మొరాయించిన పథకాలు
ABN, First Publish Date - 2023-05-03T21:45:46+05:30
ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు మొరాయించిన తాగునీటి పఽథకాలతో పల్లెవాసులు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు ఫ్లోరిన్ నీటితో అల్లాడుతుండగా, గత టీడీ
మంచినీటికి కటకట !
పల్లెల్లో తప్పని తాగునీటి తిప్పలు
చోద్యం చూస్తున్న అధికారులు
వరికుంటపాడు, మే 3: ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు మొరాయించిన తాగునీటి పఽథకాలతో పల్లెవాసులు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు ఫ్లోరిన్ నీటితో అల్లాడుతుండగా, గత టీడీపీ ప్రభుత్వం శుద్ధి నీటిని అందించేందుకు తీసుకొచ్చిన పఽథకాలు అందని ద్రాక్షాలా మారాయి. రక్షిత తాగునీటిని అందించే సంగతి అటుంచితే, పనులు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎనభైశాతం వరకు పూర్తయిన పఽథకాలను అందుబాటులోకి తీసుకురాకపోవడం ఒక ఎత్తయితే మరమ్మతులకు గురైన పథకాలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
ఆగిన పనులు
గత టీడీపీ ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు తాగునీరు అందించేందుకు గాను రూ. 15 కోట్లను మంజూరు చేసింది. 2019మార్చి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా, కొంతకాలం జోరుగా సాగిన పనులు ఎన్నికల పుణ్యమాని నిలిచిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైపీసీ ఆ పఽథకానికి వైఎస్‌ఆర్ సుజల స్రవంతిగా పేరు మార్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రతి మండల కేంద్రంలో సుమారు రూ. 3 కోట్లతో నిర్మించిన మదర్‌ప్లాంట్ల ద్వారా శుద్ధిచేసిన తాగునీటిని ప్రత్యేక ట్యాంకర్లతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంకులకు తరలిస్తారు. అక్కడి నుంచి స్మార్టు కార్డులు పొందిన వినియోగదారులు 20లీటర్ల నీటిని రూ. 2కు కొనుగోలు చేస్తారు. కాగా పలుచోట్ల మదర్‌ప్లాంట్లు పనిచే యడంలేదు. దీంతో గ్రామీణులు ఇక్కట్లు పడుతున్నారు.
మరమ్మతులు చేపట్టేనా..?
గ్రామాల్లోని తాగునీటి పఽథకాలు, వనరులు మరమ్మతులకు గురయ్యాయి. ఒకవైపు ముందుకు సాగని పఽథకాల పనులు, మరోవైపు మరమ్మతులకు నోచుకోని వనరులతో గుక్కెడు నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మండలంలోని తూర్పురొంపిదొడ్ల, కృష్ణంరాజుపల్లి గ్రామాల్లో రూ. 7.10 లక్షలతో ఏర్పాటు చేసిన తాగునీటి పఽథకాలు మరమ్మతులకు గురైనా పట్టించుకోలేదు. అలాగే కొండ్రాజుపల్లి, తూర్పుబోయమ డగల బస్టాండ్ సెంటర్‌తోపాటు పలు గ్రామాల్లోని చేతిపంపులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తాగునీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.
---------------
Updated Date - 2023-05-03T21:45:46+05:30 IST