లే‘అవుట్!’
ABN, First Publish Date - 2023-02-16T23:36:16+05:30
ప్రభుత్వం అందించే సహాయం చాలకపోవడం, మంజూరు చేసిన స్థలాలు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. సింగరాయకొండ మండలంలోని 10 గ్రామాల్లో 12 లేఅవుట్‌లలో 3,974 ప్లాట్లు వేశారు. వీటిని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తొలుత 2,766 మందికి గృహనిర్మాణశాఖ నుంచి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. వీరిలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడంతో సింహభాగం లబ్ధిదారులు నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పలు కారణాల వల్ల నిర్మాణాలకు ముందుకురాని 609 మంది లబ్ధిదారులకు మంజూరైన గృహ నిర్మాణ అనుమతులను రద్దు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపారు.
అధికారులు, వైసీపీ నేతల అనాలోచిత నిర్ణయం
నివాసయోగ్యం కానిచోట్ల ఇళ్ల పట్టాలు
నిర్మాణానికి ముందుకురాని లబ్ధిదారులు
ఖాళీగా దర్శనమిస్తున్న లేఅవుట్లు
ఊళ్లపాలెం లేఅవుట్ రద్దు
609 మందికి గృహనిర్మాణ అనుమతులు రద్దుచేస్తూ ప్రతిపాదనలు
గృహనిర్మాణశాఖ అధికారులు,స్థానిక వైసీపీ నేతల అనాలోచిత నిర్ణయాలు లబ్ధిదారులను అవస్థల పాల్జేస్తున్నాయి. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో లేఅవుట్‌లు వేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. సింగరాయకొండ మండలంలోని జగనన్న కాలనీలే అందుకు నిదర్శనం. పది గ్రామాలలో వేసిన 12 లేఅవుట్‌లలో సింహభాగం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సుదూరప్రాంతాలతో పాటు కనీసవసతులు లేని ముంపునకు గురయ్యే చోట్ల లేఅవుట్లు వేయడం వల్ల లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రూ.లక్షలు ఖర్చుచేసి వేసిన లేఅవుట్లతో పాటు అనుమతులు మంజూరు చేసిన పలు ఇళ్ల నిర్మాణాలను రద్దుచేశారు. మిగతా లేఅవుట్లలోనూ ఒకటీఅరా మినహా ఎవరూ ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రాకపోవడంతో జగనన్న కాలనీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
సింగరాయకొండ, ఫిబ్రవరి 16 : ప్రభుత్వం అందించే సహాయం చాలకపోవడం, మంజూరు చేసిన స్థలాలు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. సింగరాయకొండ మండలంలోని 10 గ్రామాల్లో 12 లేఅవుట్‌లలో 3,974 ప్లాట్లు వేశారు. వీటిని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తొలుత 2,766 మందికి గృహనిర్మాణశాఖ నుంచి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. వీరిలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడంతో సింహభాగం లబ్ధిదారులు నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పలు కారణాల వల్ల నిర్మాణాలకు ముందుకురాని 609 మంది లబ్ధిదారులకు మంజూరైన గృహ నిర్మాణ అనుమతులను రద్దు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపారు. వీటిలో ఇప్పటికే 44 ప్లాట్లకు అనుమతులు రద్దుచేశారు. మండలంలో 2,766 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరైతే కేవలం అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి 298 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
ఊళ్లపాలెం లే అవుట్ రద్దు
మండలంలోని ఊళ్లపాలెంలో ఉప్పుపొరలో జగనన్న కాలనీ లేఅవుట్ వేశారు. అక్కడ 356 మందికి ప్లాట్లు కేటాయించి పట్టాలు ఇచ్చారు. సముద్రపు పోటు వచ్చినపుడు కాలనీలోకి నీరు వస్తోంది. అంతేకాకుండా వర్షాలు కురిసినపుడు భారీగా నీరుచేరి ముంపునకు గురువుతుంది. లెవలింగ్ పనులు చేసిన తర్వాత కూడా దాదాపు 3 అడుగులు పల్లంలో లేఅవుట్ ఉంది. దీంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ముందుకు రాకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. లెవలింగ్‌కు రూ.46.50 లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులు ఖర్చుచేశారు. లక్షలు వెచ్చించినా లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో ఊళ్లపాలెం లేఅవుట్‌లో మంజూరు చేసిన గృహాలను పూర్తిగా రద్దు చేశారు.
కనుమళ్లలో చెరువు ఒడ్డున లేఅవుట్
కనుమళ్ల పంచాయతీలో చెరువు సమీపంలో రెండు జగనన్న లేఅవుట్‌లను వేశారు. అందులో మొదటి లేఅవుట్‌లో 186 ప్లాట్లు వేశారు. రెండో లేఅవుట్‌లో 52మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ రెండు లేఅవుట్‌లు చెరువుకు ఒడ్డున, పంటకాలువకు పక్కనే ఉన్నాయి. చెరువులోకి భారీగా నీరు చేరితే లేఅవుట్లు ముంపునకు గురవుతాయి. పక్కనే పంటకాలువ ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ లేఅవుట్‌లో 52 గృహాలను ప్రాఽథమికంగా రద్దు చేశారు.
