గ్రామాలు ఇక్కడ.. ఆర్బీకేలు ఎక్కడో?
ABN, First Publish Date - 2023-04-10T00:14:49+05:30
మెళియాపుట్టి మండలం రామచంద్రపురంలోని రైతుభరోసా కేంద్రం ఇది. మర్రిపాడు, వెంకటాపురం సచివాలయాల పరిధిలోని రైతులకు ఈ కేంద్రం ద్వారా సేవలందాలి. మర్రిపాడు పరిధిలో దాదాపు 10 గ్రామాల రైతులు 5 కిలోమీటర్ల దూరంలోని కేంద్రానికి వెళ్లి అతికష్టమ్మీద సేవలు పొందుతున్నారు. సాగు సలహాలు, ఇతరత్రా అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గ్రామాలు ఇక్కడ.. ఆర్బీకేలు ఎక్కడో?
ఊరికి దూరంగా రైతుభరోసా కేంద్రాలు
ఇప్పటికీ సొంత భవనాలు కరువు
సిబ్బందికి తప్పని ఇబ్బందులు
రైతులకు అరకొర సేవలు
(మెళియాపుట్టి)
మెళియాపుట్టి మండలం రామచంద్రపురంలోని రైతుభరోసా కేంద్రం ఇది. మర్రిపాడు, వెంకటాపురం సచివాలయాల పరిధిలోని రైతులకు ఈ కేంద్రం ద్వారా సేవలందాలి. మర్రిపాడు పరిధిలో దాదాపు 10 గ్రామాల రైతులు 5 కిలోమీటర్ల దూరంలోని కేంద్రానికి వెళ్లి అతికష్టమ్మీద సేవలు పొందుతున్నారు. సాగు సలహాలు, ఇతరత్రా అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
హిరమండలం మండలం నౌగూడ రైతుభరోసా కేంద్రం ఇది. నిరుపయోగంగా ఉండడంతో స్థానిక గిరిజనులు ఇలా వంట చెరుకు, కర్రలను నిల్వ చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ సహాయకులు సచివాలయాల్లో ఉండి సేవలందిస్తున్నారు. పాత పాఠశాల భవనం కావడంతో విధులకు ఇబ్బందికరంగా ఉంది. దీంతో విడిచిపెట్టారు. దానిని గిరిజనులు అవసరాలకు వినియోగించుకుంటున్నారు.
ఈ రెండు రైతుభరోసా కేంద్రాలదే కాదు. జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు సచివాలయాలకు ఒక ఆర్బీకే కేటాయించడం.. అది ఒక పంచాయతీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండడం, పాత పాఠశాల భవనాల్లో ఏర్పాటుచేయడంతో అక్కడ పనిచేసే సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. మెళియాపుట్టి మండలంలోని కేరాశింగి, ఇలాయిపురం, అంపురం, గొట్టిపల్లి పంచాయతీ గొడ్డలో రైతుభరోసా కేంద్రాన్ని ఏఆర్పటుచేశారు. ఓ ప్రైవేటు భవనంలో ఏర్పాటుచేసినా అరకొర సేవలందించగలుగుతున్నారు. అసలు కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలో రైతుభరోసా కేంద్రాల నిర్వహణ వద్దని కోర్టు ఆదేశాలున్నా బేఖాతరవుతున్నాయి. ఇప్పటికీ చాలాచోట్ల కొనసాగుతున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 655 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 223 కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యింది. 110 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతావి వివిధ ప్రభుత్వభవనాల్లో సర్దుబాటు చేశారు. మొత్తం 423 భవనాలకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అరకొర వసతులు ఉండడంతో అక్కడ విధులు నిర్వహించేందుకు సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. ఎరువులు, ఇతర వస్తువులు నిల్వ చేసేందుకు కూడా ఇబ్బందిపడుతున్నారు. వర్షాలు పడే సమయంలో వీరి బాధలు వర్ణనాతీతం. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది.
త్వరలో అందుబాటులోకి..
రైతుభరోసా కేంద్రాలకు సంబంధించి కొత్త భవనాలు అందుబాటులోకి రాలేదు. ఉన్న భవనాల్లో సిబ్బంది మెరుగైన సేవలందిస్తున్నారు. కానీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొత్త భవనాలు అందుబాటులోకి వస్తే సమస్యలన్నీ తీరుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్బీకేల నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
-ఎల్.మధు, ఏడీఏ, పలాస
Updated Date - 2023-04-10T00:14:49+05:30 IST