ఐక్యత, మతసామరస్యానికి చిహ్నం..
ABN, First Publish Date - 2023-04-27T00:43:18+05:30
హిందూ-ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన హజరత్ అబూబకర్ ఉరఫ్ బడేమియా స్వామి (తుర్లపాడు) ఉరుసు (ఉత్సవం) బుధవారం కన్నుల పండవగా ప్రారంభమైంది.
కంచికచర్ల, ఏప్రిల్ 26 : హిందూ-ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి చిహ్నంగా నిలిచిన హజరత్ అబూబకర్ ఉరఫ్ బడేమియా స్వామి (తుర్లపాడు) ఉరుసు (ఉత్సవం) బుధవారం కన్నుల పండవగా ప్రారంభమైంది. రాజకీయాలతో సంబంధం లేకుండా పిల్లలు, వృద్ధులను వెంటబెట్టుకుని ముస్లింలు దర్గాకు తరలివెళ్లటంతో పెండ్యాలలో, తుర్లపాడులో సందడి వాతావరణం నెలకొంది. రెండు రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ ఉత్సవంలో కుల, మత, ధనిక, పేద అనే తేడాలు కనిపించవు. వందల ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉరుసు అందరూ సమానమేనన్న గొప్ప భావన ప్రతి ఒక్కరిలోకలుగచేస్తున్నది.
వ్యవసాయపనులు ముగిసిన తర్వాత మామిడికాయల సీజన్ ప్రారంభంలో ముస్లింలు బడేమియా స్వామి ఉరుసును ఘనంగా జరుపుకొంటారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పెండ్యాల ముస్లింలు మంగళవారం సాయంత్రానికే స్వగ్రామం చేరుకున్నారు. బుధవారం ఉదయం భోజనం చేసి అందరూ దర్గాకు బయలుదేరారు. ఉదయం కోలాహలంగా మొదలైన ఈ ఉత్సవాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వేర్వేరుగా ప్రారంభించారు. మజ్జిగ, తాగునీరు అందించారు. కొంత మంది ఎడ్ల బండ్లపై మునేటి మీదుగా చందర్లపాడు మండలం తుర్లపాడు చేరుకోగా, పలువురు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తుర్లపాడు తరలివెళ్లారు. దర్గా వద్ద ఖాళీగా ఉన్న పంట భూముల్లో పట్టాలతో ప్రత్యేకంగా డేరాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే రాత్రి జాగారం చేస్తారు. గోధుమ పిండి, పంచదార, నెయ్యితో మిఠాయి, బిర్యానీ, పలావు తయారుచేసి, బడేమియా దర్గాలో నమాజు, ప్రత్యేక పూజలు చేస్తారు. గురువారం ఉదయం ఎద్దుల బండ్ల వెంట వచ్చిన హిందువులతో కలిసి భోజనాలు చేసి పెండ్యాల తిరిగి రావటంతో రెండు రోజుల ఉత్సవం ముగుస్తుంది.
Updated Date - 2023-04-27T00:43:18+05:30 IST