Nara Lokesh : యువగళం.. ప్రజాగళమై..
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:46 AM
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.
నేటితో ముగియనున్న పాదయాత్ర
226 రోజులు 3,132 కి.మీ. కాలినడక
70 సభలు, 155 ముఖాముఖి భేటీలు
12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు
ప్రజల నుంచి 4,353 వినతిపత్రాలు
5 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం
యాత్రలో కోటిన్నర మందితో మమేకం
అరాచక పాలనపై సమరశంఖం
అడ్డంకులు ఎదురైనా అధిగమించి..
కేసులు, కవ్వింపులను తోసిరాజని..!
తాజా రాజకీయ పరిణామాలతో
ముందుగానే పూర్తిచేస్తున్న లోకేశ్
అగనంపూడి వద్ద యాత్ర పరిసమాప్తం
భూములు కొట్టేయడానికే జలగన్న భూభక్ష!
జగన్ విధానాలతో యువత భవిత బుగ్గి
ఉద్యోగం వచ్చే వరకూ నెలకు 3,000 భృతి
రూ.2,500 కోట్ల అభయహస్తం: లోకేశ్
విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది. ప్రజాగళమై సాగిన ఈ యాత్ర.. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీవరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభమై.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే ధ్యేయంగా ముందుకు సాగింది. లోకేశ్ 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 232 మండలాలు/ మునిసిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా యాత్ర సాగించారు. ఉద్యోగాల్లేక నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు.. ఇంటి నుంచి బయటకు వెళితే క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారెంటీ లేక భయాందోళనలతో బతుకుతున్న మహిళలు మరోవైపు.. అడ్డగోలు ధరల బాదుడుతో బతుకు భారంగా మారిన జనసామాన్యం ఇంకోవైపు.. ఇలా అడుగడుగునా అభద్రతాభావం, నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తానున్నానన్న ధైర్యం ఇచ్చారు. మొత్తంగా ఈ కాలంలో 70 బహిరంగసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, ఎనిమిది రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందుకున్నారు. వివిధ సామాజికవర్గాలు, వృత్తులవారు నేరుగా లోకేశ్‌ను కలుసుకుని కష్టాలు చెప్పుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలతో ఆయన మమేకమయ్యారు.
అడ్డంకులను అధిగమించి...
పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రభుత్వ పెద్దలు యువగళం గొంతు నొక్కేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించినప్పటికీ లోకేశ్ వెరవక ముందుకుసాగిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. చిత్తూరు జిల్లాలో ఆయన ప్రచార వాహనాన్ని, మైకు సెట్లు, చివరకు స్టూలును కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో ముష్కర మూకలు, పోలీసులు కలిసి..పసుపు సైనికులను రెచ్చగొట్టి, తిరిగి వారిపైనే తప్పుడు కేసులు బనాయించినప్పటికీ లోకేశ్ వెనుకడుగు వేయకుండా ముందుకుసాగడం టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపింది. 40 మంది యువగళం వలంటీర్లపై నాన్ బెయిల్‌బుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపించినా.. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్న వారితో సహా 46 మంది కీలక నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసినా లోకేశ్ ఇసుమంతైనా బెదరకుండా సాగుతూ కేడర్‌కు భరోసాను కల్పించారు. పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో అధికార పార్టీలో ప్రకంపనలు రేగాయి.
రాయలసీమలో యువగళం రికార్డు..
గతంలో ఏ పార్టీ నాయకుడూ చేయని విధంగా రాయలసీమలోనే లోకేశ్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఏకంగా 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కిలోమీటర్లు నడిచారు. రాయలసీమ వాసులు బ్రహ్మరథం పట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాగిన పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజులపాటు సాగిన యాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 11 రోజులపాటు 225.5 కిలోమీటర్లు సాగగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 12 రోజుల పాటు 178.5 కిలోమీటర్లు సాగింది. ఉత్తరాంధ్రలోనూ పాదయాత్రకు ఊహించని స్పందన లభించింది. నిజాన్ని ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నిర్వహించి, అక్కడ ముగింపు సభ ఏర్పాటుచేయాలని భావించినప్పటికీ.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అగనంపూడి వద్దే ముగిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు రోజులపాటు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
పదునైన ప్రసంగాలతో..
