Purandheshwari : జనం కోసం మాట్లాడితే తొక్కేస్తున్నారు
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:01 AM
ప్రజల కోసం ఎక్కడ మాట్లాడినా వారిని సీఎం జగన్ అణచివేతకు గురి చేస్తున్నారు.
పరదాల మాటున
తిరిగే సీఎం అవసరమా?
ఆక్వా కల్చర్ దెబ్బతినడానికి కారణం జగనే
సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న
బీజేపీ నేతల అరెస్టు దారుణం: పురందేశ్వరి
కాకినాడ, డిసెంబరు 29: ‘ప్రజల కోసం ఎక్కడ మాట్లాడినా వారిని సీఎం జగన్ అణచివేతకు గురి చేస్తున్నారు. పరదాల చాటున తిరిగే ఈ సీఎం మనకు అవసరమా..! ప్రజలు ఒకసారి ఆలోచించాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నా రు. జనసేనకు, తమకు మధ్య పొత్తు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు విషయం అధినాయకత్వం చూసుకుంటుందన్నారు. నాణ్యతలేని మద్యం, ఇసుక అక్రమాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగించాలి తప్ప అక్కడ స్థానిక కార్పొరేషన్‌లకు ఉపయోగించకూడదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింహ భాగం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే జరుగుతోందని, అయినా అనుకున్న విధంగా సాయం చేయడం లేదన్న అపవాదు బీజేపీపై వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడిపేస్తోందన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ ఇస్తానని ఇచ్చిన హామీని జగన్ విస్మరించి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ దెబ్బతినడానికి కారణం జగన్మోహన్‌రెడ్డేనన్నారు. శుక్రవారం ఆమె కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేశారు. ముందుగా స్థానిక రామారావుపేటలో పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ బూత్‌స్థాయి ఇన్‌చార్జ్‌లు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం 22 లక్షల ఇళ్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. భీమవరం వస్తున్న ముఖ్యమంత్రికి బీజేపీ తరుఫున వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లబోతున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రజలు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేసి, చెట్లు కొట్టేసి చివరకు సీఎం పైన హెలికాఫ్టర్‌లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ నిలిపివేయడం సరికాదన్నారు. పార్టీ ఎక్కడినుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని అన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 03:01 AM