పల్లెకుచేరని వెలుగులు!
ABN, First Publish Date - 2023-04-05T00:12:11+05:30
రాజాం నియోజకవర్గ కేంద్రం నుంచి సంతకవిటి, వంగర, రేగిడి మండల కేంద్రాలకు చేరుకోవాలంటే సరైన రవాణా సదుపాయం లేదు. ఈ మార్గంలో పరిమిత ఆర్టీసీ సర్వీసులే నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నడుపుతున్నారు. కొన్నేళ్ల కిందట షటిల్ సర్వీసులు ఉండేవి. కానీ రహదారులు బాగాలేవన్న సాకు చూపి ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. రోడ్లు అందుబాటులోకి వచ్చినా వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పల్లెకుచేరని వెలుగులు!
కానరాని ఆర్టీసీ గ్రామీణ సర్వీసులు
ప్రధాన మార్గాలకే బస్సులు పరిమితం
ప్రజలకు తప్పని రవాణా కష్టాలు
ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న వైనం
(రాజాం)
రాజాం నియోజకవర్గ కేంద్రం నుంచి సంతకవిటి, వంగర, రేగిడి మండల కేంద్రాలకు చేరుకోవాలంటే సరైన రవాణా సదుపాయం లేదు. ఈ మార్గంలో పరిమిత ఆర్టీసీ సర్వీసులే నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నడుపుతున్నారు. కొన్నేళ్ల కిందట షటిల్ సర్వీసులు ఉండేవి. కానీ రహదారులు బాగాలేవన్న సాకు చూపి ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. రోడ్లు అందుబాటులోకి వచ్చినా వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖం, సురక్షితం, శుభప్రదం అని అధికారులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు సమయపాలన ఉండదు. వేళకు సరిగ్గా బస్సులు రావు అన్న అపవాదు ఉంది. బస్సుల కండీషన్ తీరు కూడా ఆందోళనకరంగా ఉంది. గమ్యానికి చేరకముందే ఎక్కడ ఆగిపోతాయో తెలియని దుస్థితి. పల్లెవెలుగుల దుస్థితి మరీ దయనీయం. స్టూడెంట్ స్పెషల్ బస్సుల తీరు చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా కాలం చెల్లినవే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో విజయనగరం, ఎస్.కోట, పార్వతీపురం, సాలూరులో ఆర్టీసీ డిపోలున్నాయి. అంతర్ రాష్ట్ర, జిల్లా సర్వీసులతో పాటు గ్రామీణ సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 289 బస్సులు సేవలందిస్తున్నాయి. 193 గ్రామీణ సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు లక్షా 76 వేల కిలోమీటర్ల మేర బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 25 వేల మంది ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 42 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది గ్రామాలున్నాయి. కానీ సర్వీసులు మాత్రం కేవలం 193 మాత్రమే. అవీకూడా మండల కేంద్రాలకు మాత్రమే తిరుగుతున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల దరి చేరడం లేదు. జిల్లా కేంద్రం నుంచి సర్వీసులను పరిశీలిస్తే రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, సాలూరు, పాలకొండల మధ్య ఎక్స్‌ప్రెస్ సర్వీసులే అధికం. కానీ పల్లెవెలుగుల జాడలేదు. పల్లెవెలుగు సర్వీసులు కూడా ప్రధాన మార్గాలకే పరిమితమవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. పేద విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత, రాయితీ బస్ పాసులు అందిస్తోంది. జిల్లాలో వేలాది మంది విద్యా ర్థులు బస్ పాసులు పొంది ఉన్నారు. గ్రామీణ సర్వీసు లకే ఇవి చెల్లుబాటు అవుతాయి. కానీ ఉదయం, సా యంత్రం వేళల్లో బస్సులు అరకొరగానే నడుస్తున్నాయి. దీంతో విద్యార్థుల బాధలు చెప్పనక్కర్లేదు. వేలాడుతూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు.
ప్రయాణికులకు నరకయాతన
పాలకొండ, రాజాం నుంచి ‘ఆర్టీసీ’ ప్రయాణంపై ఆధారపడే ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. గతంలో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, స్టూడెంట్ సర్వీసులతో అన్నివర్గాల వారికి మెరుగైన సేవలందేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతీ 15 నిమిషాలకు పాలకొండ-విశాఖ మధ్య ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడిచేవి. కానీ విజయనగరం జిల్లా చీపురుపుల్లిలో రైల్వే వంతెన నిర్మాణం చేపడుతుండడంతో రాకపోకలను నిలిపివేశారు. దీంతో బస్సులను రాజాం నుంచి పొందూరు, చిలకపాలెం మీదుగా విశాఖకు మళ్లించారు. గతంలో ఉన్న సర్వీసుల్లో భారీగా కొత విధించారు. రాజాంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు మరుగున పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో డిపో ఏర్పాటుపై అధికారులు హడావుడి చేశారు. అప్పటి శ్రీకాకుళం కలెక్టర్ చొరవతో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మునిసిపాల్టీకి చెందిన 1.30 ఎకరాలను సేకరించగలిగారు. ఈ క్రమంలో అక్కడ చిరు వ్యాపారులను ఖాళీ చేయించారు. అయితే ఇది జరిగి మూడేళ్లు గడుస్తున్నా డిపో ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. దీంతో రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు అటు శ్రీకాకుళం, ఇటు పాలకొండ డిపోలకు చెందిన అరకొర సర్వీసులనే కేటాయిస్తున్నారు.
ఆర్టీసీని పునరుద్ధరించాలి
మా గ్రామానికి బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. తొలుత రోడ్డు బాగాలేదన్నారు. ఆ సాకుతో సర్వీసును నిలిపివేశారు. దీంతో ఆగూరు, దోసరి, రామినాయుడువలస, గడిముడిదాం, అమరాం, కొత్త అమరాం గ్రామస్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వీసును పునరుద్ధరించాలి.
- రావుపల్లి సత్యనారాయణ, ప్రయాణికుడు, ఆగూరు
ఆదాయం తగ్గడంతోనే..
గ్రామీణ సర్వీసులు తిరగకపోవడానికి ప్రధాన కారణం రహదారులు బాగాలేకపోవడమే. దీనికితోడు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చాలారూట్లలో కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. అయితే వీలైనన్ని మార్గాల్లో బస్సులు తిప్పుతున్నాం. ప్రజలు ఆర్టీసీ సేవలను ఆదరించాలి.
- పి.వెంకటేశ్వరరావు, డిపో మేనేజర్, పాలకొండ
Updated Date - 2023-04-05T00:12:11+05:30 IST