శోభాయమానం. దుర్గామల్లేశ్వరుల గిరి ప్రదక్షిణ
ABN, First Publish Date - 2023-06-05T01:07:09+05:30
జ్యేష్ట మాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం దుర్గామల్లేశ్వరుల దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య, మంగళవాయిద్యాలు, గంగా, పార్వతీ మల్లేశ్వరుల ఉత్సవమూర్తులను ఊరేగించారు.
వన్‌టౌన్, జూన్ 4 : జ్యేష్ట మాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం దుర్గామల్లేశ్వరుల దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య, మంగళవాయిద్యాలు, గంగా, పార్వతీ మల్లేశ్వరుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ, గిరిప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యంలో పాల్గొంటున్నారని, అందరి క్షేమంతో పాటు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ గిరిప్రదక్షణ నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల మనోభీష్టం మేరకు అమ్మవారికి వివిధ రకాల పూజలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ, ఈ పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ప్రారంభమై ఐదు నెలలైందని, దుర్గామల్లేశ్వరుల ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ ప్రదక్షిణ సాగుతున్నదన్నారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు, స్థానాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న దేవదాయ కమిషనర్
దుర్గమ్మను ఆదివారం దేవదాయ కమిషనర్, కార్యదర్శి ఎస్.సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈవో భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం శేషవస్త్రం, ప్రసాదం, ఆశీస్సులు అందజేశారు. ఆదివారం దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. విజయవాడ చౌదరిపేటకు చెందిన హనుమాన్ నృత్య కళానిలయం కళాకారిణుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. దేవస్థానం మహామండపంలో మంగళవారం హుండీలలో కానుకల లెక్కింపు జరుగుతుందని ఈవో భ్రమరాంబ తెలిపారు.
Updated Date - 2023-06-05T01:08:13+05:30 IST