Model schools : మో‘డల్’ స్కూళ్లు!
ABN, First Publish Date - 2023-05-02T02:35:28+05:30
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఆందోళనకరంగా మారాయి. ప్రతిష్ఠాత్మకం, అద్భుతం అంటూ సర్కారు పెద్దలు కొనియాడిన
ఇంటర్ ఫస్టియర్‌లో 40% దాటని ఉత్తీర్ణత
111 మందికి గాను పాస్ అయింది ఏడుగురే
మరో స్కూల్‌లో 129మందికి 18మందే పాస్
ఫెయిల్యూర్‌కు మోడల్‌గా మారిన స్కూళ్లు
తాజా గణాంకాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన
వచ్చే ఏడు పిల్లలను కాలేజీ మార్చే యోచన
హైస్కూల్ ప్లస్‌ల్లోనూ దారుణంగా ఫలితాలు
9 చోట్ల రెండంకెలకూ చేరని ఉత్తీర్ణుల సంఖ్య
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఆందోళనకరంగా మారాయి. ప్రతిష్ఠాత్మకం, అద్భుతం అంటూ సర్కారు పెద్దలు కొనియాడిన మోడల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్‌లలో ఫలితాలు దారుణంగా వచ్చాయి. అసలు ఇక్కడ ఎందుకు పిల్లల్ని చదివించాం అని తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి నెలకొంది. అధ్యాపకుల కొరత, బోధనలో లోపాలు, వసతుల లేమి, సకాలంలో పుస్తకాలు ఇవ్వకపోవడం లాంటి అనేక కారణాలతో ప్రభుత్వాన్ని నమ్ముకుని ఇంటర్ చదివిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు చాలావరకు ప్రైవేటు కాలేజీలు 90శాతానికి పైగా ఉత్తీర్ణత సాధిస్తే, ప్రభుత్వ విద్యాసంస్థలు 50శాతం సాధించడానికే నానాపాట్లు పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయంటూ విద్యాశాఖ మంత్రి ప్రకటించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
మోడల్ స్కూళ్ల ఫలితాలు ఇలా...
ద్వితీయ సంవత్సరం కొంత ఫరవాలేదనిపించినా ప్రథమ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో మోడల్ స్కూళ్లు బాగా వెనుకబడిపోయాయి. ఈ సంవత్సరం ఫస్టియర్ రాష్ట్ర సగటు 61శాతం. కాగా వీటిలో సుమారు 40శాతమే నమోదైంది. అందులోనూ కొన్నిచోట్ల ఫలితాలు మరీ తక్కువగా వచ్చాయి. అనంతపురం జిల్లాలో 1,268 మంది విద్యార్థులు మోడల్ స్కూళ్లలో చదివితే 494 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అక్కడ ఉత్తీర్ణత శాతం కేవలం 38.96. మరో కాలేజీలో 27 మంది చదివితే 25మంది ఫెయిల్ అ య్యారు. ఇంకో పాఠశాలలో 9 మంది చదివితే ఒక్కరే పాస్ అయ్యారు. మొత్తం 25 మోడల్ స్కూళ్లలో 9చోట్ల పాస్ అయిన విద్యార్థుల సంఖ్య రెండంకెలకు చేరలేదు. విశాఖపట్నంలో ఓ మోస్తరు ఫలితాలు వచ్చా యి. 420 మంది పరీక్షలు రాస్తే 243 మంది ఉత్తీర్ణులయ్యారు. చిత్తూరు జిల్లాలో 1,308 మంది మోడల్ స్కూళ్లలో చదివితే 525 మంది మాత్రమే ఉతీర్ణత సాధించారు. ఈ జిల్లాలో 44మంది చదివిన ఓ స్కూ ల్‌లో 10 మంది, 91 మంది చదివినచోట 20 మంది, 45మంది ఉన్నచోట 11 మంది పాస్ అయ్యారు.
హైస్కూల్ ప్లస్‌లలో అధ్వాన్నం
లెక్చరర్లు, వసతులు లేకుండా హడావిడిగా ప్రారంభించిన హైస్కూల్ ప్లస్‌లలో ఫలితాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 18.15శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 244 మంది చదివితే 11 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం కేవలం 4.51శాతం. తొమ్మిది చోట్ల హైస్కూల్ ప్లస్‌లు ప్రారంభించగా ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో ఎక్కడా రెండంకెల సంఖ్య కనిపించలేదు. ఓ పాఠశాలలో 21 మంది చదివితే అందరూ ఫెయిల్ అయ్యారు. 19మంది చదివిన చోట ఇద్దరు, 12 మంది చదివిన పాఠశాలలో ఒకరు, 13 మందిలో ఒకరు, 32 మందిలో ఇద్దరు, 21 మందిలో ఒకరు, 24 మందిలో ఒకరు, 26 మందిలో ఒకరు, 76 మందిలో ఇద్దరు చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన వారిలో కూడా చాలామంది తక్కువ సబ్జెక్టుల్లోనే పాస్ అయ్యారు.
ఇందుకేనా ప్రారంభించింది
గ్రామీణ ప్రాంతాల్లో బాలికల చదువును ప్రోత్సహించే సదుద్దేశంతో 2013లో మోడల్ స్కూళ్లు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 154 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నా వసతుల లేమితో బోధన సరిగా సాగడం లేదు. వైసీపీ ప్రభుత్వం వీటిని ఇంకా నిర్లక్ష్యం చేస్తోంది. ఉన్నవాటిలో బోధనను, మౌలిక వసతులను మెరుగుపరచకుండా కొత్త కాలేజీల ఏర్పాటుకు హడావిడి చేస్తోంది. దీంతో మోడల్ స్కూళ్లు ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలవకపోగా, ఫెయిల్యూర్‌కు మోడల్‌గా మారాయి. ఇక కొత్తగా ప్రారంభించిన కేజీబీవీల్లోనూ అనేక చోట్ల సున్నా శాతం ఫలితాలు నమోదవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది పిల్లలను ప్రైవేటులో కాకపోయినా సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేర్పించాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైస్కూల్ ప్లస్‌లు పేరెత్తితేనే తల్లిదండ్రులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు.
మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలతో విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు కనిపించాయి. ఒకచోట 111 మంది ఫస్టియర్ చదివితే కేవలం ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. మరోచోట 26 మందిలో ముగ్గురే గట్టెక్కారు. ఇంకో మోడల్ స్కూల్‌లో 129 మంది విద్యార్థుల్లో 18 మంది పాస్ అయ్యారు. ఈ గణాంకాలు చూసిన తర్వాత వచ్చే ఏడాది తమ పిల్లల్ని ఏం చేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. మొదటి సంవత్సరమే మంచి కాలేజీలో చేర్పించి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కనీస వసతులు, లెక్చరర్లు లేకుండా హడావుడిగా ప్రారంభించిన హైస్కూల్ ప్లస్ ప్రయోగం కూడా వికటించింది.
Updated Date - 2023-05-02T02:35:28+05:30 IST