దుర్గగుడి మాస్టర్ ప్లాన్ మేరకు.. అభివృద్ధి పనులకు శ్రీకారం
ABN, First Publish Date - 2023-08-29T01:26:05+05:30
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ మేరకు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.
వన్‌టౌన్, ఆగస్టు 28 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ మేరకు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. సోమవారం బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డిలోని సమావేశపు హాలులో జరిగిన ట్రస్ట్‌బోర్డు సమావేశం అనంతరం ఈవో భ్రమరాంబ, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు నిర్ణయాలను వెల్లడించారు. ఒకేసారి 2000 మంది భక్తులు భోజనాలు చేసేందుకు వీలుగా అన్నదాన భవనం, ప్రసాదం పోటుకు సెప్టెంబరు నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. దుర్గాఘాట్‌లో భక్తులు స్నానాలు చేసేందుకు జలవనరుల శాఖ సహకారంతో ఘాట్‌లో పూడిక తీయిస్తున్నామన్నారు. దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు, నేరుగా నదిలో స్నానం చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి కేటాయించిన రూ. 70 కోట్ల నిధుల్లో రూ.5కోట్లతో మల్లేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టామని, త్వరలో ప్రాంగణంలో విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాత్రిపూట భక్తుల విశ్రాంతికి మహామండపం ఒకటో అంతస్థును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వివాహాలు చేసుకునేవారికి టికెట్ ఇచ్చే విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. ఏడాది లోపు వయస్సున్న పిల్లలున్న భక్తులకు శీఘ్రదర్శనం ఏర్పాటు చేయిస్తున్నట్టు తెలిపారు. వృద్దులు, వికలాంగుల కోసం వాహనాలను కొండ దిగువ, ఎగువన సిద్దం చేసేందుకు నిర్ణయించామన్నారు. భక్తులకు ఉచితంగా కుంకుమ ప్యాకెట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. సమావేశంలో ప్యాకెట్లను ప్రదర్శించారు. దుర్గా ఫ్లై ఓవర్‌పై అమ్మవారి ఫొటోలతో బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మల్లిఖార్జున మెట్ల మార్గాన్ని పునరుద్దరించనున్నట్టు తెలిపారు. ఆలయంలో నిర్వహించే పూజలు భక్తులు వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారానికి ఎస్‌వీబీసీ, భక్తి ఛానల్ తరహాలో ఎస్‌డీఎండీ, యూ ట్యూట్ ఛానల్‌ను తీసుకువస్తామన్నారు. దీనికోసం ఫైబర్‌నెట్, సోషల్ మీడియా సహకారం తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో రోజుకు 50 నుంచి 60 వేలమంది భక్తులు వచ్చే అవకాశమున్న దృష్ట్యా అవసరాలకు తగినట్టు ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో ట్రస్టు బోర్డు సభ్యులు, ఈఈలు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-29T01:26:05+05:30 IST