NTR Dist.: రెడ్డిగూడెం ఎస్ఐపై విచారణకు కోర్టు ఆదేశం
ABN, First Publish Date - 2023-02-16T16:29:57+05:30
ఎన్టీఆర్ జిల్లా: రెడ్డిగూడెం ఎస్ఐ (SI)పై విచారణకు మైలవరం కోర్టు (Mylavaram Court) ఆదేశించింది. మేజర్లు అయిన వారు ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటే వారి కుటుంబాన్ని...
ఎన్టీఆర్ జిల్లా: రెడ్డిగూడెం ఎస్ఐ (SI)పై విచారణకు మైలవరం కోర్టు (Mylavaram Court) ఆదేశించింది. మేజర్లు అయిన వారు ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటే వారి కుటుంబాన్ని ఎస్ఐ పోలీస్ స్టేషన్‌కు పిలిచి అనుచితంగా ప్రవర్తించారని బాధిత కుటుంబం మైలవరం కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... రెడ్డిగూడెం ఎస్ఐ ఆనంద్ కుమార్‌పై విచారణ చేపట్టి రిపోర్టును సమర్పించాలని మైలవరం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సీఐని ఆదేశించింది.
పూర్తి వివరాలు..
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం, సీతారాంపురం గ్రామంలో నీలిమ, జనూదన్ దంపతుల కుటుంబం నివాసముంటుంది. అదే గ్రామంలో ఉంటున్న ప్రత్యూష అనే యువతిని జనూదన్ చిన్న కుమారుడు పృథ్వి ప్రేమించాడు. వారి ప్రేమను ప్రత్యూష తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ప్రేమికులు పృథ్వి, ప్రత్యూష ఎవరికీ చెప్పకుండా గత నెల 29న పెళ్ళి చేసుకోడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇది గమనించిన ప్రత్యూష తల్లిదండ్రులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న రెడ్డిగూడెం ఎస్ఐ ఆనంద్ కుమార్.. పృథ్వి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే ఎస్ఐ తమను పీఎస్‌కు పిలిపించి.. అనుచితంగా ప్రవర్తించారని, అసభ్య పదజాలంతో దూషించడమే కాక తమ కోసం స్టేషన్‌కు వచ్చిన తన పెద్ద కుమారుడు భవానీని కొట్టారని, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తమను స్టేషన్‌లో నిలబెట్టారని పేర్కొంటూ.. భాదిత కుటుంబం మైలవరం కోర్టుని ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని న్యాయస్థానం మైలవరం సీఐను ఆదేశించింది.
కాగా ఫిర్యాదు దారుల తరుపున న్యాయవాది శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఫ్రెండ్లీగా ఉండాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం చట్టవ్యతిరేకమని అన్నారు. పోలీసులు న్యాయం చేయకపోయినా న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని అడ్వకేట్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-02-16T16:30:01+05:30 IST