ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హర హర మహాదేవ

ABN, First Publish Date - 2023-02-19T02:26:32+05:30

ప్రసిద్ధ శైవక్షేత్రం త్రిపురాంతకేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం భక్తులు భారీ స్థాయిలో పాల్గొని పూజలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

త్రిపురాంతకం, ఫిబ్రవరి 18: ప్రసిద్ధ శైవక్షేత్రం త్రిపురాంతకేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం భక్తులు భారీ స్థాయిలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. ఉదయం 3 గంటల నుంచే ఆలయాలకు విచ్చేసిన భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు శివన్నామస్మరణలతో మారుమోగాయి. ఉత్సవాల సందర్భంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్దిశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర ఆర్‌టీఐ కమిషనర్‌ కాకర్ల చంద్రశేఖరరెడ్డి, మార్కాపురం, కందుకూరు సబ్‌ కలెక్టర్లు సేతుమాధవన్‌, శోభిక, వై.పాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఎరిక్షన్‌బాబు స్వామివారి ఆలయం వద్దకు రాగా వీఐపీ ప్రవేశ ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న మర్రిపూడి ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించి లోపలకు అనుమతించలేదు. దీంతో అక్కడ ఉన్న నాయకులు అసహనం వ్యక్తం చేశారు. సుమారు 20 నిమిషాలపాటు ఎరిక్షన్‌బాబు అక్కడే నిలబడ్డాడు. దీంతో నాయకులు స్థానిక సీఐ రాంబాబుకు సమాచారం ఇచ్చారు. విధుల్లో ఉన్న ఎస్సైతో మాట్లాడి.. ఎరిక్షన్‌బాబును దర్శనానికి అనుమతించారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి, అమ్మవారి ఆలయాల్లో క్యూలైన్లు కిటకిటలాడాయి. దర్శనానికి సుమారు 3 గంటలపైనే సమయం పట్టింది. అధికారం, పలుకుబడి ఉన్నవాళ్ళకే శీఘ్ర దర్శనానికి అనుమతిస్తున్నారన్న విమర్శలు తలెత్తాయి. ఎండలో క్యూలైనులో ఎక్కువసేపు నిలబడడంతో వై.పాలేనికి చెందిన ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో వైద్యులు చికిత్స అందించారు. స్థానిక స్టేట్‌ బ్యాంకు మేనేజరు వై.శివరామకృష్ణ, అసిస్టెంట్‌ మేనేజరు వి.శ్రీనుబాబు ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, మజ్జిగ ఉచితంగా అందజేశారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులకు అన్ని సామాజిక సత్రాలలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

గిద్దలూరు టౌన్‌ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గిద్దలూరు ప్రాంతంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం తెల్లవారుజాము నుంచే ఆయా దేవాలయాల వద్ద భక్తులు బారులుతీరి కనిపించారు. మహాశివునికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రసిద్ధ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దుర్గాకుమారి దంపతులు, కుమారుడు కృష్ణచైతన్య స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాంబాబు దంపతులకు, కుటుంబసభ్యులకు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పన, ఆమె తనయుడు పిడతల అభిషేక్‌రెడ్డి కూడా పాతాళ నాగేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. కే.ఎస్‌.పల్లె సమీపంలోని భీమలింగేశ్వరస్వామి దేవాలయం, పాపులవీడులోని శివాలయం, సంజీవరాయునిపేట సమీపంలో బోధీశ్వరాలయం, పొదలకొండపల్లె సమీపంలోని శివాలయం, ముండ్లపాడులోని శివాలయాలలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఆయా దేవాలయాల వద్ద ప్రత్యేకంగా విద్యుత్‌ దీపాలు, పూలమాలలతో దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు

