Nara Lokesh : అందరినీ ముంచిన జగన్
ABN, Publish Date - Dec 15 , 2023 | 03:05 AM
రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ జగన్ కోలుకోలేని దెబ్బ కొట్టారని, వారిలో మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగులేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగులే
వారికిచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు
మెగా డీఎస్సీ అని నిరుద్యోగులకు మోసం
అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణ మద్దతు
వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తాం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హామీ
రైతులు, యువతీ యువకులతో ముఖాముఖి
222వ రోజు కొనసాగిన యువగళం యాత్ర
అనకాపల్లి, ఎలమంచిలి, రాంబిల్లి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ జగన్ కోలుకోలేని దెబ్బ కొట్టారని, వారిలో మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగులేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర 222వ రోజు గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం లైన్ కొత్తూరు నుంచి ప్రారంభమై సోమన్నపాలెం, ఎర్రవరం, ఎలమంచిలి, కట్టుపాలెం, రాంబిల్లి మండలం నారాయణపురం, మామిడివాడ మీదుగా కొత్తూరు పంచదార్ల వరకూ సాగింది. దారి పొడవునా ఉద్యోగులు, రైతులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు యువనేతను కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి సమీపంలోని రామాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగులతో లోకేశ్ ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ జగన్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్లు సమావేశాలు నిర్వహించుకునేందుకు భవనాలు ఏర్పాటు చేస్తామని, వివిధ రాష్ట్రాల్లో హెల్త్ స్కీమ్‌లను అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగులకు కోలుకోలేని దెబ్బ
అసత్య వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ నిరుద్యోగులను కోలుకోలేని దెబ్బకొట్టారని లోకేశ్ మండిపడ్డారు. ఎలమంచిలి మండలం ఎర్రవరంలో యువతీ యువకులతో ఆయన సమావేశమయ్యారు. గ్రూప్-1, 2 ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని సీఎంకు లేఖ రాసినట్టు తెలిపారు. ఏటా జాబ్ కేలెండర్ విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని నిరుద్యోగులను జగన్ మోసం చేశారని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులు ప్రవేశపెడతామన్నారు. విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను తిరిగి ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. రాంబిల్లి మండలం నారాయణపురం వద్ద పలువురు రైతులు లోకేశ్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. తుఫాన్‌వల్ల తీవ్రంగా నష్టపోయామని, ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారం అందేలా చూడాలని కోరా రు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ప్రభుత్వమే బీమా చెల్లిస్తుందని చెప్పి రైతులను జగన్ నట్టేటముంచాడన్నారు. గతేడాది ప్రభుత్వం పంటల బీమా చెల్లించింది కేవలం 16మంది రైతులకేనని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసేందుకు కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు.
అంగన్‌వాడీలు రోడ్డెక్కే పరిస్థితి ఉండదు
ఎలమంచిలి మండలం లైన్ కొత్తూరులో లోకేశ్‌ను అంగన్‌వాడీ కార్యకర్తలు కలసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు జగన్‌రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజా ప్రభుత్వంలో అంగన్‌వాడీలు రోడ్డెక్కే పరిస్థితులు రాకుండా చూస్తామన్నారు. న్యాయబద్ధమైన తమ సమస్యలపై పోరాటం సాగిస్తున్న అంగన్‌వాడీలను వేధించడం దారుణమన్నారు. అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ-జనసేన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామని పేర్కొన్నారు. అంగన్‌వాడీ యూనియన్లతో చర్చించి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీలు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని లోకేశ్ తెలిపారు. పాదయాత్రలో మాజీ మంత్రి నారాయణ, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగజగదీశ్వరరావు, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్, ఎలమంచిలి నియోజవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జి సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు.
ఇది ఉల్లిగడ్డనా?
కూరగాయల వ్యాపారితో లోకేశ్ సరదా సంభాషణ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురువారం అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో పాదయాత్ర చేస్తూ ఒక కూరగాయల దుకాణం వద్ద ఆగారు. వ్యాపారిని ధరలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బంగాళాదుంపను చూపించి...ఇది ఉల్లిగడ్డనా అని అడిగారు. ‘కాదండి...అది బంగాళాదుంప’ అని దుకాణదారుడు బదులిచ్చారు. మరి సీఎం జగన్ ఉల్లిగడ్డ అంటున్నారు కదా...అని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సంభాషణ విని అంతా నవ్వుకున్నారు.
Updated Date - Dec 15 , 2023 | 03:05 AM