పంచాయతీరాజ్ నిర్వీర్యం
ABN, First Publish Date - 2023-02-16T01:23:55+05:30
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేవిధంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని సర్పంచ్‌ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు.
సర్పంచ్‌ల పట్ల ప్రభుత్వ తీరు దారుణం
పంచాయతీల నుంచి స్వాహా చేసిన నిధులను కక్కిస్తాం
పార్టీలకతీతంగా వ్యవస్థను కాపాడుకుంటాం
సర్పంచ్‌ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
మూడు జిల్లాల ప్రతినిధులతో సమావేశం
ఒంగోలు(కలెక్టరేట్), ఫిబ్రవరి 15 : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేవిధంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని సర్పంచ్‌ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. గత రెండేళ్ల నుంచి గ్రామాల్లో ఎలాంటి పనులు చేయలేక, చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక ఓ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల సర్పంచ్‌ల సంఘం, చాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యప్రతినిధుల సమావేశం జరిగింది. రాజేంద్రప్రసాద్ మాట్లా డుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటుచేసి సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు. సచివాలయాల నిర్వహణకు పంచాయతీల నుంచి నిధులు చెల్లిస్తూ సర్పంచ్‌లకు ఎలాంటి అధికారాలు లేకుండా చేయడం దారుణమన్నారు. ఇప్పుడు వాటిని వైసీపీ నాయకుల చేతిలో పెట్టేందుకు గృహసారథులు, కన్వీనర్ల నియామకం చేపట్టడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. సచివాలయల నిర్వహణ పంచాయతీల ద్వారా చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాలు ఇదేవిధంగా ఉంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. పంచాయతీలు ఎదుర్కొంటున్న 12 రకాల సమస్యలపై మార్చి ఆఖరులో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల వేతనాలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు.
అధికారపార్టీ నేతలుగా సిగ్గుపడుతున్నాం
సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సుధాకర్ మాట్లాడుతూ అధికారపార్టీ నేతగా తాను సిగ్గుపడుతున్నానన్నారు. జగన్మోహన్‌రెడ్డి సీఎం అయ్యేందుకు ఎంతో కష్టపడ్డామని, ఆ విధంగా తాము కూడా సర్పంచ్‌గా ఎన్నికయ్యామన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ప్రభుత్వం స్వాహా చేసిందని ధ్వజమెత్తారు. సర్పంచ్‌లపై పెత్తనం చేసే విధంగా గృహ సారథులు, కన్వీనర్లను నియమించడం దారుణ మన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చినగానిపల్లి సర్పంచ్ పి.రమేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబును 82వేల మెజారిటీతో గెలిపించుకున్నామన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎన్ని బాధలు పడుతున్నారో, సర్పంచ్‌గా తాను కూడా అలాగే ఇబ్బందిపడుతున్నానని తెలిపారు. రాజేంద్రప్రసాద్ తమ వద్దకు రాలేదని, పంచాయతీల నిధుల సాధనే లక్ష్యంగా ఉద్యమించేందుకు తామే ఆయన్ను ఆశ్రయించామన్నారు. అవసరమైతే పార్టీ జెండాలతో పోరాటం చేసేందుకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర సంఘం బాధ్యులు జి.వీరభద్రాచారి, శివకుమార్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-16T01:23:57+05:30 IST