పాలన.. మూలన..
ABN, First Publish Date - 2023-04-04T00:36:43+05:30
ఏడాదైనా ఏమున్నది గర్వకారణమన్నట్టు కొత్త జిల్లాలో పురోభివృద్ధి ఒక్క అడుగూ ముందుకు పడింది లేదు. నిధులు లేవు.. కార్యాలయాలు లేవు.. ఉన్న వాటిలో సదుపాయాలు కనిపించవు. ఉద్యోగులున్నా శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారు లేరు. కనీస ఖర్చుల కోసం చందాలు వేసుకునే దుస్థితి. పాలన, పోషణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతో అభివృద్ధి అటకెక్కి, ప్రజలకు అన్ని సేవలు అక్కరకు రాకుండాపోయాయి. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్త జిల్లా స్థితిగతులను ఒకసారి పరికిస్తే..
కలెక్టరేట్‌కు శాశ్వత భవనం లేని దుస్థితి
నున్నలో ఇంటిగ్రేటెడ్ భవనం ఊసే మరిచారు
రూ.2 కోట్ల నిధులు కూడా విదల్చని ప్రభుత్వం
గొల్లపూడిలో తాత్కాలిక కార్యాలయానికీ దిక్కు లేదు
ఇరుకిరుగ్గా ఆర్‌డీవో కార్యాలయాలు
కనీస మౌలిక సదుపాయాలు మృగ్యం
ఉమ్మడి జడ్పీ పాలన.. కృష్ణాజిల్లాకే ప్రాధాన్యం
విద్య, వైద్య ఆరోగ్య శాఖలు ప్రైవేటు భవనాల్లోనే..
దారుణంగా సివిల్ సప్లయిస్ పరిస్థితి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నవ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు ఇప్పటి వరకు శాశ్వత భవనం లేదు. గత సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆఫీసునే ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్సుకు రూ.2 కోట్లు మంజూరు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు నయాపైసా విదల్చలేదు. దీంతో నున్నలో భూములను సేకరించి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించాలన్న ఆలోచన ఫలించలేదు. ఈ కాంప్లెక్స్ ఏడాదిలో పూర్తిచేయాలన్న ప్రభుత్వం ఆ తర్వాత రూపాయి కూడా కేటాయించలేదు. ఈలోపు తాత్కాలికంగా గొల్లపూడిలో కలెక్టరేట్ ఏర్పాటుకు తగిన భవనాలను చూడమని చెప్పినప్పటికీ దానికీ సహకరించలేదు. గొల్లపూడిలోని దేవదాయ శాఖకు చెందిన భవనాలను చూసినా.. అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించుకోలేదు. కలెక్టరేట్‌లో మౌలిక సదుపాయాలు తగినన్ని లేవు. ప్రజలు వస్తే కనీసం కూర్చునే వెయిటింగ్ హాల్ కూడా లేదు. ఇక పార్కింగ్ అయితే అధికారుల వాహనాలకే సరిపోని పరిస్థితి. సబ్ కలెక్టరేట్ కోసం వేరే భవనాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. మాంటిస్సోరి కాలేజీ భవనంలో తాత్కాలికంగా దీనిని ఏర్పాటుచేసినా, శాశ్వత ప్రాతిపదికన చేసిందేమీ లేదు.
నందిగామ, తిరువూరులో ఆఫీసులు లేక అవస్థలు
నందిగామ, తిరువూరు ఆర్‌డీవో కార్యాలయాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈ రెండు కార్యాలయాలు ఇరుగ్గా ఉన్నాయి. తిరువూరులోని ఆర్‌డీవో కార్యాలయం స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇరుకు గదుల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. ఆసక్తి లేకుండా పనిచేస్తున్నారు. నందిగామలో అయితే తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దీని పరిస్థితి కూడా మరీ దారుణం. రెవెన్యూ డివిజనల్ స్థాయి తగ్గిపోయినట్టుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆర్‌డీవో కార్యాలయాలకు తగిన స్టాఫ్ కూడా లేరు. ఇటీవలే భర్తీ చేసినా పనిచేసే వాతావరణం లేదు. ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ విజయవాడలోనే ఉండటంతో పెద్దగా ఇబ్బందులేమీ లేవు.
