ఇసుక అనధికార రవాణాలో సీఎం తమ్ముడు అనిల్‌రెడ్డిది ప్రధాన పాత్ర
ABN, First Publish Date - 2023-11-11T01:09:26+05:30
ఇసుక అక్రమ రవాణాలో సీఎం జగన్ రెడ్డి తమ్ముడు అనిల్‌రెడ్డిది ప్రధాన పాత్ర అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.
జేపీ వెంచర్స్ పేరుతో దొంగబిల్లులు..మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
గుంటుపల్లి సమీపంలో ఇసుక లారీని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడం వెనుక కుట్ర: దేవినేని ఉమా
ఇబ్రహీంపట్నం, నవంబరు 10: ఇసుక అక్రమ రవాణాలో సీఎం జగన్ రెడ్డి తమ్ముడు అనిల్‌రెడ్డిది ప్రధాన పాత్ర అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై గుంటుపల్లి సమీపంలో ఇసుక లారీని వెనుక నుంచి మంత్రి జోగి రమేశ్ పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టిన ఘటన గురు వారం అర్ధరాత్రి జరిగింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రెండు కిలోమీటర్ల నుంచి ఇసుక లారీని పోలీస్ ఎస్కార్ట్ వాహనం వెంటాడటంతో ఇసుక లారీ అదుపు తప్పి గుంటుపల్లి వద్ద డివైడర్ ఎక్కింది. దాని వెనుక వస్తున్న ఎస్కార్ట్ వాహనం లారీని ఢీ కొట్టడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి పోలీసులు వెళ్లిపోయారు. ఆ రహదారిలో రాత్రి వస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగి, ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇసుక లారీ ఎక్కడ నుంచి వస్తుందో ఆరా తీశారు. జేపీ వెంచర్స్ పేరుతో దొంగ బిల్లులతో ఇసుక అనధికార రవాణా జరుగుతోందని ఆయన గుర్తించారు. కావాలనే ఇసుక లారీని ఢీ కొట్టారని దీనికి వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఉమా డిమాండ్ చేశారు.
ఇసుక అనధికార రవాణాపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం: కృష్ణానది నుంచి దొంగ బిల్లులతో ఇసుక అనధికార రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్‌కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం వినతిపత్రం అందించారు. గురువారం రాత్రి గుంటుపల్లి వద్ద దొంగబిల్లులుతో ఇసుకను రవాణా చేస్తున్నారని శుక్రవారం రాష్ట్ర మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆయన వివరించారు. అడ్డూ అదుపూ లేకుండా జేపీ వెంచర్స్ పేరుతో ఇష్టారాజ్యంగా సీఎం తమ్ముడు అనిల్‌రెడ్డి ఇసుకను దోచేస్తున్నారని తెలిపారు. బిల్లులపై ఒక ధర, చెల్లిస్తోంది మరో ధర ఉందని స్వయంగా లారీ డ్రైవర్లు చెబుతున్నారని అన్నారు.
Updated Date - 2023-11-11T01:09:27+05:30 IST