Pulivendula Firing: పులివెందులలో పేలిన తూటా!
ABN, First Publish Date - 2023-03-29T02:55:19+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంతూరు కడప జిల్లా పులివెందులలో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుచరుడు భరత్ కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో ఒకరు మృత్యువాతపడ్డారు.
ఎంపీ అవినాశ్ అనుచరుడి కాల్పులు
ఒకరు మృతి.. మరొకరికి బుల్లెట్ గాయాలు
గన్‌తో భరత్ యాదవ్ వీరంగం
వివేకా హత్య కేసులో భరత్‌పై సీబీఐ విచారణ
ఏ-5 దేవిరెడ్డి అనుచరుడు, ఏ2-సునీల్ మిత్రుడు
గ్యాంబ్లింగ్, మట్కా, సెటిల్‌మెంట్లలో బెదిరింపులు
ఇవే లావాదేవీల్లో ఇద్దరిపై పట్టపగలే కాల్పులు
డీఎస్పీ వద్దన్నా గన్ లైసెన్స్!
వివేకా కేసు ఎదుర్కొంటున్న నేత సిఫారసుతోనే?
కడప, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సొంతూరు కడప జిల్లా పులివెందులలో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుచరుడు భరత్ కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో ఒకరు మృత్యువాతపడ్డారు. మరొకరికి తూటా గాయాలయ్యాయి. జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2 సునీల్‌కుమార్ యాదవ్‌కు భరత్ స్నేహితుడు, ఏ-5 దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. పులివెందులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పులివెందుల పట్ణణంలో నగరిగుట్టకు చెందిన గొర్ల భరత్‌కుమార్‌యాదవ్, చింతకుంట దిలీ్‌పకుమార్, రాగిపాటి మహబూబ్‌బాషా ఆలియాస్ యాక్షన్‌బాషాల మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల వివాదం జరుగుతోందని స్థానికులు అంటున్నారు.
ఇవన్నీ కూడా మట్కా, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన లావాదేవీలే! ఈ నేపథ్యంలో భరత్‌కుమార్‌యాదవ్.... డబ్బుల విషయమై మంగళవారం మధ్యాహ్నం దిలీ్‌పకుమార్, యాక్షన్ బాషాతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి ఆగ్రహానికి గురైన భరత్‌కుమార్‌యాదవ్,,,, హుటాహుటిన తన ఇంట్లోకి వెళ్లి తుపాకి తీసుకువచ్చారు. దిలీప్, బాషాలపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ దిలీ్‌పకుమార్ గుండె కింద భాగాన దిగింది. బాషాకు చేయి, కాలి పిక్కకు రెండు బుల్లెట్లు తగిలాయి. చికిత్స కోసం దిలీ్‌పకుమార్‌ను వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందాడు. బాషాను పులివెందుల ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం కడప రిమ్స్ తరలించారు.
గన్ చూపించి దందాలు..
భరత్‌కుమార్....ఎంపీ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు చెప్పుకుని సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు, మట్కా, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు పులివెందులలో ఉన్నాయి. చెంచురెడ్డి పేరు మీద ఉన్న భూములు కొందరికి అమ్మాడని, వాటిలో కొందరు రిజిస్టరు చేసుకోగా, మరికొందరు అగ్రిమెంట్లతో కొనుగోలు చేశారని అంటున్నారు. ఇటీవల పులివెందుల సమీపంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు విశ్వనాథరెడ్డిని గన్‌తో బెదిరించే ప్రయత్నం చేయగా, ఆయన తిరిగి దాడి చేశారని తెలుస్తోంది. గన్‌తో బెదిరించినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉండుంటే ఈ రోజు కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందేవారు కాదని స్థానికులు అంటున్నారు.
