YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాశ్ తండ్రి బెయిల్‌పై వీడిన ఉత్కంఠ..
ABN, First Publish Date - 2023-06-09T17:28:55+05:30
వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను (Bhaskar Reddy Bail Petition) సీబీఐ కోర్టు కొట్టివేసింది. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే జరిగే పరిణామాలను కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది స్పష్టంగా వివరించారు. సీబీఐ, సునీత వాదనల్లో మెరిట్స్ ఉండడంతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి నిందితుడేనని సీబీఐ తొలిసారి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ-7గా ఉన్న భాస్కర్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో ఈ విషయం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆయన్ను సహనిందితుడిగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ.. ఈ కౌంటర్‌లో మాత్రం ఏ-8గా పేర్కొంది. సాంకేతికంగా ఆయన్ను అరెస్టు చేసిన తర్వాతే ఏ-8గా చూపినట్లు సమాచారం.
మరోవైపు.. భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. దానిని కొట్టేయాలని కోర్టును అభ్యర్థించింది. వివేకా హత్యకు సంబంధించిన కుట్ర, ఆధారాల చెరిపివేతలో తండ్రీకొడుకులు కీలక పాత్ర పోషించారని అఫిడవిట్‌లో తెలిపింది. ‘భాస్కర్‌రెడ్డి అరెస్టయినప్పుడు ఆయన అనుచరులు చేసిన ధర్నాలు, నిరసన కార్యక్రమాలను బట్టి.. వారు ఎంత బలవంతులో, సాక్షులను ఎలా భయభ్రాంతులకు గురిచేయగలరో అర్థం చేసుకోవచ్చు. విస్తృత కుట్ర, ఆధారాల చెరిపివేత వంటి అంశాలపై కీలక దర్యాప్తు జరుగుతున్న ప్రస్తుత దశలో ఆయనకు బెయిల్ ఇస్తే ప్రాసిక్యూషన్ కేసు దెబ్బతింటుంది. బెయిల్ దశలోనే సాక్ష్యాధారాలను లోతుగా పరిశీలించరాదు. అలా చేస్తే దర్యాప్తులో ఇబ్బందులు తలెత్తుతాయి’ అని సీబీఐ స్పష్టం చేసింది. శుక్రవారం రోజు సీబీఐ, సునీత తరపు వాదనలు విన్న న్యాయస్థానం భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
Updated Date - 2023-06-09T17:28:58+05:30 IST