Kadapa News: తీపి గుర్తేనా..? తీపి పంచేనా!
ABN, First Publish Date - 2023-02-18T00:45:50+05:30
ఆ కార్మికులు బతికేందుకు అదే ప్రాంతంలో కంకర కొట్టే కూలీలుగా మారారు. ఇంకొందరు చిన్నపాటి తోపుడుబండ్లు, టీ కొట్లు పెట్టుకున్నారు. మరికొందరు ఆటోలు నడుపుకున్నారు. మరికొందరు అవి కూడా చేతకాక....
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చక్కెర కర్మాగారం నేడు శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు 18 ఏళ్ల నిరాటంకంగా నడిచి.. పదేళ్లు మూతపడి.. తిరిగి ఐదేళ్లు నడిచి.. మళ్లీ 13 ఏళ్లుగా మూతపడి ఉంది. కర్మాగారంలో పనిచేచేసే కార్మికులు కొందరు చనిపోయారు. కొందరు రిటైర్ అయిపోయారు. మిగిలిన కొందరు దీనినే నమ్ముకుని ఇక్కడే కాపలాగా ఉన్నారు. అధికారంలోకి వస్తే తిరిగి చక్కెర కర్మాగారం తెరిపిస్తామన్న వైఎస్ జగన్.. అధికారం చేపట్టాక ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే గత నెలలో ఇక్కడి కార్మికులందరికీ బకాయిలు చెల్లించారు. ఈ నేపథ్యంలో 200 ఎకరాలకు పైగా భూములున్న ఈ చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరుస్తారా.. వేరొకరికి అప్పగిస్తారా.. లేదంటే శాశ్వతంగా మూతవేస్తారా అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చక్కెర కర్మాగారం తీపిగుర్తుగా మిగులుతుందా.. తిరిగి తీపిని పంచుతుందా అనే విషయంలో స్పష్టత లేదు.
చెన్నూరు, ఫిబ్రవరి 17: చెన్నూరులో 1977లో కడప సహకార చక్కెర కర్మాగారం ప్రారంభమైంది. దీనిని అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రారంభించారు. ఇందులో ప్రారంభంలోనే 8వేల మందికి పైగా రైతులు షేర్ హోల్డర్స్‌గా ఉన్నారు. వారంతా చెరుకు సాగు చేసి కర్మాగారానికి అందించేవారు. 1250 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మొదలైన ఈ కర్మాగారం అంచెలంచెలుగా ఎదగాల్సి ఉండగా ఒక ఏడు పైకి, మరో ఏడు కిందకు అనేలా ఒడిదుడుకుల మధ్య నడిచింది. ఐఏఎస్ అధికారి సత్యనారాయణ ఎండీగా ఉన్న సమయంలో కర్మాగారం లాభాల బాట నడిచింది. ఆ తరువాత షరా మామూలే. చివరికి 1995లో కర్మాగారం పరస్థితి బాగా లేదంటూ లే ఆఫ్ ప్రకటించారు. దీంతో కర్మాగారంలో ఉన్న కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కర్మాగారం మూతబడ్డ సమయంలో అక్కడ పనిచేసే పలువురు కార్మికులు బతికేందుకు అదే ప్రాంతంలో కంకర కొట్టే కూలీలుగా మారారు. ఇంకొందరు చిన్నపాటి తోపుడుబండ్లు, టీ కొట్లు పెట్టుకున్నారు. మరికొందరు ఆటోలు నడుపుకున్నారు. మరికొందరు అవి కూడా చేతకాక అనారోగ్యంపాలై మంచాన పడ్డారు. కొందరు ఎప్పటికైనా తెరుస్తారనే ఆశతో కర్మాగారం వద్దే ఉండిపోయారు.
రూ.13.50 కోట్లు విడుదల
అయితే 2005లో కర్మాగారం తిరిగి తెరిచారు. అప్పటికే కర్మాగారానికి ఉన్న కొంత భూమిని కొందరు ఆక్రమించి సాగు చేసుకున్నారు. కర్మాగార పరిసరాలు బీళ్లుగా తయారయ్యాయి. భవనాలు శిధిలావస్థకు చేరాయి. అటువంటి పరిస్థితిలో తిరిగి తెరవడంతో కార్మికులకు ఊపిరి వచ్చినట్లయింది. అప్పటికే కర్మాగారం మొత్తమ్మీద ఎంఎంఆర్, కాంట్రాక్టు బేసిస్, సీజనల్ పర్మినెంటు, పర్మినెంటు మొత్తం దాదాపు 450 నుంచి 550 మంది పనిచేసేవారు. కర్మాగారం తెరవడంతో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తిరిగి చెరకు సాగు మొదలుపెట్టారు. కానీ 2009లో తిరిగి కర్మాగారం మూతపడింది. దీంతో కార్మికుల గుండె చెరువైంది. అప్పటికే కర్మాగారంలో చివరగా క్రషింగ్ జరిగిన చక్కెర, మొలాసిస్ ఉండడంతో వాటిని అమ్మి మూడేళ్ల పాటు జీతాలు, ఖర్చులకు కార్మికులకు మకూర్చారు. 2012 నుంచి కర్మాగారంలో పనిచేసే కార్మికులకు జీతాలు లేవు. తిరిగి 2022 డిసెంబరు చివరన వారికి రావలసిన పది సంవత్సరాల బకాయిలు రూ.13.50 కోట్లు కార్మికుల పోరాటంతో విడుదలయ్యాయి. తీసుకున్నారు కూడా.
అన్నీ కొత్త యంత్రాలే..