ఓవీరోడ్డులోని లేఅవుట్‌లో ముందుకురాని లబ్ధిదారులు
సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని ఓవీరోడ్డు పక్కనే అధికారులు 322 ప్లాట్లతో జగనన్న లేఅవుట్‌ను వేశారు. ఈ లేఅవుట్‌లో సింగరాయకొండ, సోమరాజుపల్లికి చెందిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. లేఅవుట్ రోడ్డు కన్నా పల్లపు ప్రాంతంలో ఉంది. సింగరాయకొండ చెందిన లబ్ధిదారులకు స్థానికంగా ఇవ్వకుండా సుదూరంగా ఇళ్లస్థలాలు ఇవ్వడంతో ఇంటి నిర్మాణాలకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ లేఅవుట్‌లో ఒకరు మాత్రమే స్లాబ్ వేశారు. మరొకరు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. దీంతో లేఅవుట్ ఖాళీగా దర్శనమిస్తోంది.
బింగినపల్లి-2లో పిల్లర్లకే పరిమితం
బింగినపల్లి పంచాయతీ పరిధిలో ఊళ్లపాలెం రోడ్డు పక్కన 162 ప్లాట్లతో లేఅవుట్‌ను వేశారు. అందులో ప్లాట్లను సింగరాయకొండ మండలంలో ఉండే ఎస్టీలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ లేఅవుట్ కూడా రోడ్డు కంటే పల్లపు ప్రాంతంలో ఉంటుంది. కనీస సదుపాయాలు లేకపోవడం, పంటచేలు పక్కనే లేఅవుట్ ఉండటంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రాలేదు. ఐదుగురు లబ్ధిదారులు మాత్రం పిల్లర్లు వేసి వదిలివేశారు. సింగరాయకొండకు చెందిన వారికి సుదూరంగా ఊళ్లపాలెం సమీపంలో ఇళ్లస్థలాలు ఇవ్వడం అనాలోచిత నిర్ణయమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కలికివాయిలో స్లాబ్‌లు రెండే..
కలికివాయిలో కూడా ముంపునకు గురయ్యే ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు జగనన్న లేఅవుట్ వేశారు. 99 ప్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లేఅవుట్ పైన ఏరు ఉండటంతో వర్షం కురిసినపుడు లేఅవుట్ మునుగుతుంది. దీంతో లబ్ధిదారులు నిర్మాణానికి ఇష్టపడటం లేదు. కేవలం ఈ అవుట్‌లో ఇరువురు మాత్రమే స్లాబ్‌లు వేశారు. మరో ముగ్గురు బేస్‌మెంట్ వేసి నిలిపివేశారు.
పాకలలో ముందుకు కదలని నిర్మాణాలు
పాకలలో ముంపు ప్రాంతమైన ఉప్పుపంటను సాగుచేసుకునే భూముల్లో 448 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. ఆతర్వాత కొద్దిరోజులకే కురిసిన వర్షానికి లేఅవుట్ చెరువును తలపించింది. ఇక్కడ స్థలాలు మాకొద్దు బాబోయ్ అంటూ లబ్ధిదారులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా 12.73 ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసి 527 ప్లాట్లతో లేఅవుట్‌ను వేశారు. ఈ లేఅవుట్‌లో కూడా అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, నీటివసతి లేకపోవడంతో ఎవరు ముందుకు రావడం లేదు.
ప్రత్యమ్నామ స్థలాల కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు
ఊళ్లపాలెం, కనుమళ్ల, కలికివాయి, ఊళ్లపాలెం రోడ్డులోని బింగినపల్లి-2, ఓవీరోడ్డులోని (సోమరాజుపల్లి పంచాయతీ పరిధి) లేఅవుట్లలోని లబ్ధిదారులు నివాసానికి అనుకూలంగా ఉండేచోట్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. అధికారులు ముంపు ప్రాంతాలు, నివాసానికి వీలుకాని చోట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని వాపోతున్నారు. వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని వేడుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
నాడు జగనన్న కాలనీలకు స్థలాలను ఎంపిక చేయడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నివాసానికి అమోదయోగ్యం కాని భూముల్లో జగనన్న లేఅవుట్లు వేశారు. వెంటనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. అదే అధికారులు వెంటనే నిర్మాణాలను చేపట్టాలని లబ్ధిదారులపై నానా రకాలు ఒత్తిడి తీసుకొస్తున్న ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. లేఅవుట్లలో లెవలింగ్‌కు, అభివుద్ధికి వెచ్చించిన కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ముందుచూపులేని అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2023-02-16T23:36:18+05:30 IST