రెగ్యులర్ పోస్టులు లేవు
కలెక్టరేట్‌లో పర్మినెంట్ స్టాఫ్ లేరు. విభజన క్రమంలో కలెక్టరేట్‌కు రెగ్యులర్ ఉద్యోగులను కేటాయించలేదు. తక్కువ మందికే ఇవ్వడంతో జిల్లాలో పాలన కష్టంగా మారింది. డెప్యుటేషన్లపై సిబ్బందిని తీసుకుంటున్నారు. అంటే పోస్టింగ్ ఒకచోట అయితే, పనిచేసేది కలెక్టరేట్‌లో. దీనివల్ల ఎప్పుడు ఉంటామో? ఎప్పుడు వెళ్లిపోవాల్సి ఉంటుందో తెలియక వారంతా ఇక్కడ నివసించలేని పరిస్థితి.
సివిల్ సప్లయిస్‌లో సమస్యలు
గాంధీనగర్‌లోని సహాయ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో జిల్లా సప్లయ్ ఆఫీసర్ (డీఎస్‌వో) కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాల్లో చెకింగ్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేయటానికి ఆర్‌ఐలు లేరు. నగరంలో సర్కిల్ 1, 3 కార్యాలయాలకు సహాయ పౌరసరఫరాల శాఖ అధికారులు లేరు. కనీసం ఒక్కో సర్కిల్ కార్యాలయానికి ఆరుగురుకు తక్కువ కాకుండా ఆర్‌ఐలు కావాలి. ఎందుకంటే డోర్ డెలివరీ విస్తృతంగా జరుగుతుంది కాబట్టి రేషన్ దుకాణాలు, ఎండీయూ వాహనాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఆకస్మికంగా బియ్యం అక్రమ రవాణాలపైనా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత వల్ల ఇవేమీ జరగట్లేదు.
కీలక శాఖలకు సొంత భవనాలు కరువు
జిల్లాలో విద్య, వైద్య ఆరోగ్యం వంటి కీలక శాఖలకు శాశ్వత భవనాలు లేవు. విద్యారంగానికి కేంద్రమైన విజయవాడలో విద్యాశాఖకు పర్మినెంట్ కార్యాలయం కూడా లేదు. ప్రైవేట్ భవనంలో నిర్వహించాల్సి వస్తోంది. ఆరోగ్యశాఖకు సంబంధించి నగర శివారు ప్రాంతమైన సింగ్‌నగర్‌లో కార్యాలయం ఉంది. నగరంలో సూపర్ స్పెషాలిటీ, పాత, కొత్త ప్రభుత్వాసుపత్రులున్నా.. ఆరోగ్య శాఖ కార్యాలయం విసిరేసినట్టుగా ఎక్కడో ఉంది. ఇన్ని సమస్యల మధ్య కొత్త జిల్లాలో పాలన కష్టంగానే సాగుతోంది.
జడ్పీ భవనాలు ధ్వంసం
ఓపక్క ప్రభుత్వ భవనాలు లేక ప్రైవేట్ కార్యాలయాల కోసం వెతుకులాడుతుంటే, మరోపక్క బందరు రోడ్డు వెంబడి అత్యంత ఖరీదైన స్థలంలోని జడ్పీ భవనాల ధ్వంసరచన జరుగుతోంది. జడ్పీ భవనాలను ఒక్కొక్కటిగా పగ లగొడుతూ వస్తున్నారు. కమర్షియల్ భవనం నిర్మించి అద్దెల ద్వారా ఆదాయం సాధించాలన్నది జడ్పీ ఆలోచనగా ఉంది. కమర్షియల్ భవనం పేరుతో భారీగా సొమ్ము చేసుకునేందుకు పాలకవర్గం పావులు కదుపుతోంది.
ఒక్క జిల్లాకే జడ్పీ సేవలు
జిల్లా పరిషత్ ఉమ్మడిగానే ఉంది. జడ్పీ ప్రధాన కార్యాలయం కృష్ణాజిల్లాలో ఉంది. జడ్పీ చైర్‌పర్సన్ ఆ జిల్లావారే కాబట్టి, పాలన అంతా అక్కడి నుంచే సాగుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. జడ్పీ పాలకవర్గ పెద్దలు కృష్ణాజిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి పనుల ఊసెత్తటం లేదు. కార్యాలయాల కూల్చివేత, ఆధునికీకరణ పేరుతో సొంతంగా ఎన్‌క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఆ దిశగా కదలట్లేదు.
Updated Date - 2023-04-04T00:36:43+05:30 IST