ప్రభుత్వ భూమి కబ్జా!
ABN, First Publish Date - 2023-03-16T23:15:19+05:30
మండలంలోని కొత్త కంబాలపల్లిలో ప్రభుత్వానికి చెందిన డొంక పోరంబోకు భూమిని అధికార పార్టీ నాయకుల అండతో కొందరు కబ్జా చేసి సాగు చేస్తున్నారు.

పొదలకూరు, మార్చి 16 : మండలంలోని కొత్త కంబాలపల్లిలో ప్రభుత్వానికి చెందిన డొంక పోరంబోకు భూమిని అధికార పార్టీ నాయకుల అండతో కొందరు కబ్జా చేసి సాగు చేస్తున్నారు. ఇటీవల చదును చేసి కంచె కూడా వేశారు. సర్వే నెం.93లో 9.56 ఎకరాలు, మరో సర్వే నెం.91లో 420 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెం.93లో ఉన్న భూమిలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు 5 ఎరకాల వరకు ఆక్రమించి సాగు చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే సర్వే నెం.91లో గతంలో 2008లో కొంతమంది దరఖాస్తుదారు పట్టాలు పొందారు. వీరుగాక మిగిలిన వారు కూడా అనధికారికంగా ఒకరిని చూసి మరొకరు సుమారు 50 ఎకరాలు మేర ఆక్రమించి కంచె వేసుకున్నారు. సుమారు 300 ఇళ్లు ఉండే కొత్త కంబాలపల్లి పునరావాసంలో పశువులు, జీవాలు మేత మేయడానికి పోరంబోకు భూములు లేకుండా చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల చుట్టుపక్కల జీవాలు తిరిగేందుకు కూడా వీల్లేకుండా స్థలాలను కబ్జా చేస్తున్నారని అధికార పార్టీ నాయకులపై కొందరు పెదవిరుస్తున్నారు. కొత్త కంబాలపల్లి పునరావాస కేంద్రం 1995లో ఏర్పడింది. అప్పుడు 55 ఎకరాలు ఈ గ్రామానికి కేటాయించారు. 33 ఎకరాల్లో 200 ప్లాట్లు వేశారు. మిగిలిన 20 ఎకరాలు పోరంబోకు భూమిగా, (ప్రభుత్వ భూమిగా) ఉంది. అయితే ఈ 22 ఎకరాలు ప్రస్తుతం గ్రామంలోని వివిధ వర్గాల వారు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు పరిశీలించి, కబ్జారాయుళ్ల చెర నుంచి పోరంబోకు భూములకు విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు.
==================
Updated Date - 2023-03-16T23:15:19+05:30 IST