ఆకలి కేకలు
ABN, First Publish Date - 2023-06-20T01:00:47+05:30
ఉపాధి హామీ పథకం కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కోట్లల్లో బకాయిలు పేరుకుపోతు న్నాయి.
ఉపాధి కూలీలకు నెలకుపైగా నిలిచిన చెల్లింపులు
జిల్లాలో రూ.100 కోట్లకు పైగానే పెండింగ్
మండుటెండల్లో పనిచేస్తున్నా అందని దుస్థితి
కేంద్రం తీరుపై కూలీల అసంతృప్తి
పొదిలి మండలంలో నెల రోజులుగా ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు వేతనాలు రావడం లేదు. దాదాపు రూ.1.90 కోట్లు పెండింగ్ ఉన్నట్లు అధికారిక సమాచారం. కూలి డబ్బుల విషయం అడిగితే అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. అలాగే కొండపి మండలంలోనూ నాలుగు వారాలుగా కూలి డబ్బులు అందడం లేదు.
పీసీపల్లి మండలంలో దాదాపు రూ.1.10కోట్లు, త్రిపురాంతకం మండలంలో ఆరు వారాల నుంచి దాదాపు రూ.4కోట్లు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు
ఇలాంటి పరిస్థితే జిల్లా అంతటా ఉంది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో పూట గడవని కూలీలు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నారు. పని ప్రదేశాల్లో నీడ కోసం టెంట్లు, దాహార్తిని తీర్చేందుకు మంచినీళ్లు, ఎండల తీవ్రత నుంచి రక్షణ కోసం మజ్జిగ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అయినా పనులకు కూలీలు వస్తుండగా వేతనాలు సకాలంలో అందకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు, జూన్ 19 (ఆంరఽధజ్యోతి): ఉపాధి హామీ పథకం కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కోట్లల్లో బకాయిలు పేరుకుపోతు న్నాయి. మండుటెండలో సైతం పనులు చేస్తున్నా వారాల తరబడి కూలి డబ్బులు అందకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.235 కోట్ల మేర కూలీలు చేసిన పనికి వేతన రూపంలో అందాల్సి ఉండగా దాదాపు రూ.100 కోట్లకుపైగానే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం రెండు వారాలకు ఒకసారి చేసిన పనికి కూలి డబ్బులను కూలీల ఖాతాల్లో జమచేయాలి. అలాంటిది జిల్లాలో నెలరోజులకుపైగా జమలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోని వారికి ఆరు వారాల నుంచి కూడా పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
ఆసరాగా నిలుస్తున్న పనులు
జిల్లాలో ఎండల తీవ్రతతోపాటు వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ పనులు అం తంతమాత్రంగానే ఉంటున్నాయి. అధిక విస్తీర్ణం వర్షాధార పంటలు కావడంతో పరిమిత కాలం మాత్రమే ఆ పనులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఎంతో కొంత ఆస రాగా ఉపాధి పనులు నిలుస్తున్నాయి. ప్ర త్యేకించి ఆర్థిక సంవత్సరం ప్రారంభయ్యే ఏప్రిల్ నుంచి జూలై వరకు వ్యవసాయా నికి అన్‌సీజన్ కాగా ఈ పనులు వారికి ఆదరువుగా ఉంటుంటాయి. అలా జిల్లాలో పెద్ద ఎత్తున కూలీలు పనులకు వస్తుంటారు. పథకం అమలులో పర్యవేక్షణాధికారులు సిబ్బంది, స్థానిక అధికార పార్టీ నేతల ప్రమేయం, అవకతవకలు, ఆరోపణలు ఉంటున్నప్పటికీ పనులకు వచ్చే కూలీలకు ఎంతో కొంతమేర ఉపాధి హామీ పథకం ఉపకరిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజువారీ కూలీ రూ.272గా ఉంది. అయితే జిల్లాలో సగటున రూ.226 వరకు లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1.67 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు 1.04 కోట్లు కల్పించినట్లు సమాచారం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 4.38 లక్షల జాబ్‌కార్డులు ఉండగా వారిలో 2.20 లక్షల కుటుంబాలకు చెందిన 4.36 లక్షల మంది కూలీలు పనులకు వస్తున్నారు. సగటున రోజుకు ఒక్కొక్కరికి రూ.226 వేతనం లభిస్తోంది. అలా ఇప్పటివరకు చేసిన పనిదినాలకు సంబంధించి సుమారు రూ.235 కోట్ల మేర కూలీలకు వేతన రూపంలో అందాల్సి ఉంది.
నిలిచిన చెల్లింపులు
ఉపాధి పనులు చేసిన వారికి సకాలంలో డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం రెండు వారాలకు ఒకసారి వేతనాలు ఇవ్వాలి. అయితే జిల్లాలో నెలరోజులకుపైగా చెల్లింపులు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఆరువారాల నుంచి కూడా రాలేదని సమాచారం. అలా దాదాపు రూ.100 కోట్లకుపైగానే వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కూలి మొత్తాన్ని నేరుగా కేంద్రప్రభుత్వమే కూలీల ఖాతాలకు జమ చేసే విధానం అమలులో ఉంది. దీంతో ఇక్కడి యంత్రాంగం పెండింగ్ వేతనాలపై తగు సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. బకాయిలు చెల్లించాలని కోరుతూ ఇప్పటికే కూలీలు ఆందోళనలకు దిగుతున్నారు. సీఎస్‌పురం, హనుమంతునిపాడు మండల కార్యాలయాల ఎదుట సోమవారం ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ పథకాన్ని పేదలకు దూరం చేస్తున్న కేంద్రం విధానాలను నిరసిస్తూ ఈనెల 24న ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేజీ మస్తాన్ తెలిపారు. వెంటనే కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-06-20T01:00:47+05:30 IST