సందడిగా యువ ఉత్సవ్
ABN, First Publish Date - 2023-06-29T00:35:55+05:30
తమ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో జిల్లాస్థాయి యువ ఉత్సవ్-2023 సందడిగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని కోరారు.
అరసవల్లి, జూన్ 28: తమ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో జిల్లాస్థాయి యువ ఉత్సవ్-2023 సందడిగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచప్రాణాలు (ఐదు సంకల్పాలు) అనుసరించడం ద్వారా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఇది యువతకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. నెహ్రూ యువకేంద్రం అధికారి కె.వెంకట్‌ఉజ్వల్ మాట్లాడుతూ.. బానిసత్వం, వలసవాద మనస్తత్వాల తొలగింపు, వారసత్వ ఐక్యత, సంఘీభావం, పౌరుల్లో కర్తవ్యభావన ఇలా ఐదు అంశాలు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా చర్చ, ఫొటోగ్రఫీ, సాంస్కృతిక, సంప్రదాయ, వారసత్వ ప్రదర్శనలపై అంశాల వారీగా జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి నగదు బహుమతులు, ధ్రువపత్రం, మెమోంటో ఇస్తామని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సెట్‌శ్రీ సీఈవో బీవీ ప్రసాదరావు, మెప్మా పథక సంచాలకులు ఎం.కిరణ్‌కుమార్, టూరిజం అధికారి నారాయణరావు, శవ్వాన ఉమామహేశ్వరి, పంచిరెడ్డి కృష్ణారావు, యువతీ యువకులు పాల్గొన్నారు.
దోచుకోవడమే వైసీపీ అజెండా: ఎంపీ రామ్మోహన్‌నాయుడు
టెక్కలి, జూన్ 28: దోచుకోవడం.. దాచుకోవడమే వైసీపీ అజెండా అని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. బుధవారం టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం అనిచెప్పి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశాడు జగన్‌రెడ్డి అని విమర్శించారు. ఈ దెబ్బతో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. వైసీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం, భూకబ్జాలు, ఇసుక, గనుల దోపిడీకి అలవాటుపడ్డారన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ధరలు పెంచి ప్రజలను పేదరికంలోకి నెట్టేశారన్నారు. ఆదాయ వనరులు పెంచకుండా సర్వనాశనం చేశారని, అందుకే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా ఉన్న వాటిని వెనక్కు పంపారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నార. సంపద సృష్టించే శక్తి చంద్రబాబునాయుడుకే ఉందన్నారు. రెండుసార్లు రాష్ట్రం కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబే గట్టెక్కించార న్నారు. సంక్షేమానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే రాష్ట్రాన్ని ముందుకు నడపాలన్నారు. ఈ సమావేశంలో మామిడి రాము, రెయ్యి ప్రీతీష్, దల్లి ప్రసాద్‌రెడ్డి, లవకుమార్, కాళీ బెహరా, ప్రపుల్లా, వినోద్, మధు, ధవళ శ్రీను తదితరులున్నారు.
Updated Date - 2023-06-29T00:35:55+05:30 IST