తెగ తాగేస్తున్నారు..
ABN, First Publish Date - 2023-07-30T23:58:26+05:30
కొత్త కొత్త బ్రాండ్లు.. అదిరిపోయే రేట్లు.. అయినా అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఊరూరా బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి జోరుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.
రేట్లు పెరిగినా తగ్గని మద్యం అమ్మకాలు
నాలుగేళ్లలో రూ.3 వేల కోట్ల అమ్మకాలు
పేరుకే నిషేధం
బార్లలో అధిక ధరలతోబాదుతున్న వైనం
విచ్చలవిడిగా బెల్టుషాపుల ఏర్పాటు
పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ విక్రయాలు
కొత్త కొత్త బ్రాండ్లు.. అదిరిపోయే రేట్లు.. అయినా అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఊరూరా బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి జోరుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో రూ.3 వేల కోట్ల అమ్మకాలు సాగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన జగన్ మద్య నిషేధం మాట మరిచిపోయి అదే ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం ద్వారా వచ్చిన సొమ్ముతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కర్నూలు(అర్బన్) జూలై 30: జిల్లాలో నాలుగేళ్ల కాలంలో దాదాపు రూ.3 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఒకప్పటి బ్రాండ్లు రాష్ట్రంలో అందుబాటులో లేకపోయినా అమ్మకాల ఆదాయం మాత్రం తగ్గలేదు. రకరకాల బ్రాండ్లు తెచ్చి వాటి రేట్లను పెంచిన ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇదే సొమ్మును వినియోగిస్తోంది. భూంభూం, బ్రిటీష్ 8 పీఎం, డాక్టర్స్ అంటూ రకరకాల బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. మద్యానికి అలవాటు పడ్డ జనం వీటిని తెగ తాగేశారు. ఈ చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్లుగా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బునే అమ్మఒడికి తల్లుల ఖాతాల్లో జమచేసినట్టు తెలుస్తోంది. బెల్టుషాపులు లేవని చెబుతున్న ప్పటికీ ప్రతి పల్లెలో మందు ఫుల్లుగా దొరుకుతోంది. అయితే కోరుకున్న సరుకు కాకుండా ప్రభుత్వ షాపుల్లో అమ్మే మందే పల్లెల్లోనూ దొరుకుతోంది. మందుబాబుల రక్తాన్ని పీల్చేస్తున్న ప్రభుత్వానికి తోడు.. పల్లెల్లో బెల్టు షాపులు నిర్వాహకులు మరో రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే టీడీపీ హయాంలో రూ.50, రూ.60కి దొరికే చీప్ లిక్కరు క్వార్టర్ సీసా జగన్ పుణ్యమా అని రూ.150కి చేరింది. అదే సీసాను బెల్టు షాపుల్లో రూ.220కి అమ్ముకుం టున్నారు. ఇక చిన్న టీ కోట్టు, షాపు మొదలు పెద్దపెద్ద షాపింగ్ మాల్ వరకు డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఫోన్‌పే, గుగూల్ పే, పేటీఎం వచ్చాక నగదు వాడకం తక్కువైంది. కానీ మద్యం షాపుల్లో మాత్రం ఈ వ్యవస్థ ఉండదు. ఎందుకు కంటే అది అడగకూడదు. అక్కడ క్యాష్ మాత్రమే తీసుకుంటారు.
సగటు అమ్మకాల విలువ ఇలా..
ప్రభుత్వం మద్యం దుకాణాల అమ్మకాలను పరిశీలిస్తే 2018-19లో మద్యం అమ్మకాల విలువ రూ.628.03 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల విలువ రూ.2868.24 కోట్లు. అంటే సగటున ఏడాదికి వంద కోట్లు అమ్మకాలు పెరిగాయనే చెప్పాలి. 2019-2020లో రూ.595.99, 2020- 2021లో రూ. 376.86, 2021- 2022లో రూ.546.63, 2022-2023లో రూ. 720.76 కోట్ల అమ్మకాలు సాగాయని ఎక్సైజ్ రికార్డులు సూచిస్తున్నాయి.
తెరపైకి కొత్త బ్రాండ్లు..
టీడీపీ ప్రభుత్వ హయాం వరకు మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేవి. ఎన్నికల మేనిఫెస్ట్టోలో భాగంగా దశల వారిగా మద్య నిషేధం కోసమని జగన్ నూతన మద్యం పాలసీని తెరపైకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మకాలను ప్రారంభించింది. బార్లు మాత్రం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. 2019 సెప్టెంబరులో ప్రభుత్వం మద్యం షాపులు ఏర్పాటు చేసింది. జిల్లాలో 79 ప్రభుత్వం మద్యం షాపులు ఉండగా 29 బార్లు ఉన్నాయి. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం షాపులు తగ్గించామని చెబుతున్న్నారు. 2019 నుంచి మద్యం అమ్మకాలను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి వరకు ఉన్న బ్రాండ్లన్నీ మాయమైపోయి ఎన్నడూ చూడని బ్రాండ్లు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం మద్యం షాపులకు వెళ్లి ఫలానా మద్యం కావాలనే పరిస్థితి పోయి ఫలానా ధర ఉన్న మందు కొనాలనే పరిస్థితి వచ్చింది.
సంవత్సరం ఐఎంఎల్ బీరు కేసులు రాబడి రూ.లో
కేసులు
2018-2019 1118046 922298 628,03,20,511
2019-2020 829306 677447 595,99,96,274
2020-2021 324032 176085 376,86,29,259
2021-2022 519820 272159 546,63,48,909
2022-2023 760035 384833 720,76,09,994
Updated Date - 2023-07-30T23:58:26+05:30 IST