నెలకు రూ. 10 లక్షలు వృథా
ABN, First Publish Date - 2023-02-11T00:30:04+05:30
వైసీపీ ప్రభుత్వం పని తీరుకు ఇంటింటికీ రేషన్ ఓ ఉదాహరణ. ప్రజా ధనం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం లక్ష్యం లేదు. కనీసం రేషన్ పంపిణీ వ్యవస్థను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్భాటంగా మిగిలిపోయిన ఇంటింటికీ రేషన్
గ్రామాల్లో చేతులెత్తేసిన ఎండీయూ వాహనాల డ్రైవర్లు
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
డోన్ నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
డోన్, ఫిబ్రవరి 10: వైసీపీ ప్రభుత్వం పని తీరుకు ఇంటింటికీ రేషన్ ఓ ఉదాహరణ. ప్రజా ధనం పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం లక్ష్యం లేదు. కనీసం రేషన్ పంపిణీ వ్యవస్థను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం రేషన్ ఇంటింటికీ తరలించే వాహనాల నిర్వహణకే నెలకు జిల్లాలో రూ.10 లక్షలు తగలేస్తున్నారు. అయినా గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్ల వద్దకు రేషన్ చేరడం లేదు. ప్రభుత్వ ఆర్భాటం తప్ప ఆచరణలో ఏమీ లేదు. ఇది డోన్ నియోజకవర్గంలో నడుస్తున్న తీరు.
గతంలో రేషన్ లబ్ధిదారులు స్టోర్ దగ్గరికి వెళ్లి బియ్యం వగైరా తెచ్చుకొనేవారు. లబ్ధిదారులను ఆకట్టుకోడానికి వైఎస్ జగన్ ఇంటికే రేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది మలైతే అంతకంటే ఏం కావాలి? కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కడా ఇంటి వద్దకే వెళ్లి నిత్యావసరాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. మొబైల్ డిస్ర్టిబ్యూషన్ యూనిట్ ఆపరేటర్లు (వాహనాల డ్రైవర్లు) చేతులెత్తేయడంతో.. ఇంటింటికీ రేషన్ విఫల పథకంగా మారిందనే అభిప్రాయం ఉంది. వాహనాల నిర్వహణ పేరుతో ప్రతి నెలా రూ. లక్షలు ఖర్చు చేయడం తప్ప ఫలితం కనిపించడం లేదు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటం కూడా దీనికి కారణమనే విమర్శలున్నాయి.
వైసీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్లు ఖర్చు చేసింది. అందులో భాగంగా డోన్ నియోజకవర్గంలోని డోన్ మండలానికి 14 ఎండీయూ వాహనాలు, ప్యాపిలి మండలానికి 14, బేతంచెర్ల మండలానికి 17 ఎండీయూ వాహనాలను కేటాయించారు. సివిల్ సప్లయ్ గోడౌన్ల నుంచి రేషన్ డీలర్లు నిత్యావసర సరుకులను తీసుకువచ్చి ఎండీయూ వాహనాల డ్రైవర్లకు అప్పగించాలి. ఎండీయూ వాహనాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలి. అయితే గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ అంతా తూచ్ అన్నట్లుగా మారిందనే విమర్శలున్నాయి.
కొరవడిన చిత్తశుద్ధి
ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం మీద వైసీపీ సర్కార్‌కు చిత్తశుద్ధి కొరవడింది. ప్రచార ఆర్భాటం తప్ప.. ఆచరణలో ఈ కార్యక్రమం డోన్ నియోజకవర్గంలో విఫలం అయిందన్న విమర్శలున్నాయి. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో 45 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. గ్రామాల్లో ఎండీయూ వాహనాలు ఇంటింటికి వెళ్లడం లేదు. వాహనాల ఆపరేటర్లు చేతులెత్తేశారు. మొబైల్ డిస్ర్టిబ్యూషన్ వాహనాలను ఆపరేటర్లు తమ ఇళ్ల వద్దనే నిలుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో లబ్ధ్దిదారులు మొబైల్ వాహనాలు ఉన్న ఇంటి వద్దకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్తున్నారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్లు పని వేళలు కూడా పాటించడం లేదని.. దీంతో లబ్ధిదారులు రేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందన్న విమర్శలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చౌక దుకాణాల్లో ఆరు, ఏడు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగేవని లబ్ధిదారులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎండీయూ వాహనాల్లో రెండు, మూడు నిత్యావసర సరుకులకు మించి ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
డోన్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ ఎండీయూ వాహనాలపై రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో ఎండీయూ వాహనాల రేషన్ డ్రైవర్లు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతి నెలా రూ.లక్షలు ఖర్చు
వైసీపీ సర్కార్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినా క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ఒక్కో ఎండీయూ వాహన నిర్వహణ కోసం ప్రతి నెల రూ.21 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో డోన్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 45 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు ప్రతి నెలా ఈ వాహనాల కోసం రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
రేషన్‌కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు
మండలంలో ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకం సక్రమంగా అమలు కావడం లేదు. దీంతో రేషన్‌కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డుదారులను స్టోర్ల వద్దకే పిలిపించుకుని డీలర్లు బియ్యం అందిస్తున్నారు. ఈ సమస్యపై లబ్ధిదారులతో ఉద్యమిస్తాం
- పులిశేఖర్, సీపీఐ మండల కార్యదర్శి
మా ఊర్లో రేషన్ దుకాణం లేదు. 4 కి.మీల దూరంలో ఉన్న జక్కసాని కుంట్లకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి. దీని వల్ల నెల నెలా ఇబ్బంది పడుతున్నా. వాహనం ద్వారా రేషన్ ఇస్తున్నారని అంటున్నారు. ఎక్కడ ఇస్తున్నారో నాకు తెలియదు. మా గ్రామానికి మాత్రం వాహనం రావడం లేదు.
- ఓబులమ్మ నా దృష్టికి రాలేదు
డోన్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎండీయూ వాహనాల ఆపరేటర్లు ఇంటింటికి రేషన్ సరిగ్గా పంపిణీ చేయడం లేదని నా దృష్టికి రాలేదు. అలాంటి సమస్య ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల్లో డీలర్లు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లతో ఆర్డీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన ఆదేశాలు ఇస్తాం.
- వెంకటరెడ్డి, ఆర్డీవో, డోన్
Updated Date - 2023-02-11T00:30:09+05:30 IST