KR Suryanarayana: తాఖీదు.. ఊహించిందే!
ABN, First Publish Date - 2023-01-24T03:45:45+05:30
ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌ను కలిసిన తర్వాత ప్రశంస వస్తుందని తాము అనుకోలేదని, తాఖీదు వస్తుందని ముందుగానే ఊహించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చెప్పారు.
గవర్నర్‌ను కలిస్తే ప్రశంసిస్తారనుకోలేదు
నిజాలు చెప్పేవారు వ్యతిరేకులుగా కనిపిస్తారు!
రోసా రూల్స్ మేరకు మీడియాతో మాట్లాడడం తప్పా?
ఆధారాలతో ప్రభుత్వానికి వివరణ ఇస్తాం
‘ఆంధ్రజ్యోతి’తో ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ
మా ఇల్లు అంటుకుందని సంబరపడొద్దు
రేపు మీ ఇళ్లూ అంటుకుంటాయి: ఆస్కార్‌రావు
విజయవాడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌ను కలిసిన తర్వాత ప్రశంస వస్తుందని తాము అనుకోలేదని, తాఖీదు వస్తుందని ముందుగానే ఊహించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చెప్పారు. వాస్తవాలు కటువుగా ఉంటాయని, అవి చెప్పేవారిని ప్రభుత్వాలు తమకు వ్యతిరేకులుగా భావిస్తున్నాయని అన్నారు. నిజాలు మాట్లాడడం వాటికి నచ్చడం లేదని, తనను అర్ధం చేసుకోలేకపోతున్నాయని ప్రస్తుత, గత ప్రభుత్వాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గుర్తింపు సంఘం నిబంఽధనావళి ప్రకారం.. మీడియాలో మాట్లాడడం నిషిద్ధమని.. మాట్లాడారు కాబట్టి మీ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసిచ్చారని.. దానిని తీసుకున్నామని తెలిపారు.
రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్ (రోసా) నిబంధనల ప్రకారం అందరం సమాధానం చెప్పాలని, అందరూ దీనికి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో 114 ఉద్యోగ సంఘాలు ఉన్నాయని, ఇవన్నీ తమకు మాదిరిగానే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తాము ఎక్కడ ఉల్లంఘించామో.. ఏ రకంగా ఉల్లంఘనో చర్చించిన మీదట తగిన రూపంలో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నిబంధనలను అతిక్రమించలేదని.. తామైతే తగిన ఆధారాలతో జవాబులు ఇస్తామని.. ఉద్యోగులు, నాయకులు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఫలానా తేదీన ఇస్తామంటే..
తాము లేవనెత్తిన ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక అంశాలకు సంబంధించి ఫలానా తేదీన బాకీలు చెల్లిస్తామని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించి ఉంటే ఇంకా స్వాగతించేవాళ్లమని సూర్యనారాయణ చెప్పారు. తమపై వ్యక్తిగత టార్గెట్లు, దూషణ, భూషణలను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోమన్నారు. చర్యలకు అర్హులమైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని చెప్పారు. నిబంధనలు అనేవి ఒక సంఘానికే పరిమితం కావన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ గుర్తింపును రద్దు చేస్తే.. సాధారణ అసోసియేషన్‌గా ఉద్యోగుల శ్రేయస్సు కోసం పనిచేస్తామని చెప్పారు. అయితే అలాంటి పరిస్థితి ఉండదని, ప్రభుత్వం మీద తమకు నమ్మకం ఉందని తెలిపారు. ‘ఈ రోజు నుంచి వచ్చే ఉరుములు, మెరుపులు చూసి ఎవరూ అఽధైర్యపడవద్దు. అవన్నీ ప్రకృతి వర్షించే ముందు జరిగే సహజ పరిణామాలని అర్ధం చేసుకోవాలి. మీకు అర్ధం అవుతోందా.. -రామసూర్యనారాయణ’ అని వాట్సాప్ స్టేట్‌సలో ఆయన గమనిక పేరుతో పోస్టు చేయడం గమనార్హం.
పరిష్కారమైతే ఎందుకు కలుస్తాం..?
ఏపీజీఈఏ ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు మాట్లాడుతూ.. తమకిచ్చిన నోటీసులో గవర్నర్‌ను కలిసిన ఫొటో న్యూస్ క్లిప్ కూడా ఉందని.. కాబట్టి ఆయన్ను కలిసినందుకు, పత్రికలతో మాట్లాడినందుకు నోటీసులు ఇచ్చినట్లుగా భావించాల్సి వస్తోందని తెలిపారు. ‘ఏపీజీఈఏకి 2019లో ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. 2023లో గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదని నోటీసిచ్చింది. 72 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకొనే కొన్ని సంఘాలు నేతలు రోజూ మీడియాలో మాట్లాడుతున్నారు. రోసా రూల్స్ మాకే కాదు.. రాష్ట్రంలోని 104 ఉద్యోగ సంఘాలకూ వర్తిస్తాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంఘాలు మా ఇల్లు అంటుకుంటుందని సంబరపడవద్దు. మీ ఇళ్లు కూడా అంటుకుంటాయని గ్రహించాలి. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి సీఎ్‌సను, ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఎన్నోమార్లు కలిసి విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రిని కూడా పలుమార్లు కలిశాం. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చినప్పుడు.. మీడియా వాళ్లు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మా అభిప్రాయం చెబితే నేరం ఎలా అవుతుంది? మేం గవర్నర్‌ను కలిస్తే.. ఇంత బాధ ఉందా అని ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. గవర్నర్ బయటివారు కాదు. రాష్ట్ర ప్రథమ పౌరుడు. ప్రభుత్వ స్థాయిలో ఇతర ప్రత్యామ్నాయ వ్యవస్థల వద్ద మా సమస్యలు పరిష్కారమైతే.. ఆయన్ను కలవడానికి ఎందుకు వెళ్తాం’ అని ప్రశ్నించారు.
వాణిజ్య పన్నుల సంఘానికీ నోటీసు?
ఏపీజీఈఏ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ప్రభుత్వం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో, కేఆర్ సూర్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర వాణిజ్య పన్నుల ఉద్యోగుల సంఘానికి కూడా తాఖీదు అందే అవకాశం కనిపిస్తోంది. ఈ శాఖలో బదిలీల వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరును తప్పుపడుతూ సూర్యనారాయణ నేతృత్వంలో ఆందోళన జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఆ సంఘానికి షోకాజు నోటీసు జారీ చేశారని.. తాజాగా గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో కూడా నోటీసు ఇవ్వొచ్చని తెలుస్తోంది.
ఏపీజీఈఏ కార్యాలయం భవనంపైనా ప్రభుత్వం దృష్టి?
ఏపీజీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నడుస్తున్న భవనంపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. విద్యాధరపురంలో ఈ భవనం ఉన్న స్థలం ఒకప్పుడు దేవదాయశాఖకు చెందిన కౌతా సత్రానికి చెందినది. దీని ట్రస్టీ కొన్నేళ్ల క్రితం ఈ భవన స్థలాన్ని సత్రం నుంచి వేరు చేసి.. అందులో భవనం నిర్మించారు. ఆ భవనాన్నే ఏపీజీఈఏకి లీజుకిచ్చారు. దీనిపై వివాదం ఉందని దేవదాయ శాఖ నుంచి నివేదిక అందడంతో ప్రభుత్వం ఈ భవనం చరిత్రపై దృష్టి సారించినట్లు సమాచారం.
Updated Date - 2023-01-24T03:45:46+05:30 IST