పందేల బరుల్లో.. షిఫ్ట్ కారు ఆఫర్లు
ABN, First Publish Date - 2023-01-14T21:40:41+05:30
ఉత్తుత్తి ఆంక్షల నడుమ పందెం పుంజులు భోగి రోజున బరుల్లో ఢీకొన్నాయి. ఎక్కడికక్కడ వైసీపీ (YCP) నేతల కనుసన్నల్లోనే బహిరంగంగా ఏర్పాట్లు జరిగాయి...
ఏలూరు: ఉత్తుత్తి ఆంక్షల నడుమ పందెం పుంజులు భోగి రోజున బరుల్లో ఢీకొన్నాయి. ఎక్కడికక్కడ వైసీపీ (YCP) నేతల కనుసన్నల్లోనే బహిరంగంగా ఏర్పాట్లు జరిగాయి. ఏలూరు జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి పందేలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వందల మంది బరుల వద్దకు చేరుకున్నారు. ఏలూరు, చింతలపూడి (Eluru Chintalapudi), కైకలూరు, నూజివీడు, పోలవరం, దెందులూరు వంటి నియోజకవర్గాలన్నింటిలోనూ డజన్ల సంఖ్యలో పందెం బరులు వెలిశాయి. పేకాట, గుండాట విచ్చలవిడిగా సాగింది. వైసీపీ నేతలకు కప్పం చెల్లిస్తున్నామని, అందుకే ధైర్యంగా రంగంలోకి దిగామని జూద ఆట నిర్వాహకులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. కోడి పందేల మాటున పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించారు. కైకలూరు మండలం ఆలపాడులో ఏకంగా వరుసగా ఐదు పందేల్లో పాల్గొని మూడు పందేల్లో ఎవరైతే గెలుస్తారో వారికి షిఫ్ట్ కారు బహుమతిగా ప్రకటించారు. మొదటి రెండు పందేలు లక్ష చొప్పున, చివరి మూడు పందేలు రెండు లక్షలు చొప్పున మొత్తం మీద పది లక్షలు ఒక పందేన్ని ప్యాకేజీగా పెట్టారు.
పశ్చిమ గోదావరి (West Godavari), ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆలపాడు చేరుకోవడంతో శనివారం మధ్యాహ్నం నాటికే బరులన్నీ నిండాయి. పేకాట, గుండాట సరేసరి. విఐపీ (VIP)లకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడమే కాకుండా సీసీ కెమేరాలను అమర్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక నేత దగ్గరుండి మరీ ఈ భారీ బరికి డైరెక్షన్ చేశారు. ఒక్క రోజే ఆలపాడు బరిలో దాదాపు 60 లక్షల మేర అలవోకగా కోడి పందేలు సాగాయి. ఎమ్మెల్యేలు నేరుగా పాల్గొనకపోయినా వైసీపీ అనుచరులే అన్ని బరుల్లోనూ హల్‌చల్ చేశారు. తమకు తిరుగేలేదన్నట్టు వ్యవహరించారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో తెలంగాణకు సరిహద్దున ఉన్న రాఘవాపురం, చింతంపల్లిలలో భారీ బరులు ఏర్పాటు చేశారు. చింతంపల్లికి ఖమ్మం జిల్లా పరిధిలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి వందలాది మంది కోడి పందేల బరులకు తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున రాఘవాపురం బరికి చేరుకున్న కొందరు గుట్టుగా లక్షల్లో పందేలు కాశారు. దెందులూరు నియోజకవర్గంలో కొండలరావుపాలెం దగ్గర నుంచి వీలైన చోటల్లా ఎక్కడికక్కడ బరులు వెలిశాయి.
Updated Date - 2023-01-14T21:40:42+05:30 IST