కంభం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం కంభం, అర్థవీడు మండలాల్లోని శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. వేకువజాము నుంచే శైవక్షేత్రాలు ఓంకారనాదంతో మారుమోగాయి. చిన్నకంభంలోని వీరభద్రస్వామి ఆలయం, తురిమెళ్లలోని కనక సురభేశ్వరకోన, యల్లమ్మదేవి ఆలయం, రావిపాడులోని భీమేశ్వరాలయం, కంభంలోని కోటేశ్వరాలయం, అర్థవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం శివపార్వతుల దేవాలయాలలో భక్తులు బారులు తీరారు. కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులకు కంభం ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో బహుజన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో దాసరి యోబు, ఏసపోగు రమేష్‌, షేక్‌ ముజీద్‌, నాగరాజు, రమేష్‌, అరుణ్‌కుమార్‌, రాజాసురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాచర్ల : మండలంలోని రామాపురం సమీపంలోని సిద్దిభైరవేశ్వర ఆలయానికి, అక్కపల్లె సమీపంలోని సురభేశ్వరకోన శివాలయానికి, సత్యవోలు సమీపంలోని పురాతనమైన రామలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివలింగాలకు పాలాభిషేకాలు పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. సిద్ధిభైరవేశ్వర ఆలయ సమీపంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఆకవీడు ప్రభుత్వ వైద్యసిబ్బంది సురభేశ్వరకోనలో వైద్యశిబిరం నిర్వహించారు.

తర్లుపాడు : మండలంలోని కేతగుడిపిలోని కేదా రేశ్వరస్వామి ఆలయం, తర్లుపాడులోని నీలకంఠే శ్వరస్వామి ఆలయం, సహస్త్ర లింగేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా విశేష పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. కేతగుడిపిలోని ఆలయ కమిటీ సభ్యులు సిరసనగండ్ల సుబ్రహ్మణ్యం, గంగిశెట్టి మల్లికార్జున, ఆమంచి పిచ్చయ్యశాస్త్రి, ఉప్పల ప్రసాద్‌ శాస్త్రీ, ఆర్‌.రాఘవశర్మలు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. కేదరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కేతగుడిపిలోని కేదరేశ్వరస్వామిని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జంకె వెంకటరెడ్డి, మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మార్కాపురం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వి.రాధికామల్లికార్జున్‌, ఎంపీపీ ఎస్‌.భూలక్ష్మీ, జడ్పీటీసీ సభ్యుడు వెన్నా ఇందిరా, సర్పంచ్‌ దూదేకుల పెద్దమస్తాన్‌ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తర్లుపాడులోని నీలకంఠేశ్వరస్వామి, సహస్త్రలింగేశ్వరస్వామి ఆలయంలో ధర్మకర్త నేరెళ్ల పవన్‌కుమార్‌, నేరెళ్ల సాంబశివరావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గం.లకు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త పవన్‌ కుమార్‌ తెలిపారు.

పుల్లలచెరువు : మండలంలోని పలు శివాలయాలు వేకువజాము నుంచే శివనామస్మరణతో మారు మ్రోగాయి. మండలంలోని చాపలమడుగులో స్వామివారికి విశేష పూజలు చేశారు.

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెంలోని కాశీవిశేశ్వర స్వామి శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ శైవక్షేత్రాలకు తరలివెళ్లారు.

పెదదోర్నాల : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో వేడుకలను జరుపుకున్నారు. శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ప్రధానంగా మోట్ల మల్లికార్జునస్వామి దేవాలయం వద్ద, తిమ్మాపురం రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద, రామచంద్రకోట శివాలయంలో, యడవల్లి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. దోర్నాలలోని శ్రీలక్ష్మీ నరసింహా స్వామి దేవాలయంలో, అయ్యప్పస్వామి దేవాలయం, తదితర దేవాలయాల్లో ఆలయ అర్చకులు గణపతి హోమం, చండీహోమం నిర్వహించి పార్వతీ పరమేశ్వరులకు కల్యాణం జరిపించారు. శ్రీ భ్రమరాంభికాదేవి మల్లికార్జునులు కొలువైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భారీ సంఖ్యల్లో భక్తులు తరలివెళ్లారు. పలు స్వచ్చంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : మహాశివరాత్రి పర్వది నాన్ని మార్కాపురం పట్టణంలో మండలంలో శని వారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సమేత మార్కండేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ఆంజనేయశర్మ, వరుణ్‌తేజ శర్మలు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాత్రి ఎదుర్కోల, నగరోత్సవం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బాలమురళీకృష్ణ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారిజాము 3గంటల నుంచే బారులు తీరారు. తిప్పాయపాలెం మునీశ్వర ఆలయంలో శివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పొదిలి రూరల్‌ : దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ పార్వతీ సమేత నిర్మామహేశ్వర స్వామి, పంచకోవెల సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేకువ నుంచే బారులు తీరారు. స్వామివారు గత 14 రోజులుగా వివిద అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రహ్మకుమారీస్‌ శాంతి యాత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివలింగాల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దాతలు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-02-19T02:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising