CM JAGAN: షా, నడ్డా వ్యాఖ్యలపై ఉలకని జగన్
ABN, First Publish Date - 2023-06-13T03:20:43+05:30
‘జగన్ పాలన అంతా అవినీతే. పేదల బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీకి మూడో స్థానం.. కేంద్రం ఇచ్చిన రూ.5 లక్షల కోట్లకు సరిపడా అభివృద్ధి కనబడడం లేదు..
అవినీతి ఆరోపణలను తిప్పికొట్టని వైనం
బాబు, పవన్, మీడియాపైనే విమర్శలు
వైసీపీ కార్యక్రమంలా కిట్ల పంపిణీ సభ
గుంటూరు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ‘జగన్ పాలన అంతా అవినీతే. పేదల బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీకి మూడో స్థానం.. కేంద్రం ఇచ్చిన రూ.5 లక్షల కోట్లకు సరిపడా అభివృద్ధి కనబడడం లేదు.. విశాఖను భూరాబందుల కేంద్రంగా మార్చారు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ‘ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు.. రాజధాని లేని రాష్ట్రంగా చేసేశారు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జగన్ తరచూ ఢిల్లీ వెళ్లి కలిసే షాతో పాటు నడ్డా చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తుండగా.. సీఎం మాత్రం క్రోసూరు సభలో వాటిపై స్పందించలేదు. ఆరోపణలను తిప్పికొట్టలేదు. బీజేపీ నేతలను పల్లెత్తు మాటనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చన్నారు. యథాప్రకారం చంద్రబాబు, పవన్, మీడియాపై దుమ్మెత్తిపోశారు. ఇక.. ప్రభుత్వ కార్యక్రమాలను జగన్ రాజకీయ వేదికలుగా మార్చుకుంటున్నారు. సోమవారం క్రోసూరులో జరిగిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం ఇలాగే జరిగింది.
బాబును తిట్టినా స్పందన కరువు
క్రోసూరులో చంద్రబాబును సీఎం తిట్టిన తీరు సభికులకు రుచించలేదు. ‘ఎన్నికలకు ముందు వాగ్దానం.. ఎన్నికల తర్వాత మోసం’ అంటూ బాబును విమర్శించి.. ఏదో కొత్త విషయాన్ని చెప్పినట్లు భావించారు. ప్రసంగం ఆపి మరీ జనం స్పందన కోసం చూశారు. హర్షధ్వానాలు వస్తాయని ఆశించారు. కానీ ఒక్కరూ స్పందించలేదు. దీంతో అదే మాటను ఆయన ఒకటికి పది సార్లు, పది రకాల వేరియేషన్లలో అన్నారు. అయినా పట్టుమని పది మంది కూడా స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి నిరాశ చెందినట్లు కనిపించింది.
Updated Date - 2023-06-13T04:21:35+05:30 IST