పాదయాత్రలో లోకేశ్ పదునైన ప్రసంగాలతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ఇప్పటివరకు 97 నియోజకవర్గాల్లో 70 బహిరంగ సభల్లో ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్ పాలనా వైఫల్యాలను, దోపిడీ విధానాలను ఎండగట్టారు. ప్రతి సభలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో బట్టబయలు చేస్తూ అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టించారు. సెల్ఫీ చాలెంజ్ పేరుతో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి విజయగాధలు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించడం.. అదే సమయంలో టీడీపీ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. వినూత్న రీతిలో కేడర్‌కు, ప్రజలకు దగ్గరయ్యేందుకు చేపట్టిన ‘సెల్ఫీ విత్ లోకేశ్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో 3.5 లక్షల మందికిపైగా అభిమానులతో లోకేశ్ సెల్ఫీలు, ఫొటోలు దిగారు. యువ నేతతో సెల్ఫీలు, ఫొటోలు దిగిన వారికి వాటిని స్కానింగ్ చేయించి, ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేలా ఏర్పాటుచేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేశారు. పాదయాత్ర వెంబడి తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగానికి లోకేశ్ 600కు పైగా లేఖలు రాశారు. పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తయిన ప్రతిచోటా ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
పాదయాత్రలో ముఖ్యాంశాలు
226 రోజులు.. 3,132 కిలోమీటర్లు నడక
రాయలసీమలో 124 రోజులు.. 44 నియోకజవర్గాల పరిధిలో యాత్ర
మొత్తంగా 11 ఉమ్మడి జిల్లాలు.. 97 అసెంబ్లీ నియోజకవర్గాలు
70 బహిరంగ సభలు.. 155 ముఖాముఖి భేటీలు
12 ప్రత్యేక కార్యక్రమాలు.. ఎనిమిది రచ్చబండలు
4,353 మంది నుంచి వినతిపత్రాలు.
2,500 మందితో సెల్ఫీలు
సమస్యల పరిష్కారానికి అధికారులకు 600కుపైగా లేఖలు
పదుల సంఖ్యలో బాధితులకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం.. పలువురు చిన్నారుల చదువు బాఽధ్యతలు స్వీకరణ..
అవసరమైన వారికి వాహనాలు, పరికరాల పంపిణీ. కీలకంగా వ్యవహరించిన కమిటీలు
పాదయాత్ర విజయవంతానికి 14 కమిటీలు ఏర్పాటుచేయగా.. వాటి సభ్యులు అనునిత్యం లోకేశ్ వెన్నంటే ఉంటూ యాత్ర విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించారు. యువగళం ప్రధాన కో-ఆర్డినేటర్ కిలారి రాజేశ్‌పై సీఐడీ పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేసినా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేయడంలో సఫలీకృతమయ్యారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్ ఇచ్చిన అనేక హామీలు ఆయా వర్గాలకు భరోసాను కల్పించాయి. కులాలు, కార్పొరేషన్లు వారీగా ప్రజల ఆర్థిక, సామాజిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఆయా వర్గాలు టీడీపీ వైపు మొగ్గేలా చేసింది.
నాడు తండ్రి, నేడు తనయుడు...
గాజువాక ప్రాంతంలోనే పాదయాత్ర ముగింపు
గత పైలాన్ పక్కనే కొత్త పైలాన్
గాజువాక, డిసెంబరు 17: తండ్రీకొడుకులు ఒకే ప్రాంతంలో పాదయాత్రను ముగించడం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా..మీకోసం’ పేరిట హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 208 రోజులపాటు 2,817 కిలోమీటర్లు నడిచారు. 2013 ఏప్రిల్ 27న గాజువాక ప్రాంతంలో యాత్రను ముగించారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఏమేం చేయదలచిందీ వివరించారు. దీని ఫలితంగానే 2014లో అధికార పగ్గాలను దక్కించుకున్నారన్నది టీడీపీ శ్రేణుల ప్రగాఢ నమ్మకం. బాబు పాదయాత్ర మగింపునకు గుర్తుగా విశాఖ నగర శివారునన్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్‌గేట్ సమీపాన శివాజీనగర్ ప్రాంతంలో భారీ పైలాన్‌ను నిర్మించారు. ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యువగళం పేరుతో ఆయన తనయుడు లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర సోమవారం అదే అగనంపూడి టోల్‌గేటు సమీపాన ముగియనుంది. శివాజీనగర్ వద్ద నిర్మించిన పైలాన్ పక్కనే మరో పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 02:46 AM