కేసు ‘కట్టలేరు’!
ABN, First Publish Date - 2023-06-28T00:31:42+05:30
కట్టలేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సచివాలయంలోనే డంప్ చేస్తే ఒక ఫ్లెక్సీపెట్టి చేతులు దులుపుకుంది రెవెన్యూ విభాగం. తహసీల్దార్ బోర్డు పెట్టినా అక్రమం కొనసాగుతూనే ఉంది. ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. ఎండీవో ఫిర్యాదు చేస్తే తప్ప చర్యలు తీసుకోనని తహసీల్దారే చెబుతున్నారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని దుస్థితి ఇది. గ్రామ సచివాలయ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ అక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది.
అధికార పార్టీ నేతలకు దాసోహమైన రెవెన్యూ అధికారులు
కట్టలేరు ఇసుక దొంగలపై చర్యలకు వెనకడుగు
గంపలగూడెంలోని ఇసుక అక్రమ డంప్ మాయం
సీజ్ చేసిన డంప్‌లోని ఇసుక అమ్మేసుకుంటున్న అక్రమార్కులు
అడ్డుకుంటున్న గ్రామస్థులు
స్పందనలో ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోరు
తహసీల్దార్ తీరు తీవ్ర వివాదాస్పదం
కట్టలేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సచివాలయంలోనే డంప్ చేస్తే ఒక ఫ్లెక్సీపెట్టి చేతులు దులుపుకుంది రెవెన్యూ విభాగం. తహసీల్దార్ బోర్డు పెట్టినా అక్రమం కొనసాగుతూనే ఉంది. ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే.. ఎండీవో ఫిర్యాదు చేస్తే తప్ప చర్యలు తీసుకోనని తహసీల్దారే చెబుతున్నారు. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని దుస్థితి ఇది. గ్రామ సచివాలయ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ అక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అధికార పార్టీ నేతలకు రెవెన్యూ అధికారులు దాసోహమయ్యారు. ఎమ్మెల్యేను కాదని బతికి బట్టకట్టలేమని నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు. గంపలగూడెం తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి తీరు ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. జిల్లాస్థాయి స్పందనలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌వోలకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదుపై అర్జీదారులకు న్యాయం చేసింది లేదు. పదేపదే ఫిర్యాదులు చేస్తుంటే.. ఆయనకు చిర్రెత్తుకొస్తోంది.
అక్రమార్కులకు రెవెన్యూ సహకారం
అక్రమార్కులకు కట్టలేరు ఉప నది కల్పతరువుగా మారిపోయింది. ఇసుక తోడేళ్లకు అంది వచ్చిన అవకాశంగా ఉంది. కనుమూరు రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను త వ్వి తరలించి అమ్ముకోవటం.. వైసీపీ ఇసుక తోడేళ్లకు అలవాటుగా మారిపోయింది. అధికారం ఉండటం, అధికారులంతా తమ కనుసన్నల్లో ఉండటంతో.. వీరు బాహాటంగానే ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసి అమ్ముకుంటున్నారు.
గంపలగూడెం-2 వైసీపీ ఎంపీటీసీ భర్త హరిక్రిష్ణ అనే వ్యక్తి కట్టలేరు నుంచి భారీ సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి డంప్‌లు చేసి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఏకంగా గ్రామంలోని పోలీసుస్టేషన్ పక్కనే ఉన్న సచివాలయం దగ్గర పెద్దఎత్తున ఇసుక డంప్ చేశాడు. ఈ డంప్‌ను వేణుమాధవ్ అనే వ్యక్తికి విక్రయించాడు. గ్రామ సచివాలయం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ శ్రీనివాసరావు తాను నిర్మించే సచివాలయం దగ్గర ఇసుక డంప్ ఉండటంతో.. దీనిని తానే డంప్ చేశానని పదిమందీ భావిస్తారేమోనన్న ఉద్దేశంతో ఆయన స్థానిక ఎండీవోకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్‌తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ డంప్‌ను కొనుగోలు చేసిన వేణుమాధవ్ అనే వ్యక్తి దశల వారీగా డంప్ నుంచి ఇసుకను తరలిస్తుండటంతో.. గ్రామస్థులు అడ్డుకుని స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించారు. తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ఆ డంప్ దగ్గర హెచ్చరిక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అయినప్పటికీ ఈ డంప్ నుంచి అక్రమంగా ఇసుక తరలిపోతూనే ఉంది. తాజాగా కోట కుటుంబరావు అనే వ్యక్తి ఈ డంప్ నుంచి ఇసుకను తరలిస్తుండటంతో.. గ్రామస్థులు, అధికార పార్టీకి చెందినవారు అడ్డుకుని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ బాలకృష్ణారెడ్డికి స్థానిక అధికార పార్టీ నేతలే స్పందనలో ఫిర్యాదు చేశారు. తక్షణం అక్రమార్కులపై కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేయగా.. తహసీల్దార్ కూడా అసహనం చెందారు. స్థానిక ఎండీవో ఫిర్యాదు చేస్తే తప్ప తాను చర్యలు తీసుకునేది లేదని తేల్చి చెప్పటంతో.. ఫిర్యాదు చేసిన వారు అవాక్కయ్యారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా.. చర్యలు తీసుకోవటం లేదంటే.. తహసీల్దార్‌గా మీకు, ఎండీవోలకు అక్రమార్కుల నుంచి ముడుపులు అందుతున్నాయేమోనన్న అనుమానం కలుగుతోందని ఫిర్యాదుదారులు లిఖితపూర్వకంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మట్టి అక్రమాలను వదిలేశారెందుకు?
గంపలగూడెం నల్ల చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలకు స్థానిక రెవెన్యూ అధికారులు అండదండలున్నాయి. వీఆర్వో ప్రతాప్ కనుసన్నల్లోనే నల్లచెరువు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలను వ్యతిరేకించే అధికారపార్టీ నేతలు సైతం జేసీబీలతో తవ్వకాలు చేస్తుండటం, ట్రాక్టర్లలో మట్టి తరలింపు వీడియోలను చూసి నిలుపుదల చేయమన్నా.. మట్టి తవ్వకాలు జరగటం లేదని వీఆర్వో ప్రతాప్ బుకాయిస్తుండటంతో వివాదాస్పదంగా మారుతోంది. సాక్ష్యాధారాలతో సహా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా బాలకృష్ణారెడ్డి చర్యలు తీసుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. ట్రిప్పుకు వెయ్యి రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్న దృశ్యాలను కూడా తాము చూపించినా చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
అవసరానికి మట్టి తోలుకునే వారిపై కేసులు
ప్రజలకు మట్టి అవసరమై ఎక్కడైనా నాలుగు ట్రిప్పులు తవ్వుకుంటే మాత్రం వారిపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక 65 సంవత్సరాల వృద్ధ మహిళ తన మామిడితోటలోని చెట్లు చచ్చిపోతున్నాయన్న ఉద్దేశంతో సారవంతమైన మట్టిని తరలించుకుంటే.. ఆమె మీద కేసు నమోదు చేశారు. నాలుగైదు ట్రక్కులకే కేసులు రాస్తే.. నిత్యం వందల సంఖ్యలో ట్రక్కుల మట్టి తరలిస్తూ, లక్షల రూపాయలకు విక్రయిస్తున్న అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోరు.
Updated Date - 2023-06-28T00:31:42+05:30 IST