ఆర్థిక లావాదేవీలే కారణం: ఎస్పీ
ఆర్థిక లావాదేవీల వివాదంలో భాగంగానే పులివెందులలో కాల్పుల ఘటన జరిగినట్టు కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చుట్టుపక్కల సీసీ టీవీలు ఏమైనా ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నామన్నారు. కాల్పులు జరిపిన భరత్‌కుమార్‌యాదవ్ తమ కస్టడీలో ఉన్నాడన్నారు. పూర్తిస్థాయిలో విచారణ సాగిస్తామన్నారు. భరత్‌కుమార్ యాదవ్‌కు ఎప్పుడు లైసెన్స్ గన్ ఇచ్చారని విలేకరులు అడిగిన ప్రశ్నను తొలుత దాటేశారు. అనంతరం పొడిపొడిగా బదులిచ్చారు. ‘‘తనకు ప్రాణహాని ఉందంటూ భరత్‌కుమార్ యాదవ్ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశాడు. అదే విషయం విలేకరుల సమావేశంపెట్టి వీడియో విడుదల చేశాడు. దీంతో అతనికి లైసెన్స్ గన్ ఇచ్చాం’’ అని వివరించారు.
ఎవరీ భరత్?
భరత్‌కుమార్ యాదవ్ ‘తరుణం’ అనే స్థానిక పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తూ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కుటుంబానికి దగ్గరయ్యారు. అవినాశ్‌కు నమ్మినబంటు. సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-5గా చంచలగూడ జైలులో ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సీబీఐ ఢిల్లీలో విచారించింది. అప్పుడు భరత్‌కుమార్‌యాదవ్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతారు. దస్తగిరి సీబీఐకి ఏం చెప్పారనే వివరాలు కనుగొనేందుకే అతడు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సీబీఐ అధికారులు 2021 ఆగస్టు 21న వివేకా హత్యకు సంబంధించి భరత్‌కుమార్‌యాదవ్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అయితే 2022 ఫిబ్రవరిలో భరత్‌కుమార్‌యాదవ్ సీబీఐపై ఆరోపణలు చేశాడు. తాము చెప్పినట్లు వినకపోతే కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని అన్నాడు.
డబ్బు కోసం చంపుతారా?: దిలీ్‌ప భార్య
‘నాది నల్లపురెడ్డిపల్లె గ్రామం. నాకు దిలీ్‌పకుమార్‌తో వివాహమై రెండు సంవత్సరాలు అయింది. మా పెళ్లి కోసమే భరత్ దగ్గర అప్పు చేశాం. దానికి వడ్డీ కూడా కడుతున్నాం. మధ్యాహ్నం వస్తానని చెప్పి దిలీప్ పొద్దున్నే బయటకు పోయాడు. 2:30గంటల ప్రాంతంలో మాభర్తకు ఫోన్ చేశాను. ఫోన్ వేరేవాళ్లు ఎత్తి నా భర్తను భరత్‌ను కాల్చినట్టు చెప్పారు. వెంటనే నేను ఆస్పత్రికి వచ్చి చూస్తే... నా భర్త చనిపోయి పడున్నాడు. డబ్బు ఇవ్వకపోతే మనిషిని చంపేస్తారా? మాకు ఐదు నెలల పాప ఉంది. ఇపుడు మాకు ఏ ఆదరువు లేకుండా పోయింది. ఇపుడు నేను వాణ్ణి చంపాలా?’’
