ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కణితి విశ్వనాథం ఇకలేరు

ABN, First Publish Date - 2023-04-16T00:04:55+05:30

రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాథం(93) పలాసలోని తన గౌతమ్‌ నివాస్‌లో శనివారం మృతి చెందారు. ఆయన శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా రెండుసార్లు సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

విశ్వనాథం మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, ఇన్‌సెట్‌లో కణితి విశ్వనాథం (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రెండుసార్లు ఎంపీగా జిల్లాకు విశేష సేవలు

- వైద్యుడిగానూ ప్రత్యేక గుర్తింపు

- పలాసలో నేడు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు

పలాస, ఏప్రిల్‌ 15: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ కణితి విశ్వనాథం(93) పలాసలోని తన గౌతమ్‌ నివాస్‌లో శనివారం మృతి చెందారు. ఆయన శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా రెండుసార్లు సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య కణితి లలిత గతేడాది మృతి చెందారు. కుమార్తె శారద, కుమారుడు రాజేంద్రతో కలిసి విశ్వనాథం పలాసలోనే నివసించేవారు. సోమవారం ఆయన ఇంట్లో బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయారు. దీంతో తలకు దెబ్బ తగిలింది. ఇంట్లోనే చికిత్స పొందుతూ కోలుకున్నారు. ఇంతలోనే.. శనివారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయారు. ఎంపీగా ప్రజలకు సేవలు అందించడంతో పాటు జిల్లాలో తొలితరం వైద్యుడిగా మంచి గుర్తింపు పొందారు. ఈయన 70 ఏళ్లకు పైగా(మృతి చెందిన వరకూ) వైద్య సేవలు అందించడం విశేషం. ప్రజావైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఉన్నతశిఖరాలు అందుకున్న విశ్వనాథం మృతితో పలాస-కాశీబుగ్గ జంటపట్టణాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. విశ్వనాథం భౌతికకాయాన్ని పలాసలోని గౌతమ్‌ నివాసంలో ఉంచారు. ఆదివారం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు. కణితి విశ్వనాథం మృతికి సంతాపసూచకంగా మంగళవారం జీడి పరిశ్రమలు బంద్‌ చేస్తున్నట్లు పలాస, ఇంగిలిగాం జీడి పరిశ్రమల సంఘాల అధ్యక్షులు మల్లా సురేష్‌, మల్లా రామేశ్వరరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ప్రస్థానం ఇదీ..

డాక్టర్‌ కణితి విశ్వనాథం 1931 మే 5న నందిగాం మండలం హరిదాసుపురంలో కణితి దొంగన్నచౌదరి, జానకమ్మలకు రెండో సంతానం. ప్రాథమిక విద్య అక్కడే కొనసాగగా, మందస, టెక్కలిలో హైస్కూల్‌ విద్యను అభ్యసించారు. ఆంధ్రాయూనివర్శిటీలో ఎంబీబీఎస్‌ చదువుకొన్నారు. 1964లో లలితతో వివాహం కాగా, అదేరోజు పలాసలో ప్రజావైద్యశాలను ప్రారంభించారు. 1989-91, 1991-96 వరకు శ్రీకాకుళం ఎంపీగా కొనసాగారు. 1996లో విశాఖ-సికింద్రాబాద్‌ వరకు ఉన్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను పలాస వరకూ పొడిగించి ఆయనే స్వయంగా ప్రారంభించారు. అప్పటి ఎంపీలు ద్రోణంరాజు సత్యనారాయణ, కొణతాల రామకృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. మర్రి చెన్నారెడ్డి ఆయన రాజకీయ గురువు కాగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి మంచి స్నేహితుడిగా కొనసాగారు.

రోగులకు ఉదార సేవలు

డాక్టర్‌ కణితి విశ్వనాఽథం తాను స్థాపించిన ప్రజావైద్యశాలలో 1964 నుంచి రోగులకు ఉదారంగా సేవలందిస్తూ వచ్చారు. నామమాత్రపు ఖర్చుతో ఇక్కడ వైద్యం లభించేది. టెక్కలి నుంచి ఇచ్ఛాపురం వరకు అప్పట్లో ఎటువంటి బస్సు సౌకర్యం లేని సమయంలో గుర్రం బండిపై వెళ్లి వైద్యం అందించేవారని చెబుతుంటారు. ఆయన ఇచ్చే మందులు, సూదులు కన్నా రోగులపై విశ్వనాథం చేయి స్పర్శ తగిలితే రోగం నయం అయ్యేదని అంటారు. ఎంపీగా చేసిన తరువాత తన వైద్యశాలలో పూర్తిగా ఉచితంగా వైద్యం అందించేవారు. మరణించే వరకూ ఇదేవిధానం కొనసాగించడం విశేషం. ఈ ప్రాంతప్రజలకు మెరుగైన వైద్యసహాయం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి లయన్స్‌క్లబ్‌ను ఈ ప్రాంతానికి జిల్లాలో మొదటిసారిగా తీసుకువచ్చారు. ఎంతోమంది శిష్యులను ఆయన తయారు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివంగత కొర్ల రేవతిపతి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు ఆయన శిష్యులే. మాజీ ఎంపి దివంగత హనుమంతు అప్పయ్యదొరతో ఎక్కువగా చనువుగా ఉండేవారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో ఇరురాష్ట్రాలు ఉమ్మడిగా ఉండాలని తీవ్ర ప్రయత్నం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీలో చేరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇటీవల ఆయన బౌద్ధమతం తీసుకొని బుద్ధ బోధనలు చేస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవారు.

ప్రభుత్వానికి ఐటీఐ ధారాదత్తం

ఈ ప్రాంతంలో ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడం, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడాన్ని విశ్వనాథం గుర్తించారు. ఈ నేపథ్యంలో 1989లోనే ఐటీఐ నిర్మించి ఎంతోమందికి సాంకేతిక విద్యను అందించారు. ఐదేళ్ల కిందట దీన్ని ప్రభుత్వానికి ధారాదత్తం చేయడంతో పాటు రూ.10కోట్ల విలువైన భవనాలు, స్థలాలు ప్రభుత్వానికి ఉచితంగా అందించి ఉదారత చాటుకున్నారు.

పలువురి సంతాపం

పలాస నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు విశ్వనాథం నివాసానికి చేరుకొని సంతాపం తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు సంతాపం ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆయనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2023-04-16T00:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising