ఆశలు నెరవేరేనా?
ABN, First Publish Date - 2023-01-03T00:23:40+05:30
కృష్ణానదిని ఆనుకుని మూడో దశలో నిర్మించే రక్షణ గోడ.. పెనమలూరు మండలం చోడవరం, మోపిదేవిలో శ్రీకాకుళం వద్ద నిర్మించే రెండు మినీ బ్యారేజీలు.. అన్నీ కీలకమైనవే. కానీ, కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టు పనుల కదలిక కొత్త ఏడాదిలోనైనా ఉంటుందా అనేది సందేహంగా మారింది. జలవనరుల శాఖ అధికారులు మాత్రం కొత్త సంవత్సరంలో అడుగులు ముందుకు పడతాయన్న ఆశతో ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. - (ఆంధ్రజ్యోతి-విజయవాడ)
పరిపాలన ఆమోదాలకే పరిమితమైన రక్షణ గోడ, మినీ బ్యారేజీలు
ఈ ఏడాది కదలికలపై అధికారుల్లో ఆశలు
నిధులు విడుదల కాక వెంటాడుతున్న సందేహాలు
రక్షణ గోడకు నిధులేవీ?
కృష్ణానదిని ఆనుకుని నిర్మించే రక్షణ గోడ మరింత ముందుకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడోదశలో నిర్మించే రక్షణ గోడ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారు చేసింది. వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదిలినప్పుడు కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలకు ముంపు ఉండేది. దీన్ని అరికట్టడానికి నాటి టీడీపీ ప్రభుత్వం యనమలకుదురు వైపున 2.2 కిలోమీటర్ల గోడను నిర్మించింది. వైసీపీ వచ్చాక కృష్ణలంక వరకు 1.2 కిలోమీటర్ల మేర గోడను నిర్మించింది. ఈ గోడను కనకదుర్గ వారధి వరకు నిర్మించారు. అయినప్పటికీ పద్మావతి ఘాట్ వరకు నదీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఇళ్లు ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు ఈ ఇళ్లలోని జనాన్ని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది. ఈ ముంపు ప్రభావం లేకుండా చేయడానికి మూడో దశలో 1.2 కిలోమీటర్ల మేర రక్షణ గోడను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి ఆమోదం మాత్రమే లభించింది. ఈ గోడ నిర్మాణానికి రూ.118 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లో 3.4 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణం పూర్తయ్యింది. మూడో దశ నిర్మాణం పూర్తయితే మొత్తంగా 4.6 కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతంలో రక్షణ గోడను నిర్మించినట్టవుతుంది. మూడో దశకు కేటాయించిన నిధులు ఎప్పుడు విడుదలవుతాయోనని అధికారులు ఎదురుచూస్తున్నారు.
మినీ బ్యారేజీల మాటేంటి?
వరదలొస్తే చాలు వందలకొద్దీ టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఇది మొదటి సమస్య. సముద్రానికి పోటు వచ్చిన ప్రతిసారీ సముద్రపు నీరు ముందుకు వస్తోంది. ఫలితంగా ఆ పరిసర ప్రాంతాల్లో భూములు చౌడు బారిపోతున్నాయి. భూగర్భ జలాలు ఉప్పుమయం అవుతున్నాయి. ఇది రెండో సమస్య. ఈ రెండింటికీ శాశ్వత పరిష్కారం చూపాలని భావించిన ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు మినీ బ్యారేజీలను నిర్మించాలని భావించింది. ఇందులో ఒక దాన్ని పెనమలూరు మండలం చోడవరం వద్ద, మరో దాన్ని నదికి శివారున శ్రీకాకుళం వద్ద నిర్మించాలని నిర్ణయించింది. ఈ రెండింటిలో ఒక దానికే ప్రస్తుతం పరిపాలన ఆమోదం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. నదికి శివారున నిర్మించే రెండో బ్యారేజీకి ఆమోదం తెలిపిన తర్వాత మిగిలిన బ్యారేజీ గురించి ఆలోచించాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. కృష్ణానదిపై నిర్మించబోయే కొత్త బ్యారేజీలకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ రూపొందించింది. డీపీఆర్‌కు ప్రభుత్వం రూ.2.5 కోట్లను కేటాయించింది. ఈ బ్యారేజీల డిజైన్లకు జలవనరుల శాఖ ఆమోదించింది. ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో పెనమలూరు మండలం చోడవరం వద్ద ఒక బ్యారేజీని, దీనికి దిగువన 60 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం వద్ద మరో బ్యారేజీని నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బ్యారేజీల నిర్మాణంతో అటు మోపిదేవి వద్ద, ఇటు చోడవరం వద్ద పరిస్థితులు పూర్తిగా మారతాయని భావిస్తున్నారు. చోడవరం, మోపిదేవి వద్ద బ్యారేజీల్లో ఒక్కో దాంట్లో 4.5 టీఎంసీ నీరు నిల్వ ఉండేలా నిర్మించాలని నిర్ణయించారు.
నీటి నిల్వ సామర్థ్యం పెంచొచ్చు
ప్రకాశం బ్యారేజీ దిగువన నదీ పరివాహక ప్రాంతంలో చుక్క నీరు ఉండట్లేదు. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం నిండుకుండలా కనిపిస్తుంది. చోడవరం, శ్రీకాకుళం వద్ద నిర్మిస్తే మూడు బ్యారేజీలు అవుతాయి. కొత్తగా మినీ బ్యారేజీలు అందుబాటులోకి వస్తే మొత్తం 11.17 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ప్రభుత్వం రెండు మినీ బ్యారేజీలకు ఒకేసారి ఆమోదం తెలపడంతో నిర్మాణం ఒకేసారి ప్రారంభమవుతుందని భావించారు. అయితే, ప్రభుత్వం ముందు ఒక బ్యారేజీకి ఆమోదం తెలిపే యోచనలో ఉన్నట్టు సమాచారం. దీని నిధుల విడుదల విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
Updated Date - 2023-01-03T00:23:42+05:30 IST