Viveka Case : సస్పెన్స్‌కు తెర.. సీబీఐ విచారణకు బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
ABN, First Publish Date - 2023-03-10T10:38:24+05:30
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి బయలుదేరారు. నిన్న ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సందేహం తలెత్తింది.
హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి బయలుదేరారు. నిన్న ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సందేహం తలెత్తింది. అప్పటి నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు బయలుదేరారు. నేటి ఉదయం 11 గంటలకు సీబీఐ విచారణ ప్రారంభం కానుంది.
వివేక హత్య కేసులో మూడోసారి సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతున్నారు. ఇప్పటికే జనవరి 28 , ఫిబ్రవరి 24 తేదీల్లో రెండుసార్లు విచారణ చేసి సీబీఐ ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. తన విచారణ పై స్టే ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేయనుంది. తన విచారణ సమయంలో ఆడియో, వీడియోగ్రఫీ రికార్డ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపేలా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి కోరారు. గత విచారణలో భాగంగా రెండు సార్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను లెక్కలోకి తీసుకోకుండా చూడాలని రిట్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి కోరారు. స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత తనకు చూపించకుండానే సీబీఐ క్లోజ్ చేసిందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-03-10T10:53:15+05:30 IST