలు వైసీపీని వీడి కన్నా, జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రధానంగా కాపు, రెడ్డి సామాజిక వర్గాల్లోని ముఖ్యులు బొల్లా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీకి మద్దతు ఇచ్చే వర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంబటిపై.. అసంతృప్తి
సత్తెనపల్లి నియోజక వర్గంలో పార్టీ కోసం కష్టపడి పని చేసినా అధికారంలోకి వచ్చాక తమకు ప్రాధాన్యం లేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పలువురు మంత్రి అంబటి రాంబాబుపై అసంతృప్తితో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో అంబటికి టిక్కెట్ రాకుండా చేసేందుకు పలువర్గాలకు చెందిన నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అంబటికి రాష్ట్ర ముఖ్య నేత వద్ద మంచి మార్కులు ఉన్నా నియోజకవర్గంలో తగిన గుర్తింపు లేదు. సీఎం సహాయ నిధి చెక్కు విషయం, ఓ మహిళతో మంత్రి ఫోన్‌లో మాట్లాడిన ఆడియో తదితరాలు అంబటి ప్రతిష్ఠను దిగజార్చాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని ఇటీవల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అంబటికి చెందిన కాపు సామాజిక వర్గంలో కూడా ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇప్పటికే కొంత మంది నేతలు అధిష్ఠానానికి మంత్రిపై ఫిర్యాదులు కూడా చేసి ఉన్నారు. అంబటిని నియోజకవర్గానికి తీసుకు వచ్చి మొదటగా అండగా నిలిచిన సయ్యద్ మాబూ కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. మరి కొద్ది రోజులు ఆగితే అంబటికి వ్యతిరేకంగా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - 2023-04-17T00:08:20+05:30 IST