అంతవరకు సరే.. ఇప్పుడు ఈ కర్మాగారాన్ని ఏం చేస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు? అమ్ముతారా; అలానే వదిలేస్తారా.. లేక ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లి నడిపిస్తారా అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. 1250 టన్నుల సామర్థ్యంతో నడిచే ఈ కర్మాగారంలో 2005 తరువాత టర్బైన్‌లు, పలురకాల యంత్ర సామగ్రి కొత్తగా కొనుగోలుచేసి తీసుకువచ్చినవి ఉన్నాయి. కేన్ అన్‌లోడర్ కూడా కొత్తదే. ఈ యంత్రాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రస్తుతానికి కర్మాగారంలో ప్రతి వస్తువు అంతో ఇంతో ఉపయోగపడేదే. ఏ మాత్రం పక్కన బెట్టేదేం లేదు. పనికిరాని సామగ్రిని 2006-07లోనే తొలగించి మొత్తం కొత్త యంత్రాలనే ఏర్పాటు చేశారు.
227.92 ఎకరాల భూమి
కార్మికుల బకాయిలు మొత్తం చెల్లించిన తరువాత గత నెలలో కర్మాగారం చూసేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ కర్మాగారం జ్యూస్ ఫ్యాక్టరీకి ఉపయోగపడుతుందా అని పరిశీలించగా ఢిల్లీ నుంచి వచ్చినవ్యక్తి మిథనాల్ ఫ్యాక్టరీకి ఉపయోగపడుతుందా అని చూశారు. అలా కాకుండా ప్రభుత్వపరంగా ఫుడ్ కార్పొరేషన్‌కు ఈ కర్మాగారం వాడుకుంటే ఎలా ఉంటుందని మరో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి పరిశీలించారు. అంతేకాక కర్మాగారానికి ఇప్పటి వరకు ఏమైనా అప్పులు ఉన్నాయా, రావలసిన బకాయిలు ఉన్నాయా.. ప్లాంటు ఎన్ని ఎకరాల్లో ఉంది, మొత్తం పొలం ఎంత ఉంది, నీటి వసతి ఎలా? లాంటి వివరాలు పరిశీలించడంతో పాటు కర్మాగారం ప్లాను తమవెంట తీసుకెళ్లారు. కర్మాగారం, క్వార్టర్స్‌తో కలిసి 227.92 ఎకరాల భూమి ఉంది. కర్మాగారం మూతపడితే ఈ భూమిని ప్రభుత్వం మరో దానికి ఉపయోగించుకుంటుందా, లేక విక్రయిస్తుందా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
చెరకు సాగు అవుతున్నా..
కర్మాగారం మూతబడ్డా ఖాజీపేట మండలంతో పాటు మరికొన్ని మండలాల్లో రైతులు అంతో ఇంతో చెరుకు సాగు చేస్తూనే ఉన్నారు. దీనిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెరకు మద్దతు ధర ఎక్కువగా ఉండడంతో కర్మాగారం తెరిస్తే ఇటు రైతులు, అటు కార్మికులు బాగుపడతారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
చెరకు సాగుకు అవకాశం ఇవ్వాలి
- మిట్టాకేశవరెడ్డి, రైతు, చెన్నూరు
ప్రభుత్వం చెరకు సాగుకు అవకాశం ఇవ్వాలి. కర్మాగారం మూతపడ్డా ఏటా 2 నుంచి 3 ఎకరాలు చెరకు సాగు చేస్తున్నా. కర్మాగారం మూతబడడంతో బయట అమ్ముతున్నా. అదే కర్మాగారం నడిపిస్తే ఈ చెరకు ఇక్కడికే తరలిస్తాం. దీని వల్ల పది మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాలి. నిర్లక్ష్యం చేస్తే మంచి కర్మాగారం జిల్లాకు లేకుండా పోతుంది.
తెరిస్తే మరికొందరికి ఉపాధి
- ఆవుల పవన్‌కుమార్‌రెడి ్డ, నిరుద్యోగి, చెన్నూరు
ప్రభుత్వం కాస్త దృష్టి పెట్టి కర్మాగారాన్ని తెరిపిస్తే యువతకు ఉపాధితో పాటు జిల్లాకు మంచి పేరు ఉంటుంది. నిరుద్యోగ సమస్య తీరుతుంది. మాలాంటి యువతకు ఇలాంటి కర్మాగారాలు మూసివేయడంతో నిరాశే మిగులుతోంది. కంటి ముందు కర్మాగారం పెట్టుకుని దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది.
కర్మాగారం తెరిస్తేనే ప్రయోజనం
- పి.క్రిష్ణ, చక్కెర కర్మాగారం యూనియన్ విశ్రాంత నాయకుడు
చక్కెర కర్మాగారం మూతబడితే ఎవరికీ ఉపయోగం ఉండదు. తెరిపిస్తే చాలా మందికి బతుకుదెరువు లభిస్తుంది. ఒక్కమారు కర్మాగారం మూతబడితే తిరిగి తెరవాలన్నా, కొత్తది కట్టాలన్నా అంత తేలికైన విషయం కాదు. ప్రభుత్వం స్పందించి కర్మాగారం తెరిపించాలి. పదవీ విరమణ చేసిన మాలాంటి వారిని వదిలేస్తే.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి.
ఉపయోగంలోకి తీసుకొస్తే మేలు
- జాన్ విఠల్, కర్మాగారం ఎండీ
చక్కెర కర్మాగారంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ పెడితే చాలా మేలు. యువతకు ఉపాధి దొరుకుతుంది. ఒక కర్మాగారం మూతపడడం మంచిది కాదు. ఇటీవల ముగ్గురు వచ్చి చూసి పోయారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని కర్మాగారాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తే మేలు.
Updated Date - 2023-02-18T14:30:31+05:30 IST