ప్రాధాన్యం ఏది?
ABN, First Publish Date - 2023-01-09T00:03:38+05:30
ఏటా ధాన్యం రైతులు దగాకు గురవుతున్నారు. ఈ ఏడాది మాండూస్ తుఫాను కారణంగా మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. క్వింటా ధరకే 170 కేజీలు ఇస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో అధికారుల, ప్రజాప్రతినిధుల హామీలు నీటి మూటలే!
తడిసిన ధాన్యం కొనే దిక్కు లేదు
సగం ధరకే అడుగుతున్న మిల్లర్లు
బస్తాకు రూ.600లే పడుతుందని రైతుల గగ్గోలు
ఈ ఫొటోలో ఉన్న రైతు నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన బావిరెడ్డి శ్రీనివాసరావు. ఈయన సొంత పొలం 4 ఎకరాలతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశారు. తుఫాను వల్ల పంట మొత్తం తడిసి మొలకలు వచ్చింది. ఆ ధాన్యం అమ్ముకోవడానికి ఆర్బీకేకి వెళితే వారు మిల్లర్లను కలవాలని చెప్పారు. మిల్లర్లను కలిస్తే క్వింటాకు 70 కిలోల ధాన్యం అదనంగా ఇస్తేనే కొంటామని తెగేసి చెప్పారు. అంటే బస్తాకు రూ.600 కూడా దక్కే పరిస్థితి లేదని శ్రీనివాసరావు లబోదిబోమంటున్నారు. శ్రీనివాసరావు ఒక్కడికే కాదు దివి ప్రాంతంలోని నాగాయలంక, కోడూరు మండలాల్లోని రైతులందరి దుస్థితీ ఇదే.
ఏటా ధాన్యం రైతులు దగాకు గురవుతున్నారు. ఈ ఏడాది మాండూస్ తుఫాను కారణంగా మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. క్వింటా ధరకే 170 కేజీలు ఇస్తేనే కొంటామని మిల్లర్లు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
అవనిగడ్డ టౌన్ : దివి ప్రాంతంలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో భారీ వర్షాల కారణంగా మొలకలు వచ్చిన వరిని కొనేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాండూస్ తుఫాను కారణంగా అప్పటికే కోతలు కోసి ఉన్న వరి పనలు డ్రెయిన్లు ఎగ తట్టడంతో నాలుగైదు రోజులపాటు వర్షంలో నానిపోవటంతో దాదాపుగా 2 వేల ఎకరాల మేర పంట ఓదెలపైనే మొలిచింది. ఆ సమయంలో పంటను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా అధికారులు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎకరాకు రూ.8 వేలకుపైగా ఖర్చు పెట్టి నూర్పిడి చేసుకున్న రైతులకు నేడు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. వర్షాల కారణంగా మొలకలు వచ్చిన వరి పంట అనంతరం ఆరుదల వచ్చేటప్పటికి బరువు తగ్గింది. ఎకరాకు 35 బస్తాలు అవుతాయని అనుకున్నవి కాస్తా.. 22 బస్తాలు కూడా రావటం రాలేదు. క్వింటాకు 70 కిలోలు అదనంగా ఇస్తేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మిల్లర్లు చెబుతున్నారు.
అధికారుల హామీలు నీటి మూటలే..
దివి ప్రాంతంలో పర్యటించిన సివిల్ సప్లయీస్ డీఎం శ్రీధర్ మొలకలు వచ్చిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించి తేమ శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే గడిచిన వారం రోజులుగా మాసూళ్ల పనులు ప్రారంభించిన రైతులకు తుఫాను సందర్భంగా హామీ ఇచ్చిన అధికారులు నేడు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని, రైతుకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ మిల్లర్లకు అనుకూలంగానే అధికారులు మాట్లాడుతున్నారని రైతులు అంటున్నారు. నాగాయలంక, కోడూరు మండలాల్లో నీటమునిగి మొలిచిన పంటను నష్టపోయినట్టు ఎన్యుమరేషన్‌లో ప్రభుత్వం నమోదు చేయకపోవటంతో కనీసం తమకు పరిహారం కూడా వచ్చే అవకాశం లేకుండాపోయిందని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు : ఎమ్మెల్యే
తడిసి మొలిచిన ధాన్యాన్ని కొనే నాథుడు లేరంటూ దివి ప్రాంతానికి చెందిన రైతులు ఓ వైపు వాపోతుంటే శనివారం అవనిగడ్డలో ధాన్యం కొనుగోళ్లపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని, గతంలో కంటే ఎక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ కొంతమంది మిల్లర్లు, రాజకీయ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
నాటి ప్రభుత్వమే నయం..
టి.కొత్తపాలెం రెవెన్యూ గ్రామంలో తాను రెండు ఎకరాల్లో ప్రకృతి సేద్య విధానంలో వరి సాగు చేశా. వర్షాల నాటికి పంట కోసి ఉండగా, కోసిన పంట మొత్తం ఓదెలపైనే మొలకలు వచ్చాయి. నేడు ఆ పంటను కొనేవారు లేరు. 1997-98 ప్రాంతాల్లో దివి ప్రాంతంలో ఇదే విధంగా పంట ఓదెలపై తడిసి మొలిచిపోతే నాటి ప్రభుత్వం బస్తాకు రూ.100 మాత్రమే తగ్గించి ఎందుకూ పనికి రాకుండాపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసింది. కానీ నేడు ఆర్బీకేల చుట్టూ తిరిగినా కొనడం లేదు.
- తలశిల శివరామకృష్ణ, టి.కొత్తపాలెం, నాగాయలంక మండలం
Updated Date - 2023-01-09T00:03:40+05:30 IST