Harbor port: ఎన్నికల వేళే ‘బందరు’ లడ్డూ!
ABN, First Publish Date - 2023-05-21T02:40:33+05:30
2009 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు, 2008 ఏప్రిల్ 23న బందరు పోర్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం సాగలేదు. 2019 ఫిబ్రవరి 7న నవ్యాంధ్ర సీఎం హోదాలో చంద్రబాబు బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు.
నాడు కక్ష సాధింపు.. నేడు ఎన్నికల స్టంటు
ముచ్చటగా మూడోసారి పోర్టుకు శంకుస్థాపన
రేపు టెంకాయ కొట్టనున్న సీఎం జగన్
2008లో వైఎస్ చేతుల మీదుగా శంకుస్థాపన
ఆర్థిక సంక్షోభంతో చేతులెత్తేసిన మేటాస్
ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పోర్టు
సరిగ్గా ఎన్నికల ఏడాదిలోనే హడావుడి
కానీ, పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో రాష్ట్ర ప్రభుత్వం
ఈసారీ బందరు పోర్టు సాకారం కష్టమేనా?
(విజయవాడ – ఆంధ్రజ్యోతి): 2009 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు, 2008 ఏప్రిల్ 23న బందరు పోర్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం సాగలేదు. 2019 ఫిబ్రవరి 7న నవ్యాంధ్ర సీఎం హోదాలో చంద్రబాబు బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈసారి అంతా సక్రమంగా సాగేదే. కానీ... వైసీపీ సర్కారు దీనినీ ‘రివర్స్’ బాట పట్టించింది. ఇప్పుడు... ఎన్నికల ఏడాదిరాగానే మళ్లీ బందరు పోర్టు పేరిట హడావుడి మొదలుపెట్టింది. సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేసేందుకుప్రస్తుత సీఎం వైఎస్ జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు.
– ఈ మూడు అంశాల్లో ఓ సారూప్యత ఉంది. ప్రతిసారీ ఎన్నికలకు ముందే బందరు పోర్టు తెరపైకి వస్తుండటం గమనార్హం. వాస్తవానికి బందరు పోర్టు నిర్మాణం ఉమ్మడి కృష్ణా జిల్లావాసుల చిరకాల వాంఛ. బందరు పోర్టును అభివృద్ధి చేయాలని కోరుతూ దశాబ్దాలుగా ఉద్యమాలు నడుస్తున్నాయి. వీటి ఫలితంగా 2008 ఏప్రిల్ 23న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కరగ్రహారం వద్ద బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. పోర్టు పనులు మేటాస్ సంస్థ దక్కించుకుంది. అయితే, ఆర్థికపరమైన చిక్కుల్లో ఆ సంస్థ పడటంతో నవయుగ సంస్థకు పోర్టు పనులు అప్పగించారు. అయినా పనులు ముందుకు సాగలేదు. దీంతో మళ్లీ ఉద్యమాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2015 ఆగస్టులో పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం 14వేల ఎకరాలను కేటాయించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు రైతులు ముందుకు రాకపోవడంతో 2016 ఆగస్టులో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. పోర్టు అభివృద్ధి కోసం 2016లో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) ఏర్పాటుచేశారు. 2019 ఫిబ్రవరి 7న అప్పటి సీఎం చంద్రబాబు తవసిపూడి వద్ద పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. నవయుగ సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత రెండు నెలలకే ఎన్నికలు రావడం, అధికార మార్పిడి జరిగి వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4నెలలకే పోర్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదంటూ నవయుగ సంస్థను బాధ్యతల నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ పోర్టుకు ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
సుమారు రూ.12వేల కోట్ల బందరు పోర్టు ప్రాజెక్టును ఆర్థిక పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తుందన్నది ప్రశ్నార్ధకంగా మిగులుతోంది. బందరు పోర్టు పేరుతో నిధులు సమీకరించి వాటిని సంక్షేమ పథకాల ముసుగులో దారి మళ్లించేందుకే అకస్మాత్తుగా పోర్టు శంకుస్థాపనను తెరపైకి తెచ్చారన్న వాదన ఉంది. పోర్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోంది. నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగించారు. పోర్టు నిర్మాణానికి సుమారు రూ.12వేల కోట్లు అవసరం. తొలి దశలో రూ.4682 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. పోర్టు నిర్మాణానికి కెనరా బ్యాంకు నుంచి సుమారు రూ.4వేల కోట్ల రుణ సాయం తీసుకోబోతున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఎన్ని రుణాలు తెచ్చినా పోర్టు నిర్మాణం అసాధ్యమన్న వాదన ఉంది.
Updated Date - 2023-05-21T02:40:33+05:30 IST