ఏఈపై వైసీపీ నేత దౌర్జన్యం
ABN, First Publish Date - 2023-04-27T01:53:48+05:30
ఎర్రగొండపాలెం కూరగాయల మార్కెట్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై వివాదం నెలకొంది. బుధవారం విద్యుత్ శాఖ ఏఈ పువ్వాడి శ్రీనివాస్‌పై వైసీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి దౌర్జన్యం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఏర్పాటు విషయమై వివాదం
ఇరువురి మధ్య మాటల యుద్ధం 8 నేను ఇక్కడ పనిచేయలేను: ఏఈ
ఎర్రగొండపాలెం, ఏప్రిల్ 26: ఎర్రగొండపాలెం కూరగాయల మార్కెట్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై వివాదం నెలకొంది. బుధవారం విద్యుత్ శాఖ ఏఈ పువ్వాడి శ్రీనివాస్‌పై వైసీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి దౌర్జన్యం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తాము చెప్పినట్లు ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెలు పక్కకు మార్చకపోతే పనులు చేయొద్దని ఏఈని మూర్తిరెడ్డి పక్కకు తోశారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ఘటనా స్థలం వద్ద ఉన్న తహసీల్దార్ రవీంద్రారెడ్డి ఇద్దరినీ వారించి సర్దుబాబు చేశారు. వివరాల్లోకి వెళితే.. కూరగాయల మార్కెట్ వద్ద రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వాటి నుంచి ఎల్‌టీ లైన్లకు వెళ్లే వైర్లకు చెట్టుకొమ్మలు తగిలి ప్రతిసారీ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ సిబ్బంది మంగళవారం సాయంత్రం చెట్లకొమ్మలు కొట్టే సమయంలో తీగలపై పడి స్తంభాలు ముందుకు వాలిపోయాయి. దిమ్మెలపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పడిపోయాయి. బుధవారం ఉదయం సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా స్థానికులు ఇక్కడ దారి ఉండటంతో దిమ్మెలను పక్కకు మార్చాలని పనులకు అడ్డుతగిలారు. సిబ్బంది, కాంట్రాక్టర్ విషయాన్ని ఏఈకి తెలిపారు. ఏఈ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ అక్కడకు పోలీసులను పంపించారు. విషయం తెలుసుకున్న ఏఎంసీ మాజీ చైర్మన్ మూర్తిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. గతంలో ఈ దారి మీదుగా ఎదురు వీధివారు రాకపోకలు సాగించేవారని, ఇక్కడి నుంచి మరోప్రాంతంలో దిమ్మెలు మార్చాలని వారు సూచించారు. మార్చేందుకు తమకు అనుమతి లేదని ఏఈ తేల్చిచెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో నీవు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదని మూర్తిరెడ్డి ఏఈని నెట్టారు. అక్కడే ఉన్న తహసీల్దార్ ఇద్దరినీ వారించారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వారిని తీసుకెళ్లి రాజీ కుదిర్చారు. మార్కాపురం డీఈ పీవీ నాగేశ్వరరావుతో మాట్లాడి దిమ్మెలు పక్కకు అమర్చేందుకు అనుమతి ఇప్పించారు. దీంతో మధ్యాహ్నం దిమ్మెలు మార్చారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ తాను ఇక్కడ ఉద్యోగం చేయలేనని, ఉన్నతాధికారులకు చెప్పి బదిలీ చేయించుకుంటానని తెలిపారు.
Updated Date - 2023-04-27T01:53:48+05:30 IST