Lorry Accident : లారీని ఢీకొట్టి పల్టీ..!
ABN, First Publish Date - 2023-11-23T02:30:11+05:30
విశాఖ నగరంలోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద బుధవారం ఉదయం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో..
విశాఖలో స్కూల్ పిల్లల ఆటోకు ప్రమాదం
వేగంగా దూసుకొచ్చి లారీ క్యాబిన్‌ను ఢీకొట్టిన ఆటో
ఆటో డ్రైవర్ సహా ఆరుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద బుధవారం ఉదయం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో.. లారీని ఢీకొట్టింది. రైల్వేస్టేషన్ వైపు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్తున్న లారీ ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. లోపలున్న విద్యార్థులు గాల్లో ఎగిరి చెల్లాచెదురుగా రోడ్డుపై పడ్డారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. సీసీ కెమెరాలో నమోదైన ప్రమాద దృశ్యాలు గగుర్పాటుకు గురిచేశాయి. అయితే ఈ ప్రమాదంలో చిన్నారులకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెం, 104 ఏరియా ప్రాంతాలకు చెందిన హాసినిప్రియ, గంతి గాయిత్రి, మళ్ల వాణిజయరమ్య, లక్ష్య, చార్విక్, కౌషల్, కేయూష్, భవేష్ రామ్‌నగర్, వీఐపీరోడ్డు, ఈస్ట్‌పాయింట్ కాలనీల్లో గల పాఠశాలల్లో చదువుతున్నారు. అక్కయ్యపాలెం నందగిరి నగర్‌కు చెందిన టి.అప్పలరాజు వారిని ప్రతిరోజూ ఉదయం 7:30 గంటలకు ఆటోలో పాఠశాలకు తీసుకెళ్లి మళ్లీ సాయంత్రం ఇళ్లకు తీసుకొస్తూ ఉంటాడు. అయితే బుధవారం ఉదయం కొంచెం ఆలస్యం కావడం, ఈ ఎనిమిది మందినీ బేతనీ స్కూల్ వద్ద దింపిన తర్వాత మరికొంత మంది విద్యార్థులను వేరొక పాఠశాల వద్ద డ్రాప్ చేయాల్సి ఉండడంతో ఆటోను వేగంగా నడిపాడు.
ఉదయం 7:35 గంటలకు సంగం శరత్ జంక్షన్ వద్దకు రాగానే.. రోడ్ క్రాస్ చేసే సమయంలో ఆగి చూసుకుకుని వెళ్లాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. రైల్వేస్టేషన్ వైపు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్తున్న లారీని గమనించకుండా వేగంగా ఆటోని ముందుకు పోనిచ్చాడు. ఆ తర్వాత లారీని గమనించి బ్రేక్ వేసినప్పటికీ.. ఆటో కంట్రోల్ కాక క్యాబిన్ ముందు భాగాన్ని ఢీకొట్టాడు. ఆ వేగానికి ఆటోతోపాటు విద్యార్థులు కూడా గాల్లోకి ఎగిరి రోడ్డుమీదా పడ్డారు. ఈ ప్రమాదంలో పదో తరగతి చదువుతున్న హాసినిప్రియ, తొమ్మిదో తరగతి విద్యార్థిని గాయత్రి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న వాహన చోదకులు, దుకాణాల వద్ద ఉన్నవారు పరుగున వచ్చి ఆటోను పైకెత్తి లోపలున్న విద్యార్థులను బయటకు తీశారు. అటుగా వస్తున్న బెస్ట్‌వెస్ట్రన్ హోటల్ మేనేజర్ వెంకటరావు గాయపడిన విద్యార్థులను తన కారులో తీసుకెళ్లి సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చేర్పించారు. హాసిని ప్రియకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం హాసిని, గాయత్రి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడిన విద్యార్థులను మాత్రం డిశ్చార్జి చేశారు. ఆటో డ్రైవర్ అప్పలరాజుకు రైల్వే ఆస్ప్రతిలో చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో లారీని క్లీనర్ నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన విద్యార్థులను వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, తెలుగుదేశం నాయకులు గండి బాబ్జీ తదితరులు పరామర్శించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ప్రమాద దృశ్యాలు గగుర్పాటుకు గురిచేశాయి.
ఆటో ప్రమాదం గుండెను పిండేసింది: లోకేశ్
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో జరిగిన స్కూలు పిల్లల ఆటో ప్రమాదం తన గుండెను పిండేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు ఏమీ కాకూడదని, వారు తిరిగి ఆడుతూ, పాడుతూ స్కూలుకు వెళ్లే రోజు త్వరగా రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఆ పిల్లల తల్లిదండ్రులకు సూచించారు.
పంది అడ్డొచ్చి స్కూల్ ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
మధురవాడ (విశాఖపట్నం), నవంబరు 22: విశాఖ నగరంలో మరో స్కూల్ ఆటో ప్రమాదానికి గురైంది. జీవీఎంసీ ఏడో వార్డు పరిధిలోని నగరంపాలెం రోడ్డులో బుధవారం ఉదయం పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. నగరంపాలేనికి చెందిన ఏడుగురు విద్యార్థులు మధురవాడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. వారు బుధవారం ఆటోలో పాఠశాలకు బయుల్దేరారు. నగరంపాలెం వద్దకు చేరుకునేసరికి పంది అడ్డుగా రావడంతో ఆటో డ్రైవర్ సడర్ బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలకు, ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని మధురవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2023-11-23T02:30:22+05:30 IST