గన్ కల్చర్‌కు నిదర్శనం: చంద్రబాబు
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పులివెందులలో కాల్పుల ఘటన రాష్ట్రంలో గన్ కల్చర్‌కు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘తుపాకీ దుర్వినియోగం చేశాడన్న చరిత్ర ఉన్న వ్యక్తికి మళ్లీ లైసెన్స్ ఎందుకు రెన్యువల్ చేశారు? ఎవరు సహకరించారు? నేరస్థుల అరాచకాలకు ప్రభుత్వ పెద్దల మద్దతు ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
లైసెన్స్ తుపాకీ ఎందుకు ఇచ్చారు?: భూమిరెడ్డి
కాల్పుల ఘటనపై న్యాయ విచారణ చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. భరత్ యాదవ్‌కు తుపాకీ ఎందుకు ఇచ్చారని పోలీసులను ప్రశ్నించారు. అతనేమీ ఫ్యాక్షనిస్టూ, రాజకీయ నాయకుడు కాదు. ఒక విలేకరిగా ఉన్న భరత్‌కు ఎందుకు లైసెన్స్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
డీఎస్పీ వద్దన్నా గన్ లైసెన్స్
వివేకా కేసు ఎదుర్కొంటున్న ఓ కీలక నేత సిఫారసుతోనే..?
పోలీసు శాఖలో చర్చనీయాంశం
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘నాకు గన్ లైసెన్స్ కావాలి సర్..’ అంటూ పులివెందులకు చెందిన భరత్ కుమార్ యాదవ్ పెట్టుకున్న అర్జీని స్థానిక డీఎస్పీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఎందుకంటే ఆయుధ లైసెన్స్ ఇవ్వాలంటే అందుకు తగిన కారణాలు చూసి మార్గదర్శకాలు పాటించాల్సిందే. అడుగుతోన్న వ్యక్తి చరిత్ర ఏంటి.? అతనికి నిజంగా ప్రాణహాని ఉందా.? ఆయుధాన్ని దుర్వినియోగం చేస్తాడా.? ఏదైనా సెటిల్మెంట్ వ్యవహారాలున్నాయా.? అంటూ పలు కోణాల్లో స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత సబ్ డివిజనల్ పోలీసు అధికారి సిఫారసు చేస్తే జిల్లా ఎస్పీ గన్ లైసెన్స్ జారీ చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ సొంతూరుకు చెందిన గొర్లె భరత్ కుమార్ యాదవ్ నాలుగు నెలల క్రితం గన్ లైసెన్స్ కోసం కడప పోలీసు అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏడాదిన్నర క్రితమే భరత్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అప్పట్లో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ఢిల్లీలో సీబీఐ విచారించేది. భరత్ తరచూ ఢిల్లీ వెళ్లి అక్కడ జరుగుతున్న విచారణ వివరాలను ఈ కేసులో ఏ-5 దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి చేరవేసేవాడు.
దస్తగిరి ఒకదశలో.. భరత్‌కుమార్‌పై ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య ఘటనలోని ముఖ్యుల పేర్లు విచారణలో సీబీఐకి చెప్పొద్దని తనను భరత్ బెదిరించాడని తన వాంగ్మూలంలో దస్తగిరి తెలిపాడు. అయితే.. సీబీఐ తనను విచారణ సందర్భంగా తీవ్రంగా బెదిరించిందని భరత్ మీడియాకు ఎక్కడంతో అతని పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. పులివెందుల ప్రాంతంలో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేయడం, మట్కా వ్యవహారాల్లో వసూళ్లు చేయడం లాంటివి ప్రస్తుతం భరత్ చేస్తున్నట్టు పోలీసులకు తెలిసింది. ఈ కారణాలతో భరత్‌కు ఆయుధ లైసెన్స్ ఇచ్చేందుకు పులివెందుల డీఎస్పీ తిరస్కరించారు. కానీ ఆయన వ్యతిరేకించిన ఆ వ్యక్తికి నెల తిరక్కుండానే పై అధికారులు గన్ లైసెన్స్ ఇచ్చేశారు. వివేకా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఒక పెద్ద నాయకుడి సిఫారసుతో పోలీసు అధికారులు తమ డీఎస్పీ అభ్యంతరాలను పక్కకు తోసేశారు. అదే వ్యక్తి ఇప్పుడు ఇద్దరిపై కాల్పులు జరిపి ఒకరి ప్రాణాలు తీయడంతో ఈ వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.
Updated Date - 2023-03-29T02:55:19+